శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 13, 2020 , 02:30:59

విశ్వమంతా ఒకే రూపం

విశ్వమంతా ఒకే రూపం

  • బలహీన కరోనా కనుమరుగు
  • విస్తరించిన ‘ఏ2ఏ’ రకం వైరస్‌ 
  • సీసీఎంబీ తుది జన్యు పరీక్షల్లో గుర్తింపు
  • వ్యాక్సిన్‌ తయారీకి ఇదే తగిన సమయం
  • సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌మిశ్రా వెల్లడి

హైదరాబాద్‌ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: భారత్‌లో విస్తరిస్తున్న కరోనా వైరస్‌ ప్రధానంగా రెండు రకాలు. ఒకటి బలహీనమైది, మరొకటి తీవ్రత ఎక్కువ ఉన్నది. దక్షిణాదిలో బలహీనమైన వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్నది. ఇది మొన్నటి మాట. కానీ నేడు భిన్నమైన పరిస్థితి. మొదట వైరస్‌ను రెండురకాలుగా వర్గీకరించిన హైదరాబాద్‌లోని సీసీఎంబీ.. నేడు పరిస్థితి మారిందంటున్నది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒకే రకమైన వైరస్‌ మనుగడలో ఉన్నట్టు గుర్తించింది. దక్షిణ భారతంలో ఎక్కువగా ఉన్న తక్కువ తీవ్రత ఉన్న ‘ఏ3ఐ’ రకం క్షీణించిందని సీసీఎంబీ జీనోమ్‌ సీక్వెన్సీ తుది పరీక్షల్లో వెల్లడైంది. 

ప్రస్తుతం భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా మనుగడలో ఉన్న వైరస్‌ ఒకే రకమైనదని తమ పరిశోధనలో తేలిందని సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌మిశ్రా ‘నమస్తే తెలంగాణ’కు వివరించారు. వైరస్‌ ఆర్‌ఎన్‌ఏ జన్యురూపంలో మార్పులు (మ్యుటేషన్‌) లేవని స్పష్టంచేశారు. కరోనా జన్యుక్రమంలో మార్పుల గుట్టును విప్పడానికి  రాకేశ్‌మిశ్రా నేతృత్వంలో రెండునెలలుగా జీనోమ్‌ సీక్వెన్సీ పరిశోధనలు ముమ్మరంగా సాగాయి. ఇందుకు పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ల్యాబ్‌ కూడా తన వంతు సహకారమందించింది. మొదటిదశలో 100కుపైగా వైరస్‌ నమూనాల జన్యువులను వేరుచేసి లోతుగా పరిశీలించారు. ఈ పరిశోధనల్లో కరోనా జన్యువుల్లో తేడాలను స్పష్టంచేయగలిగారు. దేశంలో ప్రధానంగా రెండురకాలుగా ఉన్నట్టు గుర్తించారు.

విస్తరించిన ఏ2ఏ రకం వైరస్‌

తెలంగాణతోపాటు కేరళ, తమిళనాడు, ఏపీలో వ్యాపిస్తున్న వైరస్‌, మహారాష్ట్ర, గుజరాత్‌వంటి రాష్ర్టాల్లో విస్తరిస్తున్న వైరస్‌కు స్పష్టమైన తేడా ఉన్నదని సీసీఎంబీ జీనోమ్‌ సీక్వెన్సీ పరీక్షల్లో స్పష్టమైంది. దక్షిణాదిలో మనుగడలో ఉన్న వైరస్‌కు ‘క్లేడ్‌ ఏ3ఐ’గా నామకరణంచేశారు. ఉత్తర, మధ్య భారతంలో విస్తరిస్తున్న వైరస్‌కు ‘క్లేడ్‌ ఏ2ఏ’గా వ్యవహరిస్తున్నారు. ఈ రెండు వైరస్‌లలో తేడా స్పష్టంగా ఉన్నట్టు సీసీఎంబీ తుదిదశ జన్యుక్రమ పరీక్షల్లో తేలింది. దక్షిణాదిలోని వైరస్‌.. సింగపూర్‌, పిలిప్పీన్స్‌లో వ్యాప్తిచెందుతున్న వైరస్‌ జన్యుక్రమం ఒక్కటిగా ఉన్నదని నిర్ధారించారు. దక్షిణ భారతంలో వైరస్‌ కొంత బలహీనంగా ఉన్నదని సీసీఎంబీ పరిశోధకులు ఒక నిర్ధారణకు వచ్చారు. దేశంలోని ఇతర రాష్ర్టాల కంటే దక్షిణాదిలో మరణాల రేటు తక్కువగా ఉండటానికి ఇది ఒక కారణం కావచ్చని సీసీఎంబీ శాస్త్రవేత్తలు లోగడ అభిప్రాయపడ్డారు. కానీ తుదిదశలో మరో 100 నమూనాలను పరిశీలించిన సీసీఎంబీ బలహీన వైరస్‌గా భావిస్తున్న ‘క్లేడ్‌ ఏ3ఐ’ వేగంగా క్షీణించినట్టు గుర్తించింది. దాని స్థానంలో కాస్త బలంగా ఉన్న వైరస్‌ ‘క్లేడ్‌ ఏ2ఏ’ విస్తరించినట్టు తేల్చింది.

వ్యాక్సిన్‌ తయారీకి అనుకూలం

సీసీఎంబీలో 200 నమూనాలను పరిశీలించినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా, దేశంలో వ్యాపిస్తున్న కరోనా జన్యురూపాలను వివిధ పద్ధతుల ద్వారా విశ్లేషించాం. ప్రస్తుతం విశ్వవ్యాప్తంగా మనుగడలో ఉన్న వైరస్‌కు, దేశంలోని వైరస్‌కు తేడా కనిపించడంలేదు. మొదట్లో దక్షిణాదిలోని వైరస్‌కు దేశంలోని ఇతర ప్రాంతాల్లో వ్యాప్తిచెందిన దానికి తేడా ఉన్నదని గమనించాం. సింగపూర్‌, ఇరాన్‌, పిలిప్పీన్స్‌లలో సోకిన వైరస్‌కు దక్షిణ భారతంలోని వైరస్‌ జన్యుక్రమానికి చాలా దగ్గర పోలిక ఉన్నదని నిర్ధారణకు వచ్చాం. గుజరాత్‌, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ర్టాలలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నదని వైరస్‌ మార్పులో తేడా ఉన్నదనిచెప్పారు. ఇక్కడి కరోనా జన్యువు.. అమెరికా, చైనా, ఇటలీ దేశాలలోని కరోనా జన్యువుతో సరిపోలుతున్నట్టు తేలింది. కానీ తుదిదశ ప్రయోగాల్లో తక్కువ తీవ్రత ఉన్న ‘క్లేడ్‌ ఏ3ఐ’ వేగంగా క్షీణించినట్టు గుర్తించాం. ఇది దాదాపు 95శాతం ఉనికిని కోల్పోయింది. ఈ పరిణామం ఒక రకంగా మంచిదే. వ్యాక్సిన్‌ ఇతర ఔషధాల తయారీకి ఉపయుక్తంగా ఉంటుంది.  

- రాకేశ్‌మిశ్రా, సీసీఎంబీ డైరెక్టర్‌


logo