ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Oct 25, 2020 , 02:31:11

కరోనాకు సీసీఎంబీ టీకా!

కరోనాకు సీసీఎంబీ టీకా!

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా కట్టడికి టీకా అభివృద్ధిచేసేందుకు హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయోలజీ (సీసీఎంబీ) రంగంలోకి దిగింది. దిగ్గజ ఫార్మా సంస్థ అరబిందోతో కలిసి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే వ్యాక్సిన్‌ తయారీ ప్రక్రియ ప్రారంభమైందని సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌మిశ్రా పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రూఫ్‌ ఆఫ్‌ కాన్సెప్ట్‌ తయారీపై దృష్టిసారించినట్టు చెప్పారు. వ్యాక్సిన్‌ తయారీకి సమగ్ర ప్రణాళిక రూపొందించడాన్ని ప్రూఫ్‌ ఆఫ్‌ కాన్సెప్ట్‌ అంటారు. ఏ మార్గంలో.. ఎన్ని దశల్లో.. ఏ రకంగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తే టీకా విజయవంతం అయ్యే అవకాశం ఉన్నదో వివరిస్తూ ప్రణాళిక రూపొందిస్తారు. ప్రస్తుతం సీసీఎంబీలో మూడు రకాల రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తున్నట్టు రాకేశ్‌మిశ్రా వివరించారు. ఇందుకు 4నుంచి 5 నెలలు పడుతుందని చెప్పారు. ఇందుకు కావాల్సిన ఆర్థిక సహకారాన్ని అరబిందో అందిస్తుంది. ఆ తర్వాత ప్రూఫ్‌ ఆఫ్‌ కాన్సెప్ట్‌ను అరబిందో ఫార్మాకు అప్పగిస్తారు. టీకా అభివృద్ధి, జంతువులు, మనుషులపై ప్రయోగాలు, అనుమతులు, వాణిజ్య ఉత్పత్తి వంటివన్నీ అరబిందో ఫార్మా చేపట్టాల్సి ఉంటుంది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా టీకా పరిశోధనలు మొదలైనప్పటి నుంచే సీసీఎంబీపై ఒత్తిడి పెరిగింది. అయితే టీకా అభివృద్ధి ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ అని, సరైన వ్యాపార భాగస్వామి దొరికేవరకు టీకాపై దృష్టి పెట్టబోమని సీసీఎంబీ పేర్కొన్నది.