మంగళవారం 26 మే 2020
Telangana - May 05, 2020 , 01:51:17

సీసీఎంబీ సెల్‌ థెరపీ

సీసీఎంబీ సెల్‌ థెరపీ

  • ఊపిరితిత్తి కణాలపై వైరస్‌ ప్రయోగం 
  • సీసీఎంబీ, ఐస్టెమ్‌ మధ్య ఒప్పందం 

ప్రపంచవ్యాప్తంగా మానవాళిని గడగడలాడిస్తున్న కరోనా వ్యాధి అంతు తేల్చేందుకు సీసీఎంబీ, బెంగళూరుకు చెందిన ఐస్టెమ్‌ సంస్థలు జట్టుకట్టాయి. రోగ లక్షణాలను స్పష్టంగా తెలుసుకొని, దానికి విరుగుడు కనుగొనేందుకు సెల్‌ థెరపీ ద్వారా వైరస్‌ కణాలను మనుషుల ఊపిరితిత్తులపై ప్రయోగించనున్నారు. 

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సెంటర్‌ ఫర్‌ మాలిక్యులర్‌ అండ్‌ సెల్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ), బెంగళూరుకు చెంది న ‘ఐస్టెమ్‌ రీసెర్చ్‌ప్రైవేట్‌ లిమిటెడ్‌' మధ్య సోమవారం కీలక ఒప్పందం కుదిరింది. ఇప్పటికే ఆఫ్రికన్‌ గ్రీన్‌ మంకీ మూత్రపిండాల నుంచి సేకరించిన కణాలపై వైరస్‌ను ప్రయోగించి పరిశీలిస్తున్న సీసీఎంబీ తాజాగా మనుషుల కణాలపై ‘సెల్‌ థెరపీ’ని మొదలుపెట్టనున్నది. ఇందుకు  అవసరమైన మానవ ఊపిరితిత్తుల్లోని ఎపిథిలియల్‌ కణాలను ఐస్టెమ్‌ సంస్థ సమకూర్చనున్నది. ఈ సెల్‌ థెరపీ ద్వారా కరోనా వైరస్‌ మానవ కణాలపై ఏ విధంగా ప్రభావం చూపుతున్నదో తెలుసుకుని రోగ లక్షణాలను స్పష్టంగా ఆవిష్కరించవచ్చని సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా తెలిపారు. 

ఐస్టెమ్‌ అందించే  కణవ్యవస్థ ‘ఏసీఈ2 గ్రాహకం’ ద్వారా వైరస్‌ ప్రభావాన్ని  గుర్తించనున్నామని చెప్పారు. మానవులలో వృద్ధిచెందుతున్న కరోనా వైరస్‌ కణాలను బయట పరిశోధనశాలల్లో వృద్ధి చేయడం సాంకేతికంగా పెద్ద సవాలుగా మారిందని రాకేశ్‌ మిశ్రా చెప్పారు. ఐస్టెమ్‌ సంస్థ అందించే ఎపిథిలియల్‌ కణాల ద్వారా వ్యాధి లక్షణాలను తెలుసుకునే ప్రయోగం మరింత సులభతరమవుతుందని ఆయన ‘నమస్తే తెలంగాణ’తో చెప్పారు.  కరోనా వైరస్‌ మానవ ఊపిరితిత్తులపైనే దాడి చేస్తున్నదని ఐస్టెమ్‌ అందించే ఎపిథిలియల్‌ కణాలపై వైరస్‌ను ప్రయోగించడం వల్ల సత్వర ఫలితాలుండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. మనుషులపై వైరస్‌  ఏ విధంగా ప్రభావం చూపుతుంది వాటి లక్షణాలు ఏమిటనేది  తెలుసుకోవడం ద్వారా ఔషధాల తయారీతో పాటు వ్యాక్సిన్‌ను రూపొందించడానికి అవసరమైన సాంకేతిక సాయాన్ని అందించవచ్చని చెప్పారు. మరో నాలుగు రోజులలో ఈప్రయోగాలను మొదలుపెడతామని మిశ్రా తెలిపారు. ఆధునిక జీవ శాస్త్ర పరిశోధనలలో అత్యంత కీలకపాత్ర పోషిస్తున్న  సీసీఎంబీతో కలిసి పనిచేయడం తమకు లభించిన మంచి అవకాశంగా భావిస్తున్నామని ఐస్టెమ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ జొగిన్‌ దేశాయ్‌ వెల్లడించారు.


logo