సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 08, 2020 , 02:05:34

భూత్‌ బంగ్లా

భూత్‌ బంగ్లా

 • ఎలుకలు.. గబ్బిలాలు.. వేలాడే కరెంట్‌ తీగలు 
 • పాత సచివాలయంలో గుహల్లాంటి చీకటి గదులు 
 • గాలి రాదు.. గబ్బు పోదు
 • ఊడిపడే పెచ్చులు.. ముంచుకొచ్చే ప్రమాదాలు 
 • భద్రత లేదు.. ఫైరింజన్‌ తిరుగదు
 • ఫైళ్లు పెట్టుకోలేం.. సమావేశాలు నిర్వహించుకోలేం 
 • పాలనకు పనికిరాని పాత సెక్రటేరియట్‌

ఏ గదిలో అడుగుపెడితే ఏమైతదో తెలువదు. ఎక్కడి నుంచి ఎలుకలు వస్తాయో.. గబ్బిలాలు మీదపడతాయో అర్థంకాదు. ఏ మూలచూసినా పెచ్చులు ఊడిపోయి.. ఎప్పుడు కూలుతదో అన్నట్టుంటది. ఫైళ్లకు చోటుండదు.. గాలి రాదు.. గబ్బు పోదు.. గోడలెంబడి వేలాడే కరెంటు తీగలు ఎక్కడ షాక్‌కొడ్తయో అన్న ఆందోళన.. బ్లాకులకొద్దీ బంగ్లాలుంటయి.. ఏ ఒక్క బ్లాకూ సక్కంగుండదు.

పేరుకు సచివాలయం.. ఒక బ్లాకులో ముఖ్యమంత్రి.. మరో బ్లాక్‌లో కొందరు మంత్రులు.. ఇంకో బ్లాకులో మరికొందరు.. అధికారులు మరోచోట.. ఒక అధికారి మంత్రిని కలువాలంటే.. ఒక బ్లాకు నుంచి మరో బ్లాకుకు పోవాలి.. ఒక ఫైలు ఆమోదానికి బ్లాకుల

వారీగా చక్కర్లు కొట్టాలి. సచివాలయానికి వస్తే ఎందుకొచ్చాంరా అనిపించేట్టుంటుంది.


హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పాత సచివాలయం అచ్చం భూత్‌బంగ్లాను తలపిస్తుంది. భవనాలన్నీ గాలికి కొట్టుకొచ్చినట్టు, విసిరి పారేసినట్టు కనిపిస్తాయి. ఏ ఒక్క బ్లాకూ సరిగ్గా ఉండదు. రాష్ర్టానికి చెందిన రహస్య, కీలక ఫైళ్లు దాచుకోడానికి చోటుండదు. ప్రభుత్వ సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌ పెట్టుకొనే వీలులేదు. కరోనా లాంటి పరిస్థితులు వస్తే పరిపాలన సాగించడానికి అధునాతన సౌకర్యాలు లేవు. ఏ ప్రమాదం వచ్చినా ప్రాణాలు పోవుడే. గాలి, వెలుతురు లేకుండా చీకటి కొట్టాల్లా ఉంటాయి ఆ బంగ్లాలు. 25 ఎకరాల విస్తీర్ణంలో అడ్డదిడ్డంగా భవనాలు కట్టడంతో సహజ వెలుతురు లేకుండా పోయింది. పట్టపగలే లైట్లు వేసుకోవాల్సిన పరిస్థితి. విద్యుత్తు వైరింగ్‌ లోపాల వల్ల పదేండ్లలో 34 అగ్ని ప్రమాదాలు జరిగాయి. ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే స్పైడర్‌మ్యాన్‌ అవతారం ఎత్తాల్సిందే.

 అగ్నిప్రమాదం జరిగితే మంటలు ఆర్పేందుకు ఫైరింజన్‌ తిరగడానికి కూడా చోటు లేదు. చివరికి సిబ్బంది ఒక్కచోట తినడానికి క్యాంటీన్‌ కూడా సరిగ్గా లేదు. సచివాలయంలో ఉన్న పది బ్లాక్‌లు అక్కడొకటి, ఇక్కడొకటి అన్నట్లు విసిరేసినట్టు ఉండటంతో ఫైళ్లకు రక్షణలేని పరిస్థితి ఏర్పడింది. పాడుబడిన ఈ బంగ్లాల్లో ఎలుకలు ఆవాసాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. చాలాసార్లు కరెంటు వైర్లు, కేబుల్‌ వైర్లను కొరకడంతో షార్ట్‌సర్క్యూట్‌ అయ్యి అగ్ని ప్రమాదాలు జరిగాయి. లెక్కలేనన్ని ఫైళ్లు బూడిదయ్యాయి. ఒక శాఖ నుంచి మరో శాఖకు ఫైలును తీసుకెళ్లే క్రమంలో వర్షం పడితే ఫైళ్లు నీళ్లలపాలయ్యేవి. అంతేకాదు.. ఏ క్షణంలో ఏ పెచ్చు ఊడి నెత్తి మీద పడుతుందో తెలియని దుస్థితి పాత సచివాలయానిది. మంత్రులు ఒక చోట కొలువు దీరితే, అధికారుల కార్యాలయాలు ఇంకోచోట, శాఖల సెక్షన్లు మరోచోట ఉంటాయి. దీంతో మంత్రులకు, అధికారులకు, సిబ్బందికి మధ్య సమన్వయం కొరవడేది.  ఫైల్‌ సర్క్యులేషన్‌లో గ్యాప్‌ ఏర్పడేది. ఏ ఫైల్‌ ఎటు వెళుతుందో తెలియని గందరగోళ పరిస్థితులు ఉండేవి. ఓ విదేశీ మంత్రి హైదరాబాద్‌కు వచ్చినపుడు సెక్రటేరియట్‌లోని సీఎం చాంబర్‌కు వస్తూ గుహలోకి వస్తున్నట్టున్నదని వ్యాఖ్యానించారు. 

నిపుణుల కమిటీ నివేదికలోని అంశాలివే..

 • ప్రస్తుత సచివాలయ భవనం మార్పులుచేసి కొనసాగించటానికి అనువుగా లేదు. 
 • ఏ, బీ, సీ, డీ, జీ, హెచ్‌ నార్త్‌, జే, కే బ్లాకుల్లో  అగ్నిప్రమాదం జరిగితే ఫైరింజన్లు వెళ్లే వీల్లేదు.
 • పలు భవనాల జీవితకాలం 50-60 ఏండ్లే. నీటిపైపులు,కరెంటుతీగల జీవితకాలం పాతికేండ్లే. 
 • ప్రస్తుత సెక్రటేరియట్‌ భవనాల్లో గడిచిన నాలుగేండ్లలో షార్ట్‌సర్క్యూట్‌వల్ల మూడు అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
 • ప్రస్తుత భవనాలకు ఎంత ఖర్చుచేసినా గ్రీన్‌బిల్డింగ్‌ ప్రమాణాలు అందుకోలేము.
 • పాత విద్యుత్తు వైర్ల వల్ల విద్యుత్తు బిల్లు ఏటా రూ.5 కోట్లు చెల్లించాల్సి వస్తున్నది.
 • ప్రస్తుత సెక్రటేరియట్‌లో పార్కింగ్‌ లేదు. 
 • ప్రస్తుతం సీఎంవో అధికారులు, మంత్రులు, ఇతర అధికారులు వేర్వేరు బ్లాకుల్లో ఉంటున్నారు. రహస్యమైన డాక్యుమెంట్లు, ఫైళ్లు వివిధ బ్లాకులకు తిప్పడం వల్ల అధికార రహస్యాలు బహిర్గతమవుతున్నాయి.
 • ప్రస్తుత సచివాలయంలో 150 మందితో సమావేశం పెట్టుకోవడానికి కూడా అవకాశం లేదు.
 • విదేశీ ప్రతినిధులు, కేంద్రప్రభుత్వ ప్రతినిధులు సచివాలయానికి వస్తే వారికి స్వాగత ఏర్పాట్లు చేయటానికి అనువైన స్థలం లేదు.
 • సిబ్బందికి భోజనహాలు లేదు. సందర్శకుల గది లేదు. కొత్త భవనం కడితే ఇవన్నీ సమకూర్చడం సాధ్యమవుతుంది.
 • ప్రస్తుత సెక్రటేరియట్‌లో వీవీఐపీ, వీఐపీలకు భద్రత లేదు. అధికారులు, సందర్శకులు అందరికీ ఒకటే ఎంట్రన్స్‌, ఒకే ఎగ్జిట్‌.
 • ఆయా బ్లాకుల్లో లోనికి వెళ్లాలన్నా, బయటకు రావాలన్నా ఒకటే మార్గం ఉన్నది. ఇది భద్రతకు ఏమాత్రం క్షేమకరం కాదు.

నిబంధనలన్నీ గాలికి

సచివాలయ నిర్మాణంలో పరాయి పాలకులు గ్రీన్‌ బిల్డింగ్‌ నిబంధనలను పాటించలేదు. పట్టణ భవన నిర్మాణ నిబంధనల ప్రకారం స్థలంలో 30 నుంచి 40% వరకు మాత్రమే నిర్మాణాలు ఉండాలి. మిగిలిన స్థలంలో పార్కులు, రోడ్లు ఉండాలి. కానీ దీనికి విరుద్ధంగా 17.50 ఎకరాల్లో భవనాలు నిర్మించి ఏడెకరాల్లో ఖాళీ స్థలం ఉంచారు. దీని వల్ల పార్కింగ్‌ సమస్యలు ఎదురవుతున్నాయి. కనీసం వంద కార్లు కూడ పార్కింగ్‌ చేసుకునే అవకాశంలేదు. ముఖ్యమంత్రి అత్యవసరం కోసం ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌ను పార్కింగ్‌గా వాడుకున్నారు. బైక్‌లను సచివాలయ రోడ్లపై పార్క్‌చేస్తున్నారు. మంత్రుల కాన్వాయ్‌లు పార్కింగ్‌ చేయడానికి స్థలం లేదు. ప్రతిరోజూ దాదాపు రెండు వేల వరకు సచివాలయానికి వస్తాయి. సచివాలయ అధికారుల కార్లు 500, విజిటర్ల కార్లు 700 వరకు సగటున ఉంటాయి. వీటన్నింటిని నిలిపే పరిస్థితి లేదు.

పాత సచివాలయానికి 132 ఏండ్ల చరిత్ర..

పాత సచివాలయానికి 132 ఏండ్ల చరిత్ర ఉంది. 1888లో ఆరవ నిజాం నవాబు కాలంలో 25.50 ఎకరాల విస్తీర్ణంలో సర్వహిత(జీ) బ్లాక్‌ను నిర్మించి సైఫాబాద్‌ ప్యాలెస్‌ పేరుతో ఇక్కడ నుంచి పరిపాలన చేశారు. భారత్‌లో విలీనమయ్యాక హైదరాబాద్‌ రాష్ట్ర పాలన ఇక్కడినుంచే సాగింది. ఉమ్మడి ఏపీతో సహా 16 మంది సీఎంలు ఈ సచివాలయం నుంచే పాలించారు. తెలంగాణ ఏర్పడ్డాక తొలి పాలనా కేంద్రంగానూ ఈ సచివాలయం చరిత్రలో నిలిచింది. 132 ఏండ్లలో 10 బ్లాకులను నిర్మించారు. ఏ బ్లాక్‌ భవనాన్ని 1981లో అప్పటి సీఎం టీ అంజయ్య ప్రారంభించారు. 1978లో సీ బ్లాక్‌ను ఆ నాటి సీఎం చెన్నారెడ్డి ప్రారంభించారు. ఇందులోనే సీఎంలు కొలువుదీరి పాలన చేశారు. కే చంద్రశేఖర్‌రావు సీఎం పదవి చేపట్టాక కొంతకాలం ఇక్కడి నుంచే పరిపాలన సాగించారు. ఈ భవనం భద్రత, పార్కింగ్‌, మౌలిక సదుపాయాల రీత్యా సరిగ్గా లేకపోవడంతో ప్రగతి భవన్‌ను నిర్మించాక అక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఏ బ్లాక్‌ ఫేజ్‌ 2 ను 1998లోచంద్రబాబు, డీ బ్లాక్‌ను 2004లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారు. జే,ఎల్‌ బ్లాక్‌లను 1990లో అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి ప్రారంభించారు.

ఎప్పుడూ ప్రాణభయమే

 • సీ బ్లాక్‌ వద్ద మింట్‌ కాంపౌండ్‌ దిక్కున సెక్యూరిటీ కూడా ఉండదు. అగ్నిమాపక వ్యవస్థ లేదు.
 • డీ బ్లాక్‌ సీఎం బ్లాక్‌కు ఎదురుగా ఉంటుంది. భారీగా డబ్బు పోసి కట్టారు. ఒక్క రక్షణ చర్య లేదు. సరిగా వెంటిలేషన్‌ ఉండదు.
 • నిజాం కాలంలో కట్టిన జీ బ్లాక్‌ పాడుబడి గబ్బిలాలకు, చీడపురుగులకు నిలయంగా మారింది.
 • కే బ్లాక్‌లో దస్ర్తాలు భద్రపరిచే ప్రాంతం శిథిలమైంది. అక్కడ 1956 నుంచి కీలక దస్ర్తాలున్నాయి. సాలర్‌జంగ్‌ ఎస్టేట్‌, జాగీర్‌, రెవెన్యూ, హోం శాఖల కీలక పత్రాలు ఉన్నాయి. ఆ బ్లాక్‌ను చూస్తే ఎగుడుదిగుడుగా కనిపిస్తుంది.
 • జే బ్లాక్‌లోకి ఎవరైనా పోవచ్చు. లుంబిని పార్క్‌ వైపు ఫేసింగ్‌ ఉంటుంది. 
 • సీఎం కూర్చునే బ్లాక్‌ చుట్టు కూడా ఫైరింజన్‌ తిరగలేదు. పరిసరాలన్నీ ఇరుకుగా ఉంటాయి.logo