బుధవారం 20 జనవరి 2021
Telangana - Jan 13, 2021 , 20:28:05

దొరికిన రూ.5.5 లక్షల నగదు బ్యాగు

దొరికిన రూ.5.5 లక్షల నగదు బ్యాగు

వైరా : రోడ్డు మీద పోయిన రూ.5.5 లక్షల నగదు బ్యాగు దొరికింది. సీసీ పుటేజీల ఆధారంగా నగదు బ్యాగు దొరికిన వారిని గుర్తించి ఆ బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. నగదు బ్యాగును ఇంట్లో దాచి హైదరాబాద్‌ వెళ్లిన వ్యక్తిని పోలీసులు ప్రశ్నించాల్సి ఉంది. బాధితుడు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఖమ్మం జిల్లా వైరా సొసైటీ ఆవరణంలోని చిట్‌ఫండ్ కార్యాలయంలో అనుమోలు భాస్కర్‌రావు రూ.5.5 లక్షల నగదు బ్యాగుతో ద్విచక్ర వాహనంపై శాంతినగర్‌ ఐరన్‌ సిండికేట్‌ వద్దకు వెళ్తుండగా మధ్యలో బ్యాగు జారి రోడ్డుపై పడిపోయింది. 

భాస్కర్‌రావు వెనుక వస్తున్న కొణిజర్ల మండలం లాలాపురానికి చెందిన ఆకుకూరల వ్యాపారి హుస్సేన్‌ ఆ బ్యాగును గుర్తించి తీసుకొని వెళ్తుండగా ఆయన వెనుక వస్తున్న వైరా రామాలయానికి సమీపంలోని ఐరన్‌ సిండికేట్‌లో పనిచేస్తున్న శాంతినగర్‌కు చెందిన మహేశ్‌ హుస్సేన్‌ను ఆపి ఆ బ్యాగు తనదని చెప్పి తీసుకున్నాడు. ఆ తర్వాత నగదు బ్యాగును తన వెంట తీసుకెళ్లి ఇంట్లో దాచిపెట్టాడు. అయితే భాస్కర్‌రావు బంధువులు, మిత్రులతో కలిసి బ్యాగుపోయిన ప్రాంతం నుంచి పెట్రోల్‌ బంకులు, అయ్యప్ప ఆలయం, వివిధ చోట్ల ఉన్న సీసీ కెమెరాల పుటేజీని సేకరించి ఆరాతీశారు. 

పుటేజ్‌లో కనిపికంచిన వ్యక్తి లాలాపురానికి చెందిన హుస్సేన్‌గా గుర్తించారు. ఆ తర్వాత పోలీసుల సహాయంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ప్రశ్నించగా తన దగ్గర బ్యాగు తీసుకున్న యువకుడి ఆనవాలు వివరించారు. ఆ తర్వాత మళ్లీ సీసీ పుటేజీ ఆధారంగా ఆ బ్యాగు తీసుకున్నది మహేశ్‌గా గుర్తించారు. వెంటనే మహేశ్‌ను ఆరా తీయగా బ్యాగు తమ ఇంట్లో ఉందని చెప్పాడు. ఆ నగదు బ్యాగును స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించారు.


logo