మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 07, 2020 , 02:46:41

ఆదాబ్‌ హైదరాబాద్‌ విలేకరిపై కేసు

ఆదాబ్‌ హైదరాబాద్‌ విలేకరిపై కేసు

  • సీఎం కేసీఆర్‌పై తప్పుడు వార్త రాసినందుకు ఫిర్యాదు
  • పోలీసుల అదుపులో విలేకరి

బంజారాహిల్స్‌: సీఎం కేసీఆర్‌కు కరోనా సోకిందంటూ తప్పుడు వార్త రాసిన ఆదాబ్‌ హైదరాబాద్‌ పత్రిక విలేకరిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదుచేశారు. విలేకరితోపాటు పత్రిక యాజమాన్యంపైనా కేసు పెట్టారు. రెండురోజుల క్రితం ఆదాబ్‌ హైదరాబాద్‌ ఈ పేపర్‌లో ‘సీఎం కేసీఆర్‌కు కరోనా’.. హరితహారం కార్యక్రమంలో సోకిందా? అన్న శీర్షికతో మొదటి పేజీలో వార్త ప్రచురించారు. రహ్మత్‌ నగర్‌లో ఉంటున్న మహ్మద్‌ ఇలియాస్‌ అనే టీఆర్‌ఎస్‌ కార్యకర్త ఈ వార్త చదివి షాక్‌కు గురయ్యాడు. దీంతోపాటు ప్రగతిభవన్‌లో 30 మందికి కరోనా సోకిందంటూ రాయడంతో ఇలియాస్‌ వార్తలోని నిజానిజాలపై వాకబుచేయగా అధికారులు ఎవరూ ధ్రువీకరించలేదని తెలిసింది. దీంతో అతను జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారు. ఈ మేరకు ఆదాబ్‌ విలేకరి అనం చిన్ని వెంకటేశ్వర్‌రావుతోపాటు పత్రిక యాజమాన్యంపై ఐపీసీ 505(1)(బీ),505(2), రెడ్‌విత్‌ 34తో పాటు 54ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. నిందితుడు వెంకటేశ్వరరావును సోమవారం అదుపులోకి తీసుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు విచారణ చేస్తున్నారు.


logo