ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 12, 2020 , 02:26:45

రెట్టింపు వల.. 4.5 కోట్లు గుల్ల

రెట్టింపు వల.. 4.5 కోట్లు గుల్ల

  • 3 వేల మంది కొంప ముంచిన అత్యాశ
  •  బిచాణా ఎత్తేసిన కిమ్‌, అనుబంధ సంస్థలు

మనిషి ఆశా జీవి.. ఆశ ఉంటే పర్వాలేదు.. కానీ అత్యాశే అమాయకులను నిండాముంచుతున్నది. ఆ అత్యాశనే ఆసరాగా చేసుకొని కొందరు కేటుగాళ్లు కోట్లు కూడబెట్టుకొని బిచాణా ఎత్తేస్తుండటంతో బాధితులు లబోదిబోమంటున్నారు. పోలీసులు ఎంత హెచ్చరిస్తున్నా కొందరు అమాయకులు ముఠాల మాయమాలను నమ్మి ఇల్లు గుల్లచేసుకుంటున్నారు.

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: తమ వద్ద పెట్టుబడి పెడితే కొన్ని రోజుల్లోనే రెండింతలు ఇస్తామంటూ రాష్ట్రవ్యాప్తంగా 3 వేల మందిని నమ్మించి రూ.4.5 కోట్లకు కుచ్చుటోపీ పెట్టాయి పలు సంస్థలు. ఫైనాన్స్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నామంటూ నమ్మించి అందినకాడికి వసూలుచేసిన ఆయా సంస్థలు బిచాణా ఎత్తివేయడంతో బాధితులు గురువారం సీసీఎస్‌ పోలీసులను ఆశ్రయించారు. కిమ్‌ గ్రూప్‌ చైర్మన్‌ రవీందర్‌సింగ్‌ సిద్దు, అడ్మిన్‌ డైరెక్టర్‌ కేజేఎస్‌ బాల్‌, కిమ్‌ ఫ్యూచర్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ డైరెక్టర్లు కేకే దత్త, ఉమేశ్వర్‌ ఝా, లేక్‌ రాజ్‌, నెక్టర్‌ కమర్షియల్‌ ఎస్టేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్లు జగ్‌మోహన్‌సింగ్‌, జ్ఞానదీప్‌సింగ్‌, ముక్తయార్‌సింగ్‌, ఖాజన్‌సింగ్‌, హెల్ప్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ సంస్థ డైరెక్టర్లు దర్శన్‌సింగ్‌, మోహన్‌లాల్‌, మనోజ్‌ అధికారి, బల్విందర్‌సింగ్‌, నరేందర్‌కుమార్‌ కల్లా, మోనిక, మహాశక్తి ఫైనాన్స్‌ లిమిటెడ్‌ డైరెక్టర్లు మంగట్‌ రామ్‌, పరమ్‌జీత్‌, రాజేశ్‌కుమార్‌లు కలిసి కిమ్‌ సంస్థకు అనుబంధంగా ఒకే గొడగు కింద ఫైనాన్స్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేవారు. రాష్ట్రంలో సికింద్రాబాద్‌, నల్లగొండ, కరీంనగర్‌లలో శాఖలను ఏర్పాటుచేశారు. తమ వద్ద పెట్టుబడి పెడితే నిర్ణీతకాలంలో రెట్టింపు చేసి ఇస్తామని, అది కాదంటే 9 నెలల్లోనే ప్లాట్లు ఇస్తామని, లేదంటే ఆరు నెలలకోసారి వడ్డీ చెల్లిస్తామంటూ రాష్ట్రవ్యాప్తంగా 3 వేల మంది నుంచి డిపాజిట్లు సేకరించారు. 2014 నుంచి 2018 వరకు రాష్ట్రంలో వ్యాపారం చేసిన వీరు.. మొదట్లో డిపాజిట్‌దారులకు సక్రమంగానే చెల్లించడంతోపాటు శివార్లలో ప్లాట్లు ఇచ్చారు. ఇది చూసిన చాలామంది ఈ సంస్థలో పెట్టుబడి పెట్టారు. కొందరికి బాండ్లు కూడా జారీచేశారు. ఆయా సంస్థలు ఇచ్చిన మాట ప్రకారం 2019 మే నాటికి పూర్తిస్థాయిలో అందరికీ డబ్బు అందాలి. కానీ నిర్ణీత సమయానికి డబ్బు చెల్లించకుండా రాష్ట్రంలో బిచాణా ఎత్తేశారు. దీంతో బాధితులు ఈ సంస్థల శాఖలు ఉన్న న్యూఢిల్లీ, అమృత్‌సర్‌, చండీగఢ్‌కు వెళ్లి ఆరా తీశారు. బాధితులకు తప్పని సరిగా డబ్బులు చెల్లిస్తామంటూ నమ్మిస్తూ వచ్చారు. తీరా సెల్‌ఫోన్లు కూడా లిఫ్ట్‌ చేయకపోవడంతో మోసపోయామని గ్రహించి పలువురు సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదుచేశారు.


logo