గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 31, 2020 , 02:11:59

కంకి బూరునుంచి కార్బన్‌ ఎలక్ట్రోడ్‌

కంకి బూరునుంచి కార్బన్‌ ఎలక్ట్రోడ్‌

  • ఐఐటీ హైదరాబాద్‌ శాస్త్రవేత్తల ఆవిష్కరణ 
  • హై-వోల్టేజ్‌ సూపర్‌ కెపాసిటర్లలో వినియోగం 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఐఐటీ హైదరాబాద్‌ శాస్త్రవేత్తలు అతి తక్కువ ఖర్చుతో కార్బన్‌ ఎలక్ట్రోడ్‌లను ఆవిష్కరించారు. మక్కజొన్నకంకి బూరు నుంచి వీటిని తయారుచేయడం విశేషం. వీటిని సూపర్‌ కెపాసిటర్లలో వినియోగించనున్నారు. ఇవి బ్యాటరీల మాదిరిగా కొంతమేర విద్యుత్‌ను నిల్వ చేసుకుంటాయి. కరంటు సరఫరాలో హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు కెపాసిటర్లు దానిని నియంత్రిస్తా యి. అందుకే అన్ని ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో విద్యుత్‌ ప్రవాహ నియంత్రణకు కెపాసిటర్లను వినియోగిస్తుంటారు. 

ఈ కెపాసిటర్లలో విద్యుత్‌ నిల్వ, ప్రవాహానికి కార్బన్‌ ఎలక్ట్రోడ్‌ లేయర్‌ ఉంటుంది. కార్బన్‌ ఎలక్ట్రోడ్‌ లేయర్‌గా వినియోగించిన కంకి బూరు విద్యుత్‌శక్తిని సమర్థంగా నియంత్రిస్తున్నట్టు ఐఐటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని హై-వోల్టేజ్‌ సూపర్‌ కెపాసిటర్లలో వినియోగించడం ద్వారా ఉత్పత్తి వ్యయం తగ్గనున్నది. ఈ ఆవిష్కరణ గ్రీన్‌ఎనర్జీ రంగంలో విప్లవాత్మక మార్పును తీసుకొస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 

మక్కజొన్నను అధికంగా పండిస్తున్న మన దేశానికి ఎంతో ప్రయోజనం చేకూరనున్నది. కంకిబూరును రోడ్డుపక్కన పడేయడం, వ్యర్థంగా కాల్చేయడానికి బదులు పారిశ్రామికంగా ఉపయోగించే అవకాశం కలుగనున్నది. మక్కజొన్నను అధికంగా ఉత్పత్తిచేస్తున్న రాష్ర్టా ల్లో తెలంగాణ, ఏపీ, యూపీ టాప్‌-3లో ఉన్నాయి. ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ అతుల్‌ సురేశ్‌ దేశ్‌పాండే నేతృత్వంలోని బృందం ఈ ఆవిష్కరణలో పాలుపంచుకున్నది. 


logo