కాకతీయ మెడికల్ కాలేజీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇక పూర్తిస్థాయి వైద్యసేవలు
శరవేగంగా వైద్యుల నియామకాలు
కాంట్రాక్ట్ పద్ధతిలో 42 ఖాళీల భర్తీకి నేడు ఇంటర్వ్యూలు
ఔట్ సోర్సింగ్‌లో మరో 263మంది నియామకానికి ఏర్పాట్లు
ఉత్తర తెలంగాణకు మరో పెద్దదిక్కు
ఉత్తర తెలంగాణకు వరంగల్ కేంద్రంగా మరో దేవాలయంలాంటి వైద్యశాల పూర్తిస్థాయిలో సేవలందించేందుకు సిద్ధమైంది. కాకతీయ మెడికల్ కళాశాలకు అనుబంధంగా నిర్మించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా చర్యలు చేపడుతున్నది. డాక్టర్లు, ఇతర సిబ్బంది కలిపి మొత్తం 305 పోస్టుల భర్తీకి ఈ నెల 16న అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసి నియామకాలు వెంటనే పూర్తి చేయాలని జిల్లా అధికారయంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ మేరకు కాంట్రాక్ట్ పద్ధతిలో 42మంది డాక్టర్ల నియామకానికి నేడు ఇంటర్వ్యూలు నిర్వహించడంతో పాటు మరో 263మందిని ఔట్ సోర్సింగ్ ద్వారా తీసుకునేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఇంటర్వ్యూ ద్వారా
భర్తీ చేసే పోస్టులు
కార్డియాలజీ : 4
కార్డియోథొరాసిక్
సర్జన్ : 2
నెఫ్రాలజీ : 2
యూరాలజీ : 2
న్యూరాలజీ : 2
న్యూరో సర్జన్ : 2
పిడియాట్రిక్ సర్జన్ : 2
మెడికల్ గ్యాస్ట్రో
ఎంటరాలజీ : 2
ఆంకాలజీ : 2
రేడియాలజీ : 2
అనస్థీషియాలజీ : 16
ఆర్ఎంవో : 4
వరంగల్, మే 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కాకతీయ మెడికల్ కాలేజీకి అనుబంధంగా నిర్మించిన సూ పర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతున్నది. ఈ దవాఖానలో పూర్తి స్థాయి వైద్య సేవలను కొనసాగించేందుకు అవసరమైన డాక్టర్లు, ఇతర సిబ్బంది కలిపి 305 పోస్టుల నియామకానికి ఈనెల 16న అనుమితిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని పోస్టుల భర్తీని వేగం గా పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వాటిలో 42డాక్టర్లు, 156 స్టాఫ్ నర్స్, 82 టెక్నీషియన్/ అదర్ పారామెడికల్ స్టాఫ్, 6 స్టోర్ కీపర్, 12 స్టెనో/టైపిస్ట్, 6 రికార్డ్ అసిస్టెంట్ , 1 పర్ ఫ్యూసినిస్ట్ పోస్టులు ఉన్నాయి. డాక్టర్ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో, మిగిలిన పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేలా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కాంట్రాక్ట్ పోస్టుల భర్తీ కోసం వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్, కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌తో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ల నియామకం కోసం బుధవారం ఉదయం పదిన్నర గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. డాక్టర్ పోస్టులకు సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్ 38, ఆర్ఎంవో 4 చొప్పున ఉన్నాయి. వైద్య సేవలో ప్రధానంగా ఉండే 9 విభాగాల్లో రెండు చొప్పున, అనస్థీషియాలజీలో 16 ఉన్నాయి. డాక్టర్లకు రూ.1.25 లక్షల వేతనంగా ప్రభుత్వం నిర్ణయించింది.
ఏజెన్సీల ఎంపిక..
స్టాఫ్ నర్సు సహా ఇతర వైద్య సిబ్బంది, పారామెడికల్ పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఈ మేరకు 263 పోస్టులను కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా భర్తీ చేస్తారు. విభాగాల వారీగా ఔట్ సోర్సింగ్ సేవలు అందించే ఏజెన్సీల ఎంపిక ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందించడం లక్ష్యంగా కాకతీయ మెడికల్ కాలేజీ ఆవరణలో ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను నిర్మించింది. ఆరు అంతస్తులు, రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక పద్ధతిలో దీని నిర్మాణం పూర్తయ్యింది. డాక్టర్లు, సిబ్బంది నియామకం పూర్తయితే సాధారణ వైద్య సేవలతోపాటు ఆపరేషన్లు (సర్జరీలు) ఈ దవాఖానలో అందుబాటులోకి రానున్నాయి. గుండె, నరాలు, మూత్రపిండాలు, నరాల వ్యాధులు, చెవి-ముక్కు, గొంతుకు సంబంధించిన వైద్య సేవలు, ఆపరేషన్లు పేదలకు ఉచితంగా అందనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి స్వస్థ్య సురక్ష యోజన పథకం (పీఎంఎస్ఎస్వై) నిధులు కలిపి ఈ హాస్పిటల్‌ను నిర్మించారు. వైద్య సేవల పరంగా పది డిపార్ట్మెంట్లకు 20 పడకల చొప్పున 200 పడకలను కేటాయించారు. అత్యవసర వైద్య సేవల కోసం 50 పడకలు కేటాయించారు. 13 కిలో మీటర్ల పైప్‌లైన్ సామర్థ్యంతో ఆక్సిజన్ ట్యాంకు ఏర్పాటు చేశారు. కార్డియాలజీ, అంకాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, న్యూరో సర్జరీ, యూరాలజీ, పిడియాట్రిక్ సర్జరీ, కార్డియోథోరాసిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, ఈఎన్టీ, ట్రామా కేర్ సేవలకు అనుగుణంగా అత్యాధునిక యంత్రాలు, పరికరాలను ఏర్పాటు చేశారు. ఏడు ఆపరేషన్ థియేటర్లు, ల్యాబ్‌లు, క్యాథలాబ్ ఉన్నా యి. వైద్య విద్యార్థుల కోసం ప్రత్యేకంగా లైబ్రరీ, సెమినార్ హాళ్లను నిర్మించారు. ఎంజీఎం పూర్తిగా కరోనా వైద్య సేవలకు కేటాయించిన నేపథ్యంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా పేదలకు వైద్య సేవలు అందనున్నాయి.