బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Oct 29, 2020 , 03:09:03

కారు మోటరుకా..కరెంటు మీటరుకా.. మీ ఓటు ఎటు!

కారు మోటరుకా..కరెంటు మీటరుకా.. మీ ఓటు ఎటు!

  • దుబ్బాక ఎన్నికతో బీజేపీ కుటిల పాచిక
  • కేంద్ర విద్యుత్తు బిల్లుకు జనం మద్దతుందని చాటే ఎత్తుగడ
  • అదే జరిగితే కేసీఆర్‌ మాట.. అసెంబ్లీ తీర్మానం బుట్టదాఖలే
  • ఓటు అటు పడితే బాయికాడి మోటరుకు మీటరు ఖాయం
  • రైతుకు ఉచిత కరెంటు ఉండదు.. ఇక సబ్సిడీ సాధ్యమే కాదు
  • కాల్చిన కరెంటుకు అణా పైసలతో సహా బిల్లు కట్టి తీరాల్సిందే 
  • పెత్తనమంతా కేంద్రానిదే.. ప్రైవేటు గుప్పిట్లో మన రైతు బతుకు
  • మన ప్రజల వేలితోనే మన రైతు కన్ను పొడిపించే యత్నం

దశాబ్దాల అన్యాయంతో...

దారుణ ఆధిపత్యంతో...

దుర్మార్గుల దౌర్జన్యంతో...

నయవంచక నేతలతో... 

పెత్తందారీ ప్రభువులతో...

అబద్ధాల మీడియాతో...

గిరి గీసి కలబడేందుకు, బరి కాసి తలపడేందుకు, తొడగొట్టి కొట్లాడేందుకు పుట్టిందే నమస్తే తెలంగాణ. తెలంగాణ రావడంతోనే ఉద్యమం అయిపోలేదు. పత్రిక పాత్ర ముగిసిపోనూ లేదు. తెచ్చుకున్న తెలంగాణ తెరిపిన పడేదాకా.. రాష్ట్ర పునర్నిర్మాణం పూర్తయ్యే దాకా.. రణోద్యమం రగులుతూనే ఉంటుంది. 

మా అక్షర యుద్ధం అక్షయంగా సాగుతూనే ఉంటుంది. 

అది గల్లీ అయినా.. ఢిల్లీ అయినా..  తెలంగాణకు తేడా చేస్తే, తీన్మార్‌ డప్పుతో తిరు తాండవం తప్పదని రుజువు చేయడమే నమస్తే తెలంగాణ నమ్మిన మార్గం. పగ బట్టిన వారిపైకి సింగంలా ఎగబడి... పంచెలెగేసి పొలిమేరలకు ఉరికించడం.. మాకు ఈ మట్టి నేర్పిన విద్య.

తెచ్చుకున్న తెలంగాణ వెనుక తచ్చాడుతున్న శత్రువులను 

దునుమాడటం మా బాధ్యత. స్వార్థపరుల నుంచి తెలంగాణ సమాజాన్ని కాపాడుకోవడం 

మా కర్తవ్యం. తప్పుడు ప్రచారాల నుంచి ప్రజలను జాగృత 

పరచడం.. మా విధ్యుక్త ధర్మం.  

గతంలో మనం చేసిన చిన్న తప్పులే.. పెను శాపాలై దశాబ్దాల పాటు తెలంగాణను పీడించాయి. పోనీలే అంటూ మన మంచి మనసు చూపిన ఔదార్యమే మన పాలిట శాపంగా మారింది. ఇది చరిత్ర చెప్పిన నిజం.

ఇప్పుడు తెలంగాణ అలాంటి మరో భయంకర విషమ పరిస్థితి ముందు నిలబడి ఉంది.  తప్పటడుగో.. తప్పుటడుగో వేస్తిమా.. విష వలయంలోకి జారిపోవడం, నిలువునా కూరుకుపోవడం ఖాయం. 

తెలంగాణ జన పక్షపాతిగా నమస్తే తెలంగాణ ఈ రోజు ఒక కఠోర వాస్తవాన్ని, కఠిన సత్యాన్ని ప్రజల ముందుంచుతున్నది. 

ఆ విషయమేమిటో.. విష వలయమేమిటో..  వివరంగా మీరే చదవండి! ఆలోచించండి. 

మనం.. తెలంగాణ వాళ్లం... కొంచం కుక్కపేగులోళ్లం. ఎవడన్నా వచ్చి కంటి పొంటి బొట్టు నీరు కారిస్తే చాలు కరిగిపోతం. కంచంలో సగం పంచిస్తం. మన మంచితనాన్ని బలహీనతగా భావిస్తున్న వారు మరో వంచనా శిల్పానికి తెరతీశారు. 

ఆ మాయావి బీజేపీ..  ఆ పాచిక దుబ్బాక ఎన్నిక! 

దుబ్బాకపై బీజేపీ ఎందుకంతగా కన్నేసింది?  బీహార్‌ సహా దేశంలో అనేక ఎన్నికలు జరుగుతుంటే...  అడ్డా లీడరు మొదలుకొని అమిత్‌షా దాకా అందరికీ దుబ్బాకే ఎందుకు? ఎందుకంటే ఇది కేవలం..

ఒక ఉప ఎన్నిక మాత్రమే కాదు; విధాన నిర్ణయంపై తీర్పు!  మన తలరాతల మార్పు!

‘నేను రైల్వే స్టేషన్‌లో చాయ్‌ మాత్రమే అమ్ముకున్నా.  దేశాన్ని కాదు’ అంటూ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిన నరేంద్రమోదీ... ఇప్పుడు రైల్వేస్టేషన్‌ మొదలుకొని వ్యవసాయ మార్కెట్లదాకా... ఆఖరికి చచ్చినా బతికినా ఆసరాగా నిలిచే బీమా సంస్థ ఎల్‌ఐసీదాకా... అన్నింటినీ అమ్మకానికి పెట్టారు. ప్రైవేటీకరణ పేరుతో అంబానీలు, అదానీల ముందు సాగిలపడుతున్నారు. 

ఆ క్రమంలో మోదీ తెచ్చిందే కేంద్ర విద్యుత్తు బిల్లు! 

దేశంలోనే ఎదురు లేదనుకున్న తమకు కేసీఆర్‌ ఒక్కడు ఎదురొడ్డి నిలవడం,  ఎదిరించడం చూసి సహించలేకపోయిన మోదీ బృందం... తెలంగాణలో తమకు ఆదరణ ఉందని చూపించుకోవడానికి దుబ్బాకను కొలమానంగా పెట్టుకుంది. ఇక్కడ వచ్చే ఓట్లను గీటురాయిగా చూపి.. ముఖ్యమంత్రి మాటను, అసెంబ్లీ తీర్మానాన్ని బేఖాతరు చేయవచ్చని పన్నాగం పన్నింది. తెలంగాణలో తమకు ఆదరణ ఉందని, విద్యుత్తు చట్టాన్ని తెలంగాణ ప్రజలు ఆమోదిస్తున్నారని, దుబ్బాకలో వచ్చిన ఓట్లే అందుకు నిదర్శనమని వాదించాలన్నది బీజేపీ ఎత్తుగడ.

ఎన్నడూ లేనట్టు ఓట్ల కోసం కోట్లు గుమ్మరిస్తున్నది అందుకే. మోసకారి మాటలు మోస్తున్నదీ అందుకే! విద్యుత్తు చట్టంలో మోటర్లకు మీటర్లు పెట్టాలంటూ ఎక్కడుందని తాడూ బొంగరం లేని బీజేపీ సోషల్‌మీడియా దుష్ప్రచారం చేస్తున్నది.           కేసీఆర్‌పై, టీఆర్‌ఎస్‌పై నీలాపనిందలు వేస్తున్నది. వెర్రిమొర్రి తిర్రి బీజేపీ సోషల్‌మీడియా కు మెయిన్‌స్ట్రీమ్‌ మీడియా ద్వారా టీఆర్‌ఎస్‌ ఇస్తున్న జవాబిది! 

రైతుల మోటర్లకు మీటర్లు పెట్టి తీరాలని కేంద్ర విద్యుత్తు చట్టం విస్పష్టంగా చెబుతున్నది. ఆ చట్టమే అమల్లోకి వస్తే మీటరు తీసుకుంటేనే కొత్త కనెక్షన్‌ ఇస్తారు. పాత వాటికీ మీటర్లు బిగిస్తారు.

 అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏమీ ఉండదు. ముఖ్యమంత్రి చేతిలో ఏమీ ఉండదు. ఉచిత విద్యుత్తు ఇవ్వాలనుకున్నా ఇవ్వలేరు. కరెంటు సబ్సిడీ అంతకంటే సాధ్యం కాదు. మళ్లీ బిల్లు కలెక్టర్లు వస్తరు. కాల్చిన కరెంటుకు ముక్కుపిండి బిల్లు వసూలు చేస్తరు. కట్టకుంటే మోటరు పీక్క పోతరు. మనకు కరెంటు కావాలంటే ఢిల్లీని అడుక్కోవాలి. ఈఆర్‌సీ (విద్యుత్తు నియంత్రణ మండలి) పోయి పీఆర్‌సీ (ప్రైవేటు నియంత్రణ మండలి) వస్తుంది. ఇవన్నీ నూటికి నూరుశాతం బిల్లులో ఉన్నయి. అంతెందుకు... కాళేశ్వరం నీళ్లు  మన పొలం పక్క కాల్వలో పారుతున్నా... కరెంటు మోటరు పెట్టి తోడుకోలేం.. వాడుకోలేం! విద్యుత్తు చట్టాలకు తెలంగాణ ఆమోదం ఉందని బీజేపీ చెప్పుకొనేందుకు ఒక పాచిక దుబ్బాక ఎన్నిక. మీ వేలితో మీ కంటినే పొడిపించేందుకు బీజేపీ రాసే కాటుక.  

ఒక్కసారే కదా అని పువ్వు గుర్తుపై ముద్దరేస్తే...  మీ బాయికి మీరే మీటరు పెట్టుకున్నట్టు. నా ఓటుతో ఏమైతదని ఏమరపాటున మీట నొక్కితే... మీ మెడకు మీరే కరెంటు వైరు చుట్టుకున్నట్టు.  తెల్లారేసరికి ఊర్లకి బిల్లు కలెక్టరును పిలిచినట్టే! 

అయినా.. ఒక్కసారే కదా అని బాయిల దుంకుతమా? ఈసారికి చూద్దామని ఉరేసుకుంటమా? పోనీలే అని గిన్నెడంత విషం తాగుతమా? అడుగుతున్నరు గదా పాపం అని కరెంటు వైరు పట్టుకుంటమా?

దుబ్బాక ఓటరన్నా... ఆలోచించండి. నిమ్మళంగా ఆలోచించి ఓటేయండి మీరు వేసే ఓటు...రేపటి మీ తలరాత!

మీది మాత్రమే కాదు;  ఇది మన తెలంగాణ రైతులందరి  విధి రాత!!


ఈ బిల్లును ముఖ్యమంత్రి  కేసీఆర్‌ నిరసించారు. దీంతో బాయికాడ మోటర్లకు మీటర్లు పెట్టాల్సి వస్తుందని, కరెంటు సబ్సిడీలకు కాలం చెల్లిపోతుందని స్పష్టంచేశారు. లాభనష్టాలు చూసుకోవడానికి విద్యుత్తు.. వ్యాపారం కాదనీ, రైతుకు బతుకు అని తేల్చిచెప్పారు. కేంద్ర చట్టాలను ఆమోదించే ప్రసక్తే లేదని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. వాటికి వ్యతిరేకంగా అసెంబ్లీతో  ఏకగ్రీవంగా తీర్మానం చేయించారు.