సోమవారం 06 జూలై 2020
Telangana - May 30, 2020 , 04:03:00

కంటోన్మెంట్‌ బోర్డు భారీ బడ్జెట్‌ ప్రతిపాదనలు

కంటోన్మెంట్‌ బోర్డు భారీ బడ్జెట్‌ ప్రతిపాదనలు


కంటోన్మెంట్‌: కరోనా కష్టకాలంలోనూ కంటోన్మెంట్‌ బోర్డు భారీ బడ్జెట్‌ ప్రతిపాదనలు రూపొందించింది. రూ. 265 కోట్ల ప్రతిపాదనలతో కూడిన 2020-21 బడ్జెట్‌కు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ మేరకు శుక్రవారం బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్‌ అభిజిత్‌ చంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన బోర్డు సమావేశంలో పలు తీర్మాణాలు చేశారు. అయితే గతేడాది మాదిరిగానే తాజా బడ్జెట్‌లో గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద కేంద్రాన్ని అర్థించిన రూ. 99 కోట్లను లోటు బడ్జెట్‌గా పొందుపరచడం గమనార్హం. అంటే కేంద్రం గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ నిధులు విడుదల చేస్తేనే సంబంధిత ప్రతిపాదిత పనులు చేపట్టే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా మొత్తం 8 వార్డుల పరిధిలో వివిధ అభివృద్ధి పనుల కోసం కేటాయించిన నిధులు కేవలం రూ. 23 కోట్లే కావడం విశేషం. 

కరోనా నియంత్రణకు రూ.3 కోట్లు..

సాధారణంగా సామాన్య జనానికి సైతం ప్రవేశం ఉండే బోర్డు సమావేశాన్ని కరోనా నిబంధనలకు లోబడి కేవలం బోర్డు సభ్యులు, అధికారులతో మాత్రమే నిర్వహించారు. తొలుత 2020-21 రివైజ్డ్‌, 2021-22 ప్రతిపాదనలను బోర్డు ఆమోదించింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిసున్న  పారిశుధ్య, వాటర్‌ వర్క్స్‌, ఆరోగ్య విభాగాల సిబ్బందికి రూ.7,500 చొప్పున అదనపు వేతనం అందజేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ మేరకు 890 మంది సిబ్బందికి అదనపు వేతనం అందజేసినట్లు సీఈఓ వెల్లడించారు. మొత్తంగా కరోనా నియంత్రణ చర్యలకు రూ.3 కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించారు. 

నీటి విభాగానికి, భూగర్భ డ్రైనేజీ పనులకు పెద్దపీట

బోర్డు సమావేశం అనంతరం  బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణ తన కార్యాలయంలో  బోర్డు సభ్యులు పాండుయాదవ్‌, లోక్‌నాథంలతో కలసి విలేకరులతో మాట్లాడారు.. నిధుల కేటాయింపుల్లో ప్రధానంగా నీటి విభాగానికి, భూగర్భ డ్రైనేజీ పనులకు పెద్దపీట వేసినట్లు ఆయన వెల్లడించారు. దీంతో పాలన నియంత్రణ పేరుతో కంటోన్మెంట్‌లోని ఆయా మార్గాల్లో రోడ్ల మూసివేత అంశంపై చర్చించామన్నారు. కేంద్రం ఆదేశాల  మేరకు అధికారులు నడుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే కంటోన్మెంట్‌ ప్రాంతంలో రెండు చోట్ల జైకా పైపులైన్‌ పనులకు సంబంధించి స్థల అనుమతి త్వరలోనే వస్తుందన్నారు. కంటోన్మెంట్‌ ప్రాంతానికి జలమండలి పూర్తి స్థాయిలో నీటిని సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉందని,  ఇందుకు సంబంధించి నీటి నిల్వ కోసం ప్రత్యేక కమిటీ వేశామన్నారు. ఇక ఆయా పనుల్లో ఎలాంటి జాప్యం జరుగకుండా సిబ్బందిని, యంత్రాలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించినట్లు తెలిపారు. చివరగా కరోనాను కంటోన్మెంట్‌లో నియంత్రించడం జరిగిందని, భవిష్యత్తులో అవసరమైతే మరింత అప్రమత్తంగా ఉంటామని తెలిపారు.


logo