జమ్మికుంట, ఆగస్టు 23: క్యాన్సర్ మహమ్మారి ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. సాధారణ తరగతికి చెందిన దంపతులు తమ ఇద్దరు కొడుకులతో ఉన్నంతలో ఆనందంగా జీవిస్తున్న తరుణంలో ఒక్కసారిగా క్యాన్సర్ ఆ కుటుంబాన్ని కబళించింది. ఏడాది క్రితం భర్తను, ఆరు నెలల క్రితం పెద్ద కొడుకును కోల్పోయింది. తాజాగా చిన్న కొడుకు కూడా క్యాన్సర్ బారిన పడటంతో ఆమె తల్లడిల్లిపోతున్నది. లక్షలు వెచ్చించి వైద్యం చేయించే స్థోమత లేక కన్నీరు పెట్టుకున్నది. ‘నాకెందుకీ కష్టం.. నేనేం పాపం చేశా’నంటూ కుంగిపోతున్నది. ‘నా బిడ్డను బతికించండి’ అంటూ దీనంగా దాతలను వేడుకుంటున్నది. వివరాలు ఇలా.. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్‌కు చెందిన ఆకుల రామకృష్ణ, అనూష దంపతులు. వీరికి ఇద్దరు కొడుకులు అద్వైత్, అశ్విత్ ఉన్నారు. ఈ దంపతులు జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్లుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఏడాది క్రితం రామకృష్ణ (40) బ్రెయిన్ క్యాన్సర్ బారినపడ్డారు. లక్షలు వెచ్చించి చికిత్స చేయించినా ప్రాణాలు దక్కలేదు. రామకృష్ణ మరణించి ఆర్నెళ్లు తిరగకముందే పెద్ద కొడుకు అద్వైత్(9)ను లివర్ క్యాన్సర్ పొట్టనబెట్టుకున్నది. అద్వైత్ మృతి చెంది వారం గడువకముందే రెండో కొడుకు అశ్విత్‌ను అదే మహమ్మారి ఆవహించింది. హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ దవాఖానకు తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు లివర్ క్యాన్సర్ ప్రాథమిక స్టేజీలో ఉన్నదని ధ్రువీకరించారు. ఆపరేషన్ చేయించాలని, దాదాపు రూ.35 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. అప్పటికే భర్త, పెద్ద కొడుకు కోసం రూ.10 లక్షలు ఖర్చు చేసి అప్పుల పాలైన అనూష, చిన్న కొడుకు వైద్యానికి ఇంత పెద్దమొత్తం ఎక్కడినుంచి తేవాలో అర్థంకాక సతమతమవుతున్నది.
ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు..
భర్త, పెద్ద కొడుకును కోల్పోయిన పుట్టెడు దుఃఖంలో మునిగిన అనూష.. చిన్న కొడుకు వైద్యం కోసం దాతల కోసం ఎదురు చూస్తున్నది. అశ్విత్ లివర్ క్యాన్సర్ చికిత్సకు దాదాపు రూ.35 లక్షలు అవసరమని, ఎవరైనా సాయం చేస్తే తన కొడుకు బతుకుతాడని చెబుతున్నది. సాయం అందించే దాతలు.. ఆకుల అనూష, జమ్మికుంట ఎస్బీఐ ఖాతా నంబర్ 32850064661, బ్రాంచ్ కోడ్ 11988, ఐఎఫ్ఎస్సీ నంబర్ 11988. గుగూల్‌పే, ఫోన్‌పే నంబర్లు 9533394341, 9010647571 ద్వారా కూడా నగదు జమచేయవచ్చని ఆమె వేడుకుంటున్నది.