మంగళవారం 26 జనవరి 2021
Telangana - Dec 27, 2020 , 15:35:32

సామాజిక చైతన్యంతో న్యాయం : దర్శక నిర్మాత ఎస్వీ కృష్ణారెడ్డి

సామాజిక చైతన్యంతో న్యాయం : దర్శక నిర్మాత ఎస్వీ కృష్ణారెడ్డి

హైదరాబాద్‌ : వింత పొకడలతో పెడదారి పడుతున్న నేటి సమాజానికి మంచి మనసున్న మనుషుల అవసరం ఎంతైనా ఉన్నదని ప్రముఖ దర్శకులు, నిర్మాత ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం ఫిల్ంనగర్‌లోని తాజ్‌మహాల్ హోటల్‌లో గ్రావిటి ఫిల్మ్‌ సంస్థ రూపొందించిన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌కు చెందిన అమ్మ నాన్న అనాధ ఆశ్రమం లోగో, వెబ్‌సైట్‌ను టీయూడబ్ల్యూజే నేత కే విరాహత్‌అలీతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మనిషి కన్నా మనస్సు చాలా గొప్పదని, మనిషి ఆలోచనలను అది రాకెట్ కన్న వేగంతో పరిగెత్తిస్తుందని చెప్పారు. అలాంటి  మంచి మనస్సు కలిగిన సామాజిక సేవకుడు గట్టు శంకర్ అని అభినందించారు. నిరాశ నిస్పృహల మధ్య  ముందుకు సాగుతున్న యువత వాటికి స్వస్తి పలికి సామాజిక చైతన్యంతో అడుగేస్తేనే సమాజానికి న్యాయం చేసినవారవుతారని, అలాంటి వారి‌ జీవితాలే ధన్యమవుతాయని తెలిపారు. 

ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి‌ మాట్లాడుతూ.. అమ్మ నాన్న సేవ సంస్థ ద్వారా‌ మానవతావాదిగా గట్టు శంకర్ చేస్తున్న సేవకు వెల కట్టలేమన్నారు.  నలుగురు సభ్యులున్న కుటుంబం పోషణకు నానా‌ ఇబ్బందులు పడుతున్న ప్రస్తుత రోజుల్లో ఏకంగా 400 మంది అభాగ్యులకు ఆశ్రయం కల్పించి నిలబడటం అభినందనీయమన్నారు. శంకర్ సేవను డాక్యుమెంటరీలో చూసి వేదికపైనే ఆయన కన్నీటి పర్యంతం అయ్యారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల‌‌ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే విరాహత్ అలీ‌ మాట్లాడుతూ సమాజంలో తోటి మనిషిని‌ మనిషిగా గుర్తించని‌వాడు తన దృష్టిలో మనిషే కాదన్నారు. గట్టు శంకర్ ముంబైలో ఉద్యోగాన్ని వదిలి తన‌ జీవితాన్ని అభాగ్యుల‌ సేవలో అంకితం చేయడం ప్రతి యువతకు స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఆశ్రమం నిర్వాహకుడు గట్టు శంకర్ మాట్లాడుతూ, తన జీవితంలో ఎదురైన కన్నీటి కష్టంతోనే ఆశ్రమం నిర్వాహించాలనే తపన మొదలైందని, అదే లక్ష్యంతో నలుగురితో మొదలైన ఆశ్రమం ఇప్పుడు 400 మందికి ఆశ్రయం ఇవ్వడం గర్వంగా ఉన్నదన్నారు. రోడ్ల వెంబడి తిరుగుతూ చెత్త కుండీల్లో ఏరుకొని తినే అభాగ్యులను చేరదీసి వాళ్ళు మనుషులేనని నిరూపిస్తున్నట్లు శంకర్ తెలిపారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo