బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 24, 2020 , 02:20:36

నీరా కోసం కేఫ్‌

నీరా కోసం కేఫ్‌

  • నెక్లెస్‌రోడ్‌లో శంకుస్థాపన
  • కులవృత్తులతో ఆర్థికచేయూత
  • గౌడల అస్తిత్వానికి ప్రతీక నీరాస్టాల్‌
  • తెలంగాణ ప్రజల్లో వృత్తి నైపుణ్యం
  • మంత్రి కే తారకరామారావు
  • కులవృత్తులను కాపాడేందుకు సీఎం చర్యలు: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కులవృత్తులతో గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలోపేతం అవుతున్నదని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. గౌడ సోదరులు, కల్లుగీత కార్మికుల ఆస్తిత్వానికి నీరా కేఫ్‌ ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన నాటినుంచి కులవృత్తులకు పునర్వైభవం తెచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషిచేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్‌లో గురువారం నీరాకేఫ్‌ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మంత్రులు వీ శ్రీనివాస్‌గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘నీరాస్టాల్‌ ఏర్పాటుచేసేందుకు రూ.4 కోట్లే ఖర్చు కావొచ్చు.. కానీ గీతకార్మికులకు, గౌడ సోదరుల అస్తిత్వానికి ప్రతీకగా ఆ స్టాల్‌ను పెట్టాం. నీరావల్ల ఆరోగ్యానికి ఎన్ని లాభాలున్నాయో ప్రజలకు మరింత విడమర్చి చెపుతాం. ప్రజల నుంచి నీరాకు బాగా డిమాండ్‌ వస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇలాంటి స్టాల్స్‌ ఇంకా వస్తాయి’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో గీత వృత్తిమీద ఆధారపడిన 2.30లక్షల మంది కార్మికుల సంక్షేమంకోసం చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. 2017లో తెచ్చిన  జీవోఎంఎస్‌ 53తో తెలంగాణ ప్రభుత్వం గీతకార్మికుల ఎక్స్‌గ్రేషియాను రూ.50వేల నుంచి రూ.5 లక్షలకు పెంచిందని గుర్తుచేశారు. 

ఇప్పటివరకు మృతిచెందిన 495 మంది కుటుంబాలకు, శాశ్వత అంగవైకల్యం పొందిన 1,519 మంది గీత కార్మికులకు దీనిద్వారా రూ.28.13 కోట్ల నష్టపరిహారం అందించినట్టు చెప్పారు. చెట్టుపన్ను రద్దుచేయాలంటూ ఎప్పుడో సర్వాయి పాపన్న చేసిన పోరాటాన్ని దృష్టిలో పెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు.. గౌడ సోదరులు అడగ్గానే చెట్టుపన్ను దాదాపు రూ.16 కోట్లు మాఫీ చేయడంతోపాటు, భవిష్యత్తులోనూ పన్ను పూర్తిగా రద్దుచేశారన్నారు. హరితహారంలో భాగంగా ఆరువిడతల్లో ఇప్పటికే దాదాపు 4 కోట్ల ఈత, తాటిచెట్లు రాష్ట్రవ్యాప్తంగా నాటినట్టు చెప్పారు. భవిష్యత్‌లో నీరా పాపులర్‌ డ్రింక్‌ అవుతుందని ఆకాక్షించారు. 

రాజధానిలో మరో ఎలివేటెడ్‌ కారిడార్‌

హైదరాబాద్‌లో నిర్మించనున్న మరో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి గురువారం పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు శంకుస్థాపన చేశారు. నల్లగొండ క్రాస్‌రోడ్‌ నుంచి ఒవైసీ జంక్షన్‌ వరకు స్టీల్‌ఎలివేటెడ్‌ కారిడార్‌గా దీనిని నిర్మించనున్నారు. రూ. 523.37 కోట్ల వ్యయంతో నిర్మించే ఈ వంతెనతో సైదాబాద్‌, ఐఎస్‌ సదన్‌, ఒవైసీ జంక్షన్‌ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

ఏండ్ల కల సీఎం కేసీఆర్‌తో నెరవేరింది: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

ఎన్నో ఏండ్లుగా సాధించుకోలేని నీరాపాలసీ సీఎం కేసీఆర్‌తో సాధ్యమైందని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. చెట్లపన్ను రద్దు, ఎక్స్‌గ్రేషియా పెంపు, ఈత, తాటివనాల పెంపకం, కులసంఘం భవనం.. ఇలా గౌడ సోదరులు ఏదికోరితే అది కాదనకుండా సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్నారన్నారు. ఇతరరాష్ర్టాల్లోనూ నీరాపాలసీని తెచ్చి నా.. తెలంగాణలో మాత్రం గౌడ సోదరులకే అవకాశమిస్తూ తీసుకురావడం హర్షణీయమన్నారు. సీఎం కేసీఆర్‌ నిర్ణయాలకనుగుణంగా, కులవృత్తులకు మరింత ఊతమిచ్చేలా అనేక చర్యలు తీసుకుంటున్న మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారన్నారు. ‘మన జాతికి ఇంత గొప్పసాయం చేసిన సీఎం కేసీఆర్‌ను ఎల్లమ్మ సాక్షిగా గౌడ సోదరులు మర్చిపోవద్దు. వారికి అండగా ఉండాలి’అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కోరారు.


logo