హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం భర్తీచేసే ఉద్యోగాలన్నీ ఇకనుంచి తెలంగాణ బిడ్డలకే దక్కనున్నాయి. నీళ్లు- నిధులు- నియామకాల ట్యాగ్‌లైన్‌తో ఉద్యమంచేసి స్వరాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, ఉద్యోగాలన్నీ స్థానికులకే దక్కేలా నూతన జోనల్ విధానాన్ని తీసుకొచ్చారు. క్యాడర్ స్ట్రెంత్ నిర్ధారణ కోసం ప్రత్యేకంగా కసరత్తు చేసిన సీఎం నియామకాలన్నీ జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పద్ధతిలో చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్రస్థాయి పోస్టులన్నీ పదోన్నతుల ద్వారానే చేపట్టే విధంగా నూతన జోనల్ విధానం తీసుకొచ్చారు. ఈ మేరకు క్యాడర్ స్ట్రెంత్‌ను నిర్ధారిస్తూ ఒకేసారి ఏకంగా 84 జీవోలను ప్రభుత్వం జారీచేసింది.
గ్రూప్-1 పోస్టులన్నీ మల్టీ జోనల్ పరిధిలోకి తీసుకొచ్చారు. డిప్యూటీ కలెక్టర్, కమర్షియల్ టాక్స్ ఆఫీసర్, డీఎస్పీ, జిల్లా పంచాయతీరాజ్ అధికారి, జిల్లా రిజిస్ట్రార్, డివిజనల్ ఫైర్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-1, ఆర్టీవో, ఎంపీడీవో లాంటి పోస్టులన్నీ మల్టి జోనల్ పరిధికి వచ్చాయి. జోనల్, జిల్లా క్యాడర్ పోస్టులను కూడా వర్గీకరించారు. అయితే పాఠశాల విద్యకు చెందిన ఉపాధ్యాయ పోస్టుల వర్గీకరణ కావాల్సి ఉన్నది. క్యాడర్ స్ట్రెంత్‌ను నిర్ధారిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తాజాగా జీవోలు ఇచ్చారు. జూన్ 30న ప్రాసిక్యూషన్ విభాగానికి చెందిన క్యాడర్ స్ట్రెంత్ నిర్ధారణ జీవో విడుదల చేశారు.
కొత్త జోనల్ విధానం ప్రకారం ఇక నుంచి నియామకాలన్నీ స్థానికులకే దక్కనున్నాయి. గతంలో ఉన్న 20:30:40 శాతం ఓపెన్ కోటా (దీనిని ఉమ్మడి రాష్ట్రంలో పూర్తిగా నాన్‌లోకల్‌గా మార్చారు) కింద నియామకాలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత స్థానికులకే ఉద్యోగాలన్నీ లభించేలా 95 శాతం లోకల్ రిజర్వేషన్‌తో జోనల్ విధానాన్ని రూపొందించారు. 5 శాతం ఉద్యోగాలను ఓపెన్ కోటా కింద చేపడతారు.
జిల్లా క్యాడర్ :
టైపిస్టు, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టెనో, డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్, రెనో ఆపరేటర్, జమేదార్, చైన్‌మెన్, డఫేదార్, కుక్, ఆఫీస్ సబార్డినేట్, శానిటరీ వర్కర్, స్వీపర్, వాచ్మెన్, ఫోర్‌మెన్, కార్పెంటర్, మేస్త్రీ, గార్డెనర్, మిలిమాలన్, చౌకీదార్, ప్రింటింగ్ టెక్నీషియన్, కానిస్టేబుల్, జూనియర్ పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-4 తదితర పోస్టులు.
జోనల్ క్యాడర్ :
నాయిబ్ తాసీల్దార్, సీనియర్ అసిస్టెంట్, ఎంఆర్ఐ, ఏఆర్ఐ, సీనియర్ స్టెనోగ్రాఫర్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే, సూపరింటెండెంట్, నాన్‌టెక్నికల్ పర్సనల్ అసిస్టెంట్, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ, అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్, సీనియర్ డ్రైవర్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-1,2,3, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్-2, తదితర పోస్టులు.
మల్టీ జోనల్ పోస్టులు :
డిప్యూటీ కలెక్టర్/ ఆర్డీవో, అసిస్టెంట్ సెక్రటరీ, సూపరింటెండెంట్, తాసీల్దార్, ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే, సీఐ, డీఎస్పీ, కమర్షియల్ టాక్స్ ఆఫీసర్, డిప్యూటీ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్-1, 2, అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్, హెల్త్ ఇన్స్ట్రక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, డివిజనల్ పంచాయతీ ఆఫీసర్, ఎంపీడీవో, మండల పంచాయతీ అధికారి, అగ్రికల్చర్ అధికారి, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్-1, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-2,3 తదితర అధికారులు.