శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 04, 2020 , 00:45:45

చట్టానికిలోబడే క్యాబినెట్‌ నిర్ణయం

చట్టానికిలోబడే క్యాబినెట్‌ నిర్ణయం
  • చట్టవిరుద్ధమైతేనే న్యాయసమీక్షకు అవకాశం
  • విధాన నిర్ణయాల్లో కోర్టు జోక్యానికి అవకాశం లేదు
  • సెక్రటేరియట్‌ అంశంపై ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రభుత్వ నిర్ణయం చట్టానికి విరుద్ధంగా ఉంటేనే న్యాయసమీక్షకు అవకాశం ఉంటుందని అడ్వకేట్‌ జనరల్‌ బండా శివానందప్రసాద్‌ పేర్కొన్నారు. ప్రభుత్వం చట్టానికి లోబడి ప్రస్తుత సచివాలయ పాత భవనాలను కూల్చి అదేచోట నూతన సమీకృత భవనాన్ని నిర్మించాలని నిర్ణయించిందని తెలిపారు. ప్రస్తుత భవనాల కూల్చివేతను అడ్డుకోవాలని దాఖలైన పిటిషన్లపై చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ అభిషేక్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. ఏజీ వాదనలు వినిపిస్తూ.. నూతన సచివాలయాన్ని నిర్మించాలన్న క్యాబినెట్‌ నిర్ణయంలో చట్టవిరుద్ధమైన అంశాలు ఏమున్నాయో పిటిషనర్లు నిరూపించలేకపోయారని తెలిపారు.ప్రజాప్రయోజన వ్యాజ్యం ముసుగులో సొంతప్రయోజనాలను నెరవేర్చుకోవాలనుకొనే ఉద్దేశాన్ని కోర్టు గుర్తించాలని కోరారు. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వమే ఏ భవనాలు సరైనవి, ఎన్ని నిధులు ఖర్చు చేయాలనే అంశాలను నిర్ణయిస్తుందని తెలిపారు. అశోక్‌కుమార్‌ పాండే, ఎస్సీ గుప్తా, పాల్కో, తమిళనాడు సచివాలయ తరలింపు కేసు, జల్‌మహల్‌ రిసార్ట్‌ వర్సెస్‌ కేపీ శర్మ, నర్మదా బచావో ఆందోళన్‌ తదితర కేసుల్లో తీర్పులను ఏజీ హైకోర్టు ముందుంచారు.  


ప్రస్తుత భవనాలు పనికిరావు 

ఆధునిక పాలనా విధానానికి అనుగుణంగా భవనాలు లేవని నలుగురు ఈఎన్సీల టెక్నికల్‌ కమిటీని నిర్ధారించిందని ఏజీ తెలిపారు.  మంత్రులు, కార్యదర్శులకు వేర్వేరు భవనాలుండటంతో రహస్య అధికారిక పత్రాల కదలిక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పారు. 33 జిల్లాల అధికారులతో సమావేశం నిర్మించేందుకు సరైన వేదిక లేదని పేర్కొన్నారు. ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ సైతం అనుగుణంగా లేవని పేర్కొన్నదని తెలిపారు. సాంకేతిక అంశాలను నిర్ధారించడానికి తాము ఇంజినీర్లమో, ఆర్కిటెక్టులమో కాదని ధర్మాసనం స్పష్టంచేసింది. ఈఎన్సీల కమిటీ రిపోర్ట్‌పై పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది సత్యంరెడ్డి అనుమానం వ్యక్తం చేయగా హైకోర్టు పైవిధంగా వ్యాఖ్యానించింది.  సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ, కేంద్ర ఏజెన్సీ లేదా స్వతంత్ర సంస్థలతో భవనాల స్థితిని తేల్చాలని కోరారు. పిటిషనర్లు వాదనలకు సరిపోయినంత సమయం ఇస్తామని పేర్కొన్న ధర్మాసనం, విచారణను గురువారానికి వాయిదావేసింది. 


logo