ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Aug 06, 2020 , 03:21:20

21 రోజుల్లో ఇంటి అనుమతులు

21 రోజుల్లో ఇంటి అనుమతులు

 • గడువు దాటితే పర్మిషన్‌ లభించినట్టే
 • జాప్యం చేసే అధికారులకు జరిమానా
 • టీఎస్‌ బీ పాస్‌ పాలసీకి క్యాబినెట్‌ ఆమోదముద్ర 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: భవన నిర్మాణ అనుమతులను సరళతరం చేస్తూ రూపొందించిన టీఎస్‌ బీపాస్‌ పాలసీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ విధానం ప్రకారం 21 రోజుల్లోనే భవన నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలి. లేదంటే 22వ రోజున ఆటోమెటిక్‌గా ఆన్‌లైన్‌లో పర్మిషన్‌ వచ్చేస్తుంది. జీహెచ్‌ఎంసీ మినహా అన్ని మున్సిపాలిటీలు ‘తెలంగాణ మున్సిపల్‌ యాక్ట్‌-2019’ పరిధిలోకి వస్తాయని తెలిసిందే. అయితే భవన నిర్మాణ అనుమతుల విషయంలో జీహెచ్‌ఎంసీ సహా అన్ని పురపాలక సంఘాలకు వర్తించేలా ఒక పాలసీ ఉండాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. అనుమతుల్లో పారదర్శకత నెలకొల్పడం, నిర్దిష్ఠ సమయం విధించడం, టౌన్‌ ప్లానింగ్‌  అధికారులకు, నిర్మాణదారుకు మధ్య వ్యక్తిగత ప్రమేయాన్ని తగ్గించాలని భావించారు.  

బీపాస్‌లోని ముఖ్యాంశాలు 

 • మొత్తం ఆన్‌లైన్‌ విధానంలోనే అనుమతులు ఇస్తారు. మొబైల్‌ యాప్‌ లేదా వెబ్‌సైట్‌ (https://tsbpass.telangana. gov.in) లేదా మీసేవ, పౌర సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 
 • నిర్మాణ స్థలం 75 చదరపు గజాల వరకు ఉంటే.. నిర్మాణానికి ఎలాంటి అనుమతి అవసరం లేదు. ఏడు మీటర్ల వరకు నిర్మించుకోవచ్చు. అయితే ఆన్‌లైన్‌లో టోకెన్‌ ఫీజు కింద ఒక్క రూపాయి, ఆస్తిపన్ను  మొదటి విడుత కింద రూ.100 చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి.  
 • 75-600 గజాల స్థలానికి.. 10 మీటర్ల ఎత్తువరకు నిర్మించే భవనాలకు దరఖాస్తు చేసుకోగానే అనుమతి ఇవ్వాలి. 
 • 600 చదరపుగజాలకు పైన ఉంటే.. 10 మీటర్ల ఎత్తు వరకు నిర్మించే భవనాలకు యజమానులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు 21 రోజుల్లోగా అనుమతులివ్వాలి. ఇవ్వకుంటే 22వ రోజున ఆన్‌లైన్‌ వ్యవస్థ అటోమెటిక్‌గా అనుమతులు మంజూరు చేస్తుంది.  
 • నిబంధనలకు విరుద్ధంగా భవనం నిర్మిస్తున్నట్టు అనుమానం వస్తే అధికారులు గడువు పొడిగించి, డీమ్డ్‌ క్యాటగిరీ కింద అనుమతులు ఇవ్వవచ్చు. 
 • 600 గజాల్లోపు నిర్మాణానికి అనుమతులు పొందినవారు.. 21 రోజుల తర్వాత పనులు ప్రారంభించాలి. 
 • జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలోని హైలెవల్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ అన్ని అనుమతులను పరిశీలించాలి. అవకతవకలు జరిగితే అనుమతులు రద్దు చేస్తారు.  అధికారుల అలసత్వం వల్ల అనుమతులు ఆలస్యమైతే జరిమానా వేస్తారు.
 • అనుమతులు పొందిన భవనాల వివరాలన్నీ టీఎస్‌ బీపాస్‌ వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు నమోదవుతాయి. 
 • ప్లాన్‌ ప్రకారం భవన నిర్మాణాలు జరుగుతున్నాయో లేదో పర్యవేక్షణ ఉంటుంది.
 • అనధికారిక భవన నిర్మాణాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే 48 గంటల్లోగా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. నిర్మాణాలను కూల్చడంతోపాటు ఉల్లంఘనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి. 
 • టీఎస్‌ బీపాస్‌ అమలు పర్యవేక్షణకు  చేజింగ్‌ సెల్‌ ఏర్పాటుచేస్తారు. 


logo