గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Aug 07, 2020 , 03:18:25

వేగంగా బిల్డింగ్‌ పర్మిషన్లు

వేగంగా బిల్డింగ్‌ పర్మిషన్లు

  • దరఖాస్తు చేసిన 21 రోజుల్లోనే అనుమతి
  • టీఎస్‌ బీపాస్‌కు క్యాబినెట్‌ ఆమోదం
  • సందేహాల నివృత్తికి టోల్‌ఫ్రీ నంబర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఇల్లు కట్టుకోవడం అంటే జీవితంలో పెద్ద పని. పట్టణాలు, నగరాల్లో అయితే పర్మిషన్‌ రావడమే కష్టం. సాధారణ ప్రజలకు ఇది మరీ ఇబ్బంది. ఇకపై ఇలాంటి సమస్యలకు చెక్‌ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా టీఎస్‌-బీపాస్‌ను అమలులోకి తెస్తున్నది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రేటర్‌ హైదరాబాద్‌లో భవన నిర్మాణాలకు సులభంగా అనుమతినిచ్చే టీఎస్‌ బీపాస్‌ విధానాన్ని రాష్ట్ర మంత్రివర్గం బుధవారం ఆమోదించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఉత్తర్వులు రాగానే పూర్తిస్థాయిలో అమల్లోకి రానున్నది. దరఖాస్తు ప్రక్రియలో ఇబ్బందులుంటే అధికారులతో మాట్లాడేందుకు 040-22666666 టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీతోపాటు రాష్ట్రంలోని 128 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లు, 6 అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీల్లో పూర్తిస్థాయిలో బీపాస్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అనుమతులు 21 రోజుల్లోనే జారీ చేయడం ప్రధాన ఉద్దేశంగా దీన్ని రూపొందించారు. 

టీఎస్‌-బీపాస్‌ ప్రత్యేకతలివి..

  • భవన నిర్మాణ అనుమతి సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌తో సులభంగా, తక్షణమే ఇస్తారు.
  • 75 చదరపు గజాలవరకు విస్తీర్ణంలోని ప్లాట్లలో 7 మీటర్ల ఎత్తు పరిమితితో జీ ప్లస్‌ 1 నివాసభవనాల నిర్మాణానికి ఎలాంటి అనుమతి అవసరంలేదు. రూపాయి చెల్లించి తక్షణమే భవననిర్మాణ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ పొందవచ్చు.
  • 76 గజాల నుంచి 600 గజాల విస్తీర్ణంలోని ప్లాట్లలో 10 మీటర్ల ఎత్తుతో నిర్మించే నివాస భవన నిర్మాణాలకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి అనుమతి పొందవచ్చు. భవన నిర్మాణం పూర్తయిన తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ పొందాలి.
  • 600 గజాల కన్నా ఎక్కువ విస్తీర్ణంలోని ప్లాట్లలో 10 మీటర్ల ఎత్తు కంటే ఎక్కువ ఉండే నాన్‌ రెసిడెన్షియల్‌ భవనాల నిర్మాణానికి టీఎస్‌-బీపాస్‌ కింద కామన్‌ అప్లికేషన్‌ చేసుకోవచ్చు. ఎన్వోసీ కోసం ఇతర శాఖలను సంప్రదించాల్సిన అవసరంలేదు.
  • భవన నిర్మాణాల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 21 రోజుల్లో అనుమతులు జారీ చేస్తారు. 21 రోజుల్లో రాకుంటే.. అనుమతి వచ్చినట్లుగానే భావించి 22వ రోజున దరఖాస్తుదారుడికి ఆన్‌లైన్‌లో అనుమతి పత్రం ఇస్తారు. 
  • సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఆధారంగా అనుమతులు ఇచ్చిన నిర్మాణాలను తర్వాత తనిఖీ చేస్తారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే నోటీసు ఇవ్వకుండానే జరిమానా విధించడం, కూల్చివేయడం, సీజ్‌ చేయడం వంటివి చేస్తారు.
  • సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఆధారంగా తాత్కాలిక లేఅవుట్‌ ప్లాన్‌ పర్మిషన్‌కు ఆన్‌లైన్‌లో 21 రోజుల్లో పర్మిషన్‌ ఇస్తారు. లేఅవుట్‌ పూర్తిచేసిన తర్వాత డెవలపర్‌ సంతకం, సెల్ఫ్‌ డిక్లరేషన్‌ సర్టిఫికెట్‌ ఆధారంగా జిల్లా కమిటీలతో పరిశీలించి అనుమతి జారీచేస్తారు.


logo