సోమవారం 01 జూన్ 2020
Telangana - May 14, 2020 , 01:29:52

పండ్ల విక్రయాల్లో ‘సెర్ప్‌' సక్సెస్‌

పండ్ల విక్రయాల్లో ‘సెర్ప్‌' సక్సెస్‌

  • రైతులనుంచి మామిడి, అరటి,పుచ్చకాయ, బొప్పాయి కొనుగోలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ‘సేటు.. ఇంకొంచెం ధర పెంచుండ్రి. పండ్లు తెచ్చినందుకు బండి కిరాయిగూడ ఎల్తట్టు కనిపిస్తలేదు. పండ్లు తెంపినందుకు పనోళ్ల కూలి కట్టనీకె ఈ పైసలు సరిపోతట్టులేవు. లాభం లేకుట్టెవాయె. పెట్టిన ఖర్చులకాడికి ఇయ్యిండ్రి’ ఇదీ మామిడి పండ్లను మార్కెట్‌కు తీసుకొచ్చి వ్యాపారికి అమ్మిన ఓ రైతు ఆవేదన.. ఇలాంటి కష్టాలనుంచి గట్టెక్కించేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) ముందుకొచ్చింది. కరోనా కష్టకాలంలోనూ పండ్ల తోటల రైతులకు అండగా నిలుస్తున్నది. పండ్లను నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేస్తూ విజయవంతంగా ముందుకెళ్తున్నది. మార్కెటింగ్‌ సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నది. మొన్నటివరకు మామిడి పండ్లకే పరిమితమైన సెర్ప్‌ కార్యకలాపాలు.. ఇప్పుడు అరటి, పుచ్చకాయ, బొప్పా యి పండ్లకు విస్తరించింది. మాస్క్‌ల తయారీలో కీలకంగా పనిచేసిన మహిళా సంఘాల ద్వారా మామిడి ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటుచేసింది. కాయలను శాస్త్రీయ పద్ధతిలో (కార్బైడ్‌ లేకుండా) మాగబెట్టి అమ్మకాలు సాగిస్తున్నది. ఈ ఏడాది 3 వేల టన్నుల మామిడి క్రయవిక్రయాలు లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటికే 2,500 టన్నులు కొన్నది. గుజరాత్‌, ఢిల్లీ రాష్ర్టాలకు కూడా ఎగుమతిచేసేస్థాయికి చేరుకున్నది. సెర్ప్‌ సిబ్బంది 13 జిల్లాల్లో చిన్న, సన్నకారు రైతుల నుంచి మామిడికాయలను కొంటున్నారు. మిగతా రకాల పండ్లు 400 టన్నులు కొనాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సెర్ప్‌ వ్యవసాయ విభాగం డైరెక్టర్‌ ఎన్‌ రజిత బుధవారం ‘నమస్తే తెలంగాణ’కు వివరించారు. పేర్లు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న రైతుల నుంచే కొంటూ.. వారికి 48 గంటల్లోనే డబ్బులు చెల్లిస్తున్నారు. కాయలను కాడతోనే కోస్తుండటంతో ఎక్కువరోజులు మన్నికగా ఉంటాయి. ఇందుకోసం రైతులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. గ్రేడింగ్‌ ప్రకారం ప్యాకింగ్‌ చేస్తున్నారు. మేడ్చల్‌, శామీర్‌పేటల్లోని కేంద్రాల్లో సహజ పద్ధతుల్లో మాగబెడుతున్నారు. 

లాభాల్లో రైతుకు 25 శాతం వాటా

వాల్‌మార్ట్‌, మెట్రో, బిగ్‌ బాస్కెట్‌ వంటి సంస్థలతోపాటు గేటెడ్‌ కమ్యూనిటీలకు కూడా వివిధ రకాల పండ్లను సరఫరా చేస్తున్నారు. హోల్‌సేల్‌, రిటెయిల్‌గా విక్రయిస్తున్నారు. మౌఖిక ప్రచారంతోనే గేటెడ్‌ కమ్యూనిటీల వరకు రిటెయిల్‌గా విక్రయాలు నిర్వహిస్తున్నట్టు రజిత తెలిపారు. మామిడిపండ్లను అమ్మగా వచ్చే లాభంలోనూ రైతుకు 25 శాతం వరకు ఇస్తున్నట్టు రజిత వివరించారు.

సెర్ప్‌ మామిడి విక్రయాల లక్ష్యం 
3,000 టన్నులు
రైతుల నుంచి సేకరించింది 
2,500  టన్నులు
పుచ్చకాయ, అరటి, బొప్పాయి కొనుగోలు లక్ష్యం 
400 టన్నులు


logo