బుధవారం 03 జూన్ 2020
Telangana - May 09, 2020 , 04:35:09

నష్టాల ఊబిలోకి డిస్కంలు

నష్టాల ఊబిలోకి డిస్కంలు

  • అన్నిరకాల విద్యుత్‌ వినియోగదారులపై భారం
  • వ్యవసాయ మీటర్లకు తక్షణం రూ.976 కోట్లు కావాలి
  • ఒక్కో వ్యవసాయ కనెక్షన్‌ నెలకు 5 వేలు కట్టాలి
  • నష్టాలువచ్చే ప్రాంతాలకే డిస్కంలు పరిమితం
  • ఏటా రూ.600-1000 కోట్లు అదనపు భారం
  • అభ్యంతరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం
  • ఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి వెల్లడి

కేంద్రం బిల్లుతో డిస్కంలు పూర్తిగా ధ్వంసమైపోతాయి. భవిష్యత్తులో అవి అదృశ్యమైపోయినా ఆశ్చర్యంలేదు. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించేందుకు కనీసం వెయ్యి కోట్లు ఖర్చవుతుంది. ఈ ఖర్చుకు తోడు ఫ్రాంచైజీలు, సబ్‌లైసెన్సీల రూపంలో మరో దెబ్బ పడుతుంది. ఓపెన్‌ యాక్సెస్‌ వినియోగదారులు ఇంకా పెరిగి మరో రూ. వెయ్యి కోట్ల భారం పడుతుంది. దీంతో డిస్కంలు నిండా మునిగిపోతాయి. 

- రఘుమారెడ్డి, ఎస్పీడీసీఎల్‌ సీఎండీ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కేంద్రం తీసుకొచ్చే విద్యుత్‌ సవరణ బిల్లు ఆమోదం పొందితే రైతాంగంతోపాటు, ప్రతి వినియోగదారుడు విద్యుత్‌ నష్టాలను భరించాల్సి ఉంటుందని టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎండీ జీ రఘుమారెడ్డి చెప్పారు. జనరేషన్‌, ట్రాన్స్‌మిషన్‌ సంస్థలు.. వినియోగదారులకు మధ్య వారధిలా ఉండే డిస్కంలు నష్టాలఊబిలో కూరుకుపోతాయన్నారు. ఫ్రాంచైజీలు, సబ్‌లైసెన్సీలకు అనుమతి వల్ల డిస్కంలు కేవలం నష్టాలు వచ్చే ప్రాంతాలకే పరిమితమవుతాయని, వాటి భవిష్యత్‌ అంధకారమవుతుందని అన్నారు. కేంద్రం ప్రతిపాదించిన తాజా విద్యుత్‌ బిల్లులోని అంశాలు.. నష్టాలపై ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో రఘుమారెడ్డి విశ్లేషించారు.

సవరణల బిల్లు అమల్లోకి వస్తే డిస్కంల పరిస్థితి ఏమిటి?

సీఎండీ: కేంద్రం ప్రతిపాదిత బిల్లులో అనేకఅంశాలు డిస్కంలకు తీవ్ర నష్టాలు తెచ్చేవిగా ఉన్నాయి. పైస్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా.. కిందిస్థాయిలో వినియోగదారులకు మధ్య డిస్కంలు వారధిలా పనిచేస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా, నాణ్యమైన విద్యుత్‌ సేవలను అందించగలుగుతున్నాం. కొత్తబిల్లు అమల్లోకి వస్తే.. రైతులు, గృహవినియోగదారులపై నేరుగా భారం పడుతుంది. ఫ్రాంచైజీలు, సబ్‌లైసెన్సీల రాకతో డిస్కంలు కుదేలైపోతాయి. భవిష్యత్‌లో డిస్కంలు మాయమైపోయినా ఆశ్చర్యం లేదు.

వ్యవసాయ కనెక్షన్లకు మీటర్ల బిగింపు ప్రభావం ఎంత?

వ్యవసాయ కనెక్షన్లకు కూడా త్రీఫేజ్‌ మీటర్లు బిగించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం 24.4 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించడానికి రూ.976 కోట్లు అవసరమవుతాయి. ఆ ఖర్చునే భరించలేని స్థితిలో ఉన్న డిస్కంలపై వెంటనే ఫ్రాంచైజీలు, సబ్‌లైసెన్సీల రూపంలో మరో దెబ్బ పడుతుంది. బిల్లు అమల్లోకి వచ్చిన మరుక్షణం నుంచి డిస్కంలపై ఆర్థికభారం మొదలవుతుంది. ప్రతినెలా రీడింగ్‌ తీయడం.. బిల్లుల వసూలు అంతా మరో వ్యవస్థలా తయారవుతుంది.

రైతులకు సబ్సిడీ రూపంలో సహకారం వస్తుందనే ప్రచారం ఉన్నది?

తెలంగాణలో ఒక వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌ సగటున ఏడాదికి 8,747 యూనిట్లు వాడుతున్నది. ఉత్పత్తి వ్యయం, ఖర్చులు, ఉద్యోగుల జీతభత్యాలు, సరఫరా నష్టాలు తదితర అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటే.. యూనిట్‌కు రూ.6.87 ఖర్చవుతుంది. ఈ లెక్కన రూ. 59,917 బిల్లు కట్టాల్సి ఉంటుంది. అంటే నెలకు రూ.5 వేలు కట్టాలి. ఒకవేళ సబ్సిడీని గ్యాస్‌ సబ్సిడీ తరహాలో బిల్లులో కొంతమొత్తమే ఇస్తే.. మిగిలినది రైతు భరించాల్సిందే. కొత్త వ్యవసాయ కనెక్షన్‌ కావాలంటే రూ.5,787 చెల్లించాలి. దీనికి డిస్కం తరఫున స్తంభాలు, వైర్లు, అవసరమైతే ట్రాన్స్‌ఫార్మర్‌ వంటివాటికోసం రూ.70 వేలవరకు ఖర్చవుతుంది. ప్రస్తుతం దీనిపై రాష్ట్రప్రభుత్వం వందశాతం సబ్సిడీ ఇస్తున్నది. కొత్త బిల్లు అమలైతే ఈ భారమంతా రైతుపైనే పడుతుంది.

ఇతర క్యాటగిరీ వినియోగదారులపై ప్రభావం ఎంత?

రైతులతోపాటు రాష్ట్రంలో దాదాపు 1.22 కోట్ల మంది ఇతర వినియోగదారులందరూ ఆర్థికభారాన్ని మోయాల్సిందే. సుమారు 97.6 లక్షల మంది గృహ వినియోగదారులకు ప్రభుత్వం వివిధ స్లాబ్‌లలో ఇస్తున్న సబ్సిడీ ఇకపై అందదు. కొత్తబిల్లు ప్రకారం గృహవినియోగానికి ఇప్పటికి ఉన్న 9 స్లాబులు ఇకపై ఒకేలా ఉండొచ్చు. దీనిప్రకారం బిల్లు రూ.లక్ష అయినా.. రూ.500 అయినా ఒకటే. వీధిలైట్లకు రూ.6.10, నీటి సరఫరాకోసం రూ.5, కుటీరపరిశ్రమలకు రూ.4కే యూనిట్‌ విద్యుత్‌నందిస్తున్నాం. వీరందరికీ కాస్ట్‌ ఆఫ్‌సర్వీసు (ఉత్పత్తి, సరఫరా నష్టాలు, ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర ఖర్చులతో కలిపి) ప్రకారం బిల్లులు వస్తాయి.

కేంద్రానికి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఇచ్చారా?

ఏప్రిల్‌ 17న తెచ్చిన బిల్లుపై అభ్యంతరాలు, సలహాలకు 21రోజుల గడువు ఇచ్చారు. కరోనా నేపథ్యంలో దానిని జూన్‌ 5వరకు పొడిగించా రు. డిస్కంల తరఫున మా అభ్యంతరాలను రాష్ట్రప్రభుత్వ అనుమతితో కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం. నష్టాలను గణాంకాలతో సహా వివరిస్తాం.

డిస్కంలకు ప్రభుత్వం అండగా ఉంటున్నది కదా.. భవిష్యత్‌లో సాధ్యం కాదా?

ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎస్పీడీసీఎల్‌, ఎన్పీడీసీఎల్‌ అనేవి 100 శాతం ప్రభుత్వ యాజమాన్య సంస్థలు. ప్రభుత్వం ఆయావర్గాల కోసం పథకాలను రూపొందించి.. డిస్కంల ద్వారా అమలుచేస్తుంది. ఇప్పుడు అధికారమంతా కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోతే.. రాష్ట్రప్రభుత్వ ఆశయాలు, లక్ష్యాలు అమలుచేయలేం. తెలంగాణలోని అన్నివర్గాలు, క్యాటగిరీలకు 24 గంటల విద్యుత్‌నందించేందుకు ట్రాన్స్‌కో, రెండుడిస్కంలు కలిపి రూ.27,146 కోట్లతో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను డెవలప్‌ చేశాయి. ఇందుకు ప్రభుత్వం ఆరేండ్లలో సబ్సిడీ రూపంలో రూ.26,730 కోట్లు ఇచ్చింది. అదనపు విద్యుత్‌ కొనుగోలుకు మరో రూ.9,161 కోట్లు ఖర్చుచేసింది. భవిష్యత్‌లో పెరిగే అవసరాలకు అనుగుణంగా వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సి ఉంటుంది. దీనికి ఎవరు సాయం చేస్తారు. అప్పుల్లో ఉన్న డిస్కంలు ఎలా పెట్టుబడి పెడుతాయి. 


logo