బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Sep 29, 2020 , 02:40:46

మెదక్‌ ఓడీఎఫ్‌లో..బుల్లెట్‌ ప్రూఫ్‌ యుద్ధట్యాంకులు

మెదక్‌ ఓడీఎఫ్‌లో..బుల్లెట్‌ ప్రూఫ్‌ యుద్ధట్యాంకులు

 • అధునాత సౌకర్యాలు ఐసీవీ సొంతం
 • భారత అమ్ముల పొదిలోకి మరో 156 యుద్ధ ట్యాంకులు
 • 1,094 కోట్లతో రక్షణశాఖ ఆర్డర్‌
 • భూమిపై, నీటిలోనూ దూసుకెళ్తాయి
 • 2023నాటికి పూర్తి చేస్తామన్న ఓడీఎఫ్‌ జీఎం అలోక్‌ ప్రసాద్‌

‘అగ్ని దహించలేదు.. నీరు తడపలేదు.. వాయువు అడ్డుకోలేదు..’ మెదక్‌ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలో తయారవుతున్న సరికొత్త యుద్ధట్యాంకులకు ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి. గాలిలో రివ్వున ఎగిరే, నీటిలో సొరచాపలా, బుల్లెట్‌లను లెక్కచేయకుండా, కొండలే చిన్నబోయేలా దూసుకెళ్లడం వీటి ప్రత్యేకత. అధునాత ఫీచర్లు ఈ ట్యాంకుల సొంతం.

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తేతెలంగాణ/ కంది: అవకాశం దొరికినప్పుడల్లా సరిహద్దు దేశాల కవ్వింపులు, చాటుమాటున దుశ్చర్యలు.. రెచ్చగొట్టేలా దుస్సాహసాలు.. ఈ నేపథ్యంలో ఇతర దేశాలకు తీసిపోకుండా భారత్‌ తన ఆయుధ సంపత్తిని సృష్టించుకుంటున్నది. రూ.1,094 కోట్లతో 156 ఇన్‌ఫాంట్రీ కాంబాట్‌ వెహికిల్‌ (ఐసీవీ) బీఎంపీ-2 యుద్ధట్యాంకులను తయారుచేస్తున్నది. దేశ రక్షణరంగానికి ఇప్పటికే ఎన్నో యుద్ధట్యాంకులు, అధునాత యంత్రాలను అం దించిన ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ (ఓడీఎఫ్‌) ఇప్పుడు ఈ ట్యాంకుల తయారీలో నిమగ్నమైంది. సంగారెడ్డిజిల్లా కంది మండలంలోని ఓడీఎఫ్‌లో తయారవుతున్న ఐసీవీ బీఎంపీ-2గా పిలిచే ట్యాంకుల తయారీ గురించి మెదక్‌ ఓడీఎఫ్‌ జనరల్‌ మేనేజర్‌ అలోక్‌ ప్రసాద్‌ ఆసక్తికర విషయాలు ‘నమస్తే తెలంగాణ’కు వెల్లడించారు. 

పూర్తిగా బుల్లెట్‌ ఫ్రూఫ్‌

ఐసీవీ బీపీఎం2గా పిలిచే 156 యుద్ధ ట్యాం కుల తయారీ కోసం జూన్‌లో ఓడీఎఫ్‌కు ఆర్డర్‌ వచ్చింది. జూన్‌ 2న కేంద్ర రక్షణశాఖ కార్యాలయం నుంచి ఆదేశాలు రాగా, ఆగస్టు మొదటివారం నుంచి పరిశ్రమలో ట్యాంకుల తయారీని ప్రారంభించారు. వీటి తయారీకోసం కేంద్రం రూ.1,094 కోట్లు వెచ్చిస్తున్నది. ఇప్పటికే రక్షణశాఖకు అధునాత యుద్ధ ట్యాంకులు, ఆయుధాలను ఓడీఎఫ్‌ తయారుచేసి ఇచ్చింది. ఇప్పుడు వీటి తయారీతో ఓడీఎఫ్‌కు మరింత గుర్తింపు లభించినట్టే. తయారైన ట్యాంకులను పరిశ్రమల ఆవరణలోనే అన్ని రకాలుగా పరీక్షలు చేస్తున్నట్టు అలోక్‌ ప్రసాద్‌ చెప్పారు. రక్షణ యుద్ధ ట్యాంకుల్లో భాగంగా మొదటిసారి ఓడీఎఫ్‌లోనే.. బుల్లెట్‌ ఫ్రూఫ్‌ వాహనాలు తయారుకావడం విశేషమని వెల్లడించారు. ఇవి రష్యాకు చెందిన బోయివయ మాషిన పెహోటి (బీపీఎం:boevaya mashina pehoty) 2/2కే వంటి యుద్ధ ట్యాంకులని తెలిపారు.

2023 వరకు తయారీ పూర్తి

ఐసీవీ బీఎంపీ-2 యుద్ధట్యాంకుల తయారీ ని 2023 నాటికి పూర్తిచేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అలోక్‌ ప్రసాద్‌ చెప్పారు. దేశ సరిహద్దులో చోటుచేసుకుంటున్న ఘటనల నేపథ్యంలో దేశానికి అధునాత ఆయుధసంపత్తి ఉం డాలనిఅభిప్రాయపడ్డారు. రక్షణరంగానికి ఆ యుధాలు తయారుచేయడంలో ఓడీఎఫ్‌ కృషి గొప్పదన్నారు. భారత సైన్యానికి అవసరమైన అధునాతన ఆయుధ సంపత్తిని అందించడం తమ సంకల్పమని అలోక్‌ ప్రసాద్‌ వివరించారు.

ఐసీవీ బీఎంపీ-2 ప్రత్యేకతలు

 • 300 హార్స్‌ పవర్‌ ఇంజిన్‌ 
 • భూమిపై ప్రయాణ వేగం గంటకు 70 కిలోమీటర్లు
 • నీటిలో వేగం గంటకు 7కిలోమీటర్లు
 • అగ్ని నుంచి పూర్తి రక్షణ దీని ప్రత్యేకత
 • నావిగేషన్‌, రేడియో సెట్‌, ఇతర డిజిటల్‌ సౌకర్యాలు
 • 35 డిగ్రీల కోణంలో వచ్చే అడ్డంకులను సునాయాసంగా అధిగమిస్తుంది


logo