శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Nov 11, 2020 , 01:38:48

శరవేగంగా బీటీపీఎస్‌ పనులు

శరవేగంగా బీటీపీఎస్‌ పనులు

  • రెండో యూనిట్‌లో సీవోడీకి ఏర్పాట్లు  

మణుగూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం(బీటీపీఎస్‌) పరిధిలోని యూనిట్‌-2 సీవోడీ(కమర్షియల్‌ ఆపరేషన్‌ డిక్లరేషన్‌)కి సిద్ధమవుతున్నది. ఈ నెలలోనే సీవోడీ పూర్తి చేసి అధికారులు విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానించనున్నారు. ఈ మేరకు అతి త్వరలో యూనిట్‌-2లో ట్రయల్‌ రన్‌ చేపట్టనున్నారు. యూనిట్‌లో 270 మెగావాట్ల విద్యుదుత్పత్తి స్థిరంగా కొనసాగితే సీవోడీ చేస్తారు. ప్లాంట్‌ పరిధిలో మొత్తం 4 యూనిట్లు ఉండగా ఇప్పటికే యూనిట్‌-1లో ఉత్పత్తి ప్రారంభమైంది. ఈ నెలలో సీవోడీ పూర్తయితే రెండో యూనిట్‌ ద్వారా కరెంట్‌ ఉత్పత్తి మొదలుకానున్నది. యూనిట్‌-3లో లైటప్‌ పనులు ఇప్పటికే షురూ అయ్యాయి. త్వరలో దీని పరిధిలో సింక్రనైజేషన్‌ ప్రక్రియ చేపట్టనున్నారు.  

జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు పర్యవేక్షణ 

భద్రాద్రిక కొత్తగూడెం జిల్లా పినపాక, మణుగూరు మండలాల్లో 1080 మెగావాట్ల(4x270) సామర్థ్యంతో నిర్మిస్తున్న బీటీపీఎస్‌ పనులను జెన్‌కో అండ్‌ ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పనులు త్వరితగతిన పూర్తిచేసేందుకు సుమారు 2,500 మంది కార్మికులు, 300 మంది ఇంజినీర్లు రాత్రిపగలు శ్రమిస్తున్నారు.