మంగళవారం 26 మే 2020
Telangana - May 18, 2020 , 02:23:13

విడుతల వారీగా బీఎస్‌ 4 వాహన రిజిస్ట్రేషన్లు

విడుతల వారీగా బీఎస్‌ 4 వాహన రిజిస్ట్రేషన్లు

హైదరాబాద్ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిలిచిపోయిన బీఎస్‌ 4 వాహనాలకు విడుతల వారీగా రిజిస్ట్రేషన్‌ చేయాలని రవాణా శాఖ నిర్ణయించింది. దీనికోసం గతంలో స్లాట్లపై విధించిన పరిమితిని ఎత్తివేసి ప్రతిరోజూ బీఎస్‌ 4 వాహనాలకు సరిపడినంతగా స్లాట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. బీఎస్‌ 6 వాహనాలకు సంబంధించి ఎటువంటి నియంత్రణ లేకుండా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం బీఎస్‌ 4 వాహనాలను నిర్ణీత గడువులోగా రిజిస్ట్రేషన్‌ చేయాల్సి ఉన్నప్పటికీ కరోనా ప్రభావంతో రవాణా శాఖ లావాదేవీలు నిలిపివేశారు. దాదాపు 3 వేలకుపైగా వాహనాలు నగరంలో పెండింగ్‌లో ఉన్నాయి.

 సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం గత మార్చి 31 వరకు బీఎస్‌ 4 వాహనాలను రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి అనుమతిచ్చారు. అయితే లాక్‌డౌన్‌తో మార్చి 22 వరకు మాత్రమే రవాణాశాఖ కార్యాలయాలు సేవలందించాయి. తర్వాత సేవలు నిలిపివేయడంతో చాలా వాహనాలకు రిజిస్ట్రేషన్లు కాలేదు. అంతేకాకుండా కొన్ని వాహనాలు మిగిలిపోవడంతో షోరూం నిర్వాహకులు పరిచయస్తులు, బంధువుల పేర్లతో తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ జనరేట్‌ చేశారు. వీటన్నింటికి కూడా శాశ్వత రిజిస్ట్రేషన్‌ చేయనున్నారు.


logo