హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): అధికార కాంగ్రెస్ పార్టీకి పోలీస్, ఎన్నికల యంత్రాంగం ఏకపక్షంగా పనిచేశాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ ఆరోపించారు. ఓటర్లకు నగదు, చీరలు, బహుమతులు పంచుతూ ప్రలోభపెడుతున్నారని, లొకేషన్‌తోపాటు పూర్తి ఆధారాలతో 20 సార్లు కలిసి ఫిర్యాదుచేసినా ఎన్నికల ప్రధాన అధికారి పట్టించుకోలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలకు పోలీసులు పప్పెట్లుగా మారారని విమర్శించారు. ఉత్తరప్రదేశ్, బీహార్, రాయలసీమ తరహాలో తెలంగాణలో రిగ్గింగ్ సంస్కృతిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకొచ్చారని మండిపడ్డారు. వివిధ ప్రాంతాల నుంచి ముస్లిం మహిళలను ఆటోలో తీసుకొచ్చి బోగస్ ఓట్లు వేయించారని విమర్శించారు. ఓడిపోతామనే భయంతోనే బీఆర్ఎస్ నేతలపై దాడులు చేయించారని, రేవంత్‌రెడ్డి రౌడీయిజానికి ఇదో మచ్చుతునకని దుయ్యబట్టారు. ఇంత అరాచకమైన, దారుణమైన ఎన్నిక ప్రక్రియను గతంలో చూడలేదని అన్నారు. తెలంగాణభవన్‌లో మంగళవారం మీడియాతో దాసోజు మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్, బీహార్ ఎన్నికలను తలపించే రీతిలో అక్రమాలు జరిగాయని విమర్శించారు. రూ.వందల కోట్ల తాయిలాలు పంచి, బీఆర్ఎస్ నేతలను బెదిరించి సీఎం రేవంత్‌రెడ్డి చిల్లర సంప్రదాయాలకు తెరతీశారని మండిపడ్డారు. ఓటుకు రూ.పదివేల దాకా పంచారని, చీరలు కూడా లక్ష మందికి పంచి రాజ్యాంగాన్ని ఖూనీ చేశారని విమర్శించారు. ప్రజలపై సీఎం రేవంత్‌రెడ్డికి విశ్వాసం లేకనే అంతులేని అక్రమాలకు తెరలేపారని మండిపడ్డారు.
జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ గెలుస్తుందని తెలిసే రేవంత్‌రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని దాసోజు శ్రవణ్ విమర్శించారు. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడంతో బోగస్ ఓటింగ్ గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిందని విమర్శించారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌పై కూడా కాంగ్రెస్ గూండాలు దాడిచేశారని ఆరోపించారు. పాతబస్తీ నుంచి ఓటర్లను తెప్పించి ఓట్లు వేయించారని, ఎంఐఎం సహకరించిందని విమర్శించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు సమస్యాత్మక పోలింగ్ బూత్‌ల జాబితాను సీఈవోకు ఇచ్చినా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు దగ్గరుండి దొంగ ఓట్లు వేయించారని మండిపడ్డారు. మంత్రులకో రూల్, బీఆర్ఎస్ నేతలకో రూల్ అన్నట్టుగా వ్యవహరించారని మండిపడ్డారు. సందు సందులో రౌడీలు, గూండాలు తిరిగితే.. డ్రోన్ కెమెరాలు పెట్టామని చెప్తున్న ఎన్నికల అధికారులు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఏజెంట్లు బూతుల నుంచే మంత్రులకు ఫోన్ చేస్తే, మంత్రులు పోలింగ్ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారని, దీనిపై ఫిర్యాదుచేశామని సజ్జనార్, శివధర్‌రెడ్డి ఏంచేశారని నిలదీశారు. ఎన్నికల కమిషన్ అధికారులు గుండె మీద చేయి పెట్టుకుని ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. ఈవీఎంలనైనా పారామిలిటరీ రక్షణలో భద్రపరచాలని డిమాండ్ చేశారు. అక్రమాలకు సహకరించిన అధికారులు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఎన్ని దాష్టీకాలు చేసినా ప్రజలు ఓటింగ్‌కు వచ్చారని, ధర్మమే గెలుస్తుందని అన్నారు. ధైర్యంగా పనిచేసిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలను సీఎం రేవంత్‌రెడ్డి ఖూనీ చేశారని, ఆయన ఎన్ని అక్రమాలు చేసినా కేసీఆర్ వైపే ప్రజలు ఉన్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ స్పష్టంచేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అక్రమాలకు మూడు నాలుగు నెలల ముందే రేవంత్‌రెడ్డి తెరతీశారని చెప్పారు. 20 వేల దొంగ ఓటర్లను ఓటర్ల జాబితాలో చేర్చారని ఆధారాలు సహా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరూపించినా సీఈవో చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. పోలింగ్ ప్రక్రియలో జరిగే అక్రమాలపై ఇప్పటికప్పుడు ఆన్లైన్లో ఫిర్యాదుచేసే సీ విజిల్ యాప్ నేటికీ పనిచేయడం లేదని, ఇంతకన్నా ఘోరం మరొకటి ఉంటుందా?అని ప్రశ్నించారు. ఓటర్లు కొందరు తమ పేర్లు కూడా చెప్పడంలేదని, 13 ఏండ్ల అమ్మాయితో కూడా కాంగ్రెస్ నేతలు ఓటు వేయించారని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డితో ఎన్నికల కమిషన్ కుమ్మకైందని ఆరోపించారు. ఎగ్జిట్ డోరు నుంచి పదుల సంఖ్యలో బోగస్ ఓటర్లను పంపించారని, కనీసం చెక్ చేయమని కోరినా పట్టించుకోలేదని విమర్శించారు. దొంగ ఓట్లకు పోలీసులు సహకరించారని, దొంగ ఓటర్లను బీఆర్ఎస్ పట్టిస్తే కనీసం చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రౌడీషీట్ ఉన్న చిన్న శ్రీశైలంయాదవ్‌ను పోలీసులు బైండోవర్ చేయాల్సి ఉన్నదని, కానీ, నియోజకవర్గంలో తిరిగినా, బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేసినా ఆయనపై చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.
ముఖ్యమంత్రిగా ఉన్న ఓటుకు నోటు దొంగ.. అప్పుడు ఎమ్మెల్యేను కొనాలని ప్రయత్నించారని, ఇవాళ రూ.5 వేల దాకా ఒకో ఓటుకు ఇచ్చి తన అవినీతి సొమ్మును పంచి పెట్టారని మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శించారు. జూబ్లీహిల్స్‌లో ఎన్నికల కమిషన్ అస్సలు పనిచేయలేదని మండిపడ్డారు. ఎన్ని అక్రమాలు చేసినా జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్దే విజయమని ధీమా వ్యక్తంచేశారు. సమావేశంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, బీఆర్ఎస్ నేతలు ముఠా జయసింహ, మోహిత్ఖాన్ పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తమ కాన్వాయ్‌లతో గస్తీలు తిరుగుతూ ఓటర్లను ప్రలోభపెట్టారని మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి బీఆర్ఎస్ను టార్గెట్ చేశాయని మండిపడ్డారు. తన రాజకీయ జీవితంలో ఏ ఎన్నికలోనూ ఇలాంటి అక్రమాలు చూడలేదని అన్నారు. స్వేచ్ఛగా ఓటు వేసుకొనే సంస్కృతిని రేవంత్ సర్కార్ కాలరాసిందని విమర్శించారు. కాంగ్రెస్ వేసే దొంగ ఓట్లకు పోలీసు అధికారులు, ఎన్నికల సిబ్బంది సహకరించారని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులపై పోలీసులతో దౌర్జన్యం చేయించారని మండిపడ్డారు. అన్ని నిబంధనలను కాంగ్రెస్ నేతలు అతిక్రమించారని, అపార్ట్మెంట్ల ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారని మండిపడ్డారు. పోలింగ్ బూత్ ఏజెంట్లను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెదిరించారని ఫైరయ్యారు. ఎన్నికల కమిషన్ కండ్లు, చెవులు మూసుకుని కాంగ్రెస్‌కు సహకరించిందని ఆరోపించారు. ఎన్ని అక్రమాలు చేసినా ప్రజలు ఈ ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఓటు వేశారని భావిస్తున్నట్టు తెలిపారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక ఉపఎన్నికను సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్‌గా తీసుకుని పోలింగ్ రోజు అరాచకాలకు, అక్రమాలకు పాల్పడ్డారని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి విమర్శించారు. మొత్తం యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఓటమి భయంతో సీఎం గల్లీ గల్లీ తిరిగారని, ఆయన భయం నిజమైతదని చెప్పారు. సైలెంట్ ఓటు బీఆర్ఎస్కే పడిందని, పది వేల ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నామాని ధీమా వ్యక్తంచేశారు. కేసీఆర్ వైపు నిలబడ్డ జూబ్లీహిల్స్ ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.