బుధవారం 20 జనవరి 2021
Telangana - Jan 01, 2021 , 02:33:22

కిమ్స్‌ వైద్యుడికి ‘బ్రిటిష్‌' పురస్కారం

 కిమ్స్‌ వైద్యుడికి ‘బ్రిటిష్‌' పురస్కారం

  • రఘురామ్‌ పిల్లరిశెట్టికి అరుదైన గౌరవం..
  • సత్కారం పొందిన తొలి భారతీయ వైద్యుడు
  • హైదరాబాద్‌, డిసెంబర్‌ 31 (నమస్తే తెలంగాణ): కిమ్స్‌ గ్రూప్‌ హాస్పిటల్స్‌ మెంబర్‌ ఆఫ్‌ డైరెక్టర్‌, ఉషాలక్ష్మి బ్రెస్ట్‌ క్యాన్సర్‌ సెంటర్‌ ఫౌండర్‌, సీఈవో, ప్రముఖ బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వైద్య నిపుణుడు డాక్టర్‌ రఘురామ్‌ పిల్లరిశెట్టి అరుదైన ఘనతను సాధించారు. బ్రిటిష్‌ ప్రభుత్వ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ఆఫీసర్‌ ఆఫ్‌ ది మోస్ట్‌ ఎక్సలెంట్‌ ఆర్డర్‌ ఆఫ్‌ ది బ్రిటిష్‌ ఎంపైర్‌ అవార్డు దక్కించుకొన్నారు. ఈ పురస్కారం అందుకోనున్న మొదటి భారతీయ వైద్యుడిగా కీర్తి గడించారు. ప్రభుత్వంతోపాటు వివిధరంగాల్లో సామాజిక సేవ కోసం విశేష కృషి చేసినవారికి బ్రిటిష్‌ రాణి పలు పురస్కారాలను అందజేసి సత్కరిస్తారు. అందులో నైట్‌హుడ్‌ అవార్డు బ్రిటిష్‌ ప్రభుత్వ అత్యున్నత పురస్కారం కాగా, రెండోది కమాండ్‌ ఆర్డర్‌ ఆఫ్‌ది బ్రిటిష్‌ ఎంపైర్‌, మూడోది ఆఫీసర్‌ ఆఫ్‌ది బ్రిటిష్‌ ఎంపైర్‌. బ్రిటిష్‌ ప్రభుత్వం ఏటా రెండుసార్లు ఈ అవార్డులను అందజేస్తుంది. 2021 సంవత్సర హానర్స్‌ జాబితాను క్వీన్‌ ఎలిజిబెత్‌-2 ఇటీవల విడుదలచేశారు. అందులో రఘురామ్‌కు స్థానం దక్కడం విశేషం. 54 ఏండ్ల రఘురామ్‌ రొమ్ము క్యాన్సర్‌ చికిత్సలో ఆసియాలోనే పేరుగాంచిన వైద్యనిపుణుడు. తన తల్లి ఉషాలక్ష్మి పేరిట బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌ను, చారిటబుల్‌ ట్రస్ట్‌ను ఏర్పాటుచేసి పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రొమ్ము క్యాన్సర్‌పై మహిళలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆయన సేవలకుగాను బ్రిటిష్‌ ప్రభుత్వం ఈ అవార్డు ప్రకటించింది. పురస్కారం దక్కడంపై డాక్టర్‌ రఘురామ్‌ హర్షం వ్యక్తంచేశారు. ఇది  తన బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్నారు.


logo