ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 17, 2020 , 14:58:08

ఎస్సీ, ఎస్టీలకు ఉపాధి కల్పన విషయంపై సీఎం దృష్టికి తీసుకెళ్తా

ఎస్సీ, ఎస్టీలకు ఉపాధి కల్పన విషయంపై సీఎం దృష్టికి తీసుకెళ్తా

హైదరాబాద్ : యాంత్రీకరణ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కోల్పోతున్న వారిలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన యువత అధిక సంఖ్యలో ఉన్నారు. వారి ఉపాధి కోసం వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు సబ్సిడీపై ఇప్పించాల్సిన అవసరం ఉందని, ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.గురువారం మంత్రుల అధికారిక నివాసంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ రాష్ట్ర శాఖ ప్రతినిధులు సమావేశమై పలు అంశాలపై చర్చించి వినతి పత్రాన్ని అందజేశారు.

 ప్రతినిధుల విజ్ఞప్తిపై వినోద్ కుమార్ స్పందించారు. గ్రామీణ ప్రాంతాల్లో యాంత్రీకరణ ప్రభావం వల్ల ఉపాధి అవకాశాలు కోల్పోతున్న వారిలో ఎస్సీ, ఎస్టీలకు చెందిన యువత పెద్ద సంఖ్యలో ఉందని, వారిని ఆదుకోవాలని ఆ ప్రతినిధులు వినోద్ కుమార్ ను కోరారు. ప్రతినిధులు ప్రస్తావించిన విషయంతో ఏకీభవించిన వినోద్ కుమార్.. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీనిచ్చారు.

ఎస్సీ, ఎస్టీలకు చెందిన వారికి నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత కల్పించాలని, యూనివర్సిటీ వైస్ ఛాన్సులర్స్ గా అవకాశం ఇవ్వాలని, నిబంధనల మేరకు డబుల్ బెడ్ రూం ఇండ్లు, నివాస స్థలాలు కేటాయించాలని, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు రుణాలు మంజూరు చేయాలని, బ్యాక్ లాగ్ ఖాళీలు భర్తీ చేయాలని ఆ ప్రతినిధులు వినోద్ కుమార్ కు అందజేసిన వినతిపత్రంలో కోరారు.

ప్రతినిధి బృందంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఆర్గనైజేషన్ జాతీయ అధ్యక్షుడు పీ. నర్సింహా, రాష్ట్ర అధ్యక్షుడు ఆరేపల్లి రాజేందర్, ప్రధాన కార్యదర్శి బ్రహ్మనాథ రావు, కోశాధికారి రమేష్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ప్రొఫెసర్ మురళీ దర్శన్, వరంగల్ నిట్ (ఆర్.ఇ.సి) ప్రొఫెసర్ ఆనంద్ కోల, అమెరికాలోని  ప్రముఖ వైద్యుడు దేవయ్య, తదితరులు ఉన్నారు.

logo