ఆదివారం 12 జూలై 2020
Telangana - Jul 01, 2020 , 02:46:50

ట్రయల్‌ రన్‌లో సమస్యలు సహజం

ట్రయల్‌ రన్‌లో సమస్యలు సహజం

  • దీనిని సవాల్‌గా తీసుకొని ముందుకు సాగుతాం
  • జగదేవ్‌పూర్‌ కాలువకు బుంగపై ఈఎన్సీ హరిరాం
  • ఓర్వలేకనే బీజేపీ, కాంగ్రెస్‌ నేతల విమర్శలు: వంటేరు

గజ్వేల్‌/మర్కూక్‌: కొత్తగా నిర్మించిన కొండపోచమ్మసాగర్‌ జగదేవ్‌పూర్‌ కాలువకు ఏర్పడిన బుంగ సాధారణమైనదేనని, ఇలాంటి సమస్యలు ఏర్పడుతుంటాయని కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ హరిరాం తెలిపారు. దీనిని సవాల్‌గా తీసుకొని కాలువల ట్రయల్న్‌న్రు పూర్తి చేస్తామన్నారు. సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం శివారు వెంకటాపూర్‌ వద్ద జగదేవ్‌పూర్‌ కాలువకు మంగళవారం ఉదయం బుంగ పడిన ప్రదేశాన్ని కాళేశ్వరం ఎస్‌ఈ వేణు, డీఈ బద్రీనారాయణ, క్వాలిటీ కంట్రోల్‌ సీఈ శ్రీనివాస్‌తో కలిసి ఆయన పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భుత నిర్మాణం అని చివరి విజయం వరకు ఎన్నో సమస్యలు ఎదుర్కొనక తప్పదని వివరించారు. శివారు వెంకటాపూర్‌ వద్ద కాలువ బైపాస్‌ రోడ్డు నిర్మాణం స్లాబ్‌ల మధ్య గ్యాప్‌ వల్లనే లీకేజీతో బుంగ పడినట్లు పేర్కొన్నారు. దీనిని వెంటనే మరమ్మతు చేసి మరుసటి రోజు నుంచి నీటి విడుదల యథావిధిగా జరుగుతున్నదన్నారు. జగదేవ్‌పూర్‌ కాలువకు బుంగ పడటంపై బీజేపీ, కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణలు దయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయని రాష్ట్ర ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అవినీతి అక్రమాలు పెరుగుతున్నాయని, అభద్రతాభావంతో ప్రజలు అల్లాడుతున్నా పట్టించుకోకుండా ఓర్వలేని తనంతో తెలంగాణ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు.


logo