మంగళవారం 26 జనవరి 2021
Telangana - Dec 30, 2020 , 01:22:25

త్వరలోనే పీఆర్సీ నివేదిక!

త్వరలోనే  పీఆర్సీ నివేదిక!

  • సిద్ధంచేసిన పీఆర్సీ చైర్మన్‌ బిశ్వాల్‌
  • ఉద్యోగులకు ప్రయోజనకరంగా రూపకల్పన
  • వయోపరిమితి పెంపుపైనా కసరత్తు పూర్తి
  • కొత్త నోటిఫికేషన్లకు శాఖలవారీగా సంసిద్ధం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రభుత్వోద్యోగులకు వేతన సవరణపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటన చేయడంతో పీఆర్సీ తన తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించడానికి సిద్ధమవుతున్నది. వేతన సవరణపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన సీఆర్‌ బిశ్వాల్‌ కమిషన్‌ గడువు ఈనెల 31వ తేదీతో ముగియనున్నది. ఈ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది. తెలంగాణ వచ్చిన తర్వాత తొలి పీఆర్సీలో 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చి ఉద్యోగులను ఆశ్చర్యపరిచిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి రాష్ట్రంలోని దాదాపు ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి జీతాన్ని పెంచాలని నిర్ణయించారు. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన అన్ని అంశాలపై పీఆర్సీ నివేదికను రూపొందిస్తున్నట్టు సమాచారం. ఈ అనేక ప్రతిపాదనలు పొందుపరిచే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. 

గతానికి భిన్నంగా ఈసారి నివేదిక ఉంటుందని ఉద్యోగవర్గాలు భావిస్తున్నాయి. దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకొని కమిషన్‌ నివేదికను ఇవ్వనున్నట్టు సమాచారం.  ఉద్యోగులకు సంబంధించి కనీస వేతన స్థాయిని, రిటైర్మెంట్‌ సమయంలో అందే కనీస పెన్షన్‌ను కూడా సవరించాలని, ఉద్యోగులకు ఇచ్చే ఇంటి అద్దె భత్యాన్ని కూడా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సవరించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. దీనిపై వేతనసంఘం ఏవిధంగా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది. దీంతోపాటు పూర్తి పెన్షన్‌ పొందడానికి ఉన్న అర్హతను కూడా కుదించాలని ఉద్యోగులు కోరుతున్నారు. దీనిపై కూడా నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నది. ఇక ఎంతశాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలన్నదానిపై భిన్నవాదనలు ఉన్నాయి. 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏర్పాటుచేసిన సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆధ్వర్యంలోని కమిటీ.. ఉద్యోగసంఘాలతో చర్చించిన తర్వాత ఈ విషయమై స్పష్టత వస్తుంది. ఉద్యోగులకు ఎంత శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలో ఈ కమిటీ.. ఉద్యోగసంఘాలతో చర్చించిన తర్వాత తేలుస్తుంది. గతంలో ప్రదీప్‌ చంద్ర నేతృత్వంలో కమిటీని ఏర్పాటుచేసిన విషయం తెల్సిందే. అయితే, కమిటీ చెప్పినదానికన్నా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉదారంగా వ్యవహరించిన విషయాన్ని ఉద్యోగ సంఘాలు గుర్తుచేస్తున్నాయి. సీఎస్‌ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా రాష్ట్ర మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకొంటుంది. వీలైనంత త్వరగానే ఉద్యోగుల వేతన పెంపు ప్రక్రియ పూర్తయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లుచేస్తున్నది. ఫిబ్రవరి, మార్చిలోపే మొత్తం ప్రక్రియను ముగించనున్నారు. 


logo