బుధవారం 03 జూన్ 2020
Telangana - May 20, 2020 , 22:47:59

చెరువులో పడి బాలుడు మృతి..

చెరువులో పడి బాలుడు మృతి..

కోటగిరి : పాఠశాలకు సెలవులు ఉండడం.. కుటుంబీకులు ఉపాధి హామీ పనులకు వెళ్లడంతో పశువులను మేపేందుకు వెళ్లిన బాలుడు చేపలు పట్టేందుకు ప్రయత్నించి చెరువులో మునిగిపోయాడు. ఈ సంఘటన నిజామాబాద్‌ జిల్లా కోటగిరి మండలం దేవునిగుట్ట తండాలో చోటు చేసుకుంది. ఎస్సై మచ్చేందర్‌రెడ్డి తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తండాకు చెందిన రాములు కుమారుడు సంజీవ్‌ (11) బుధవారం తండా శివారుకు పశువులు మేపేందుకు వెళ్లాడు. పశువులను అక్కడే ఉన్న చెరువులో నీళ్లు తాగించేందుకు తీసుకెళ్లాడు. చెరువులో పుష్కలంగా నీరుండడం.. చేపలు పైకి ఎగురుతుండడంతో సంజీవ్‌తో పాటు మరో బాలుడితో కలిసి చేపలు పట్టేందుకు చెరువులోకి దిగారు. 

నీరు ఎక్కువగా ఉండడంతో మరో బాలుడు బయటకు వచ్చేశాడు. సంజీవ్‌ మాత్రం చేపలను పట్టుకోవాలనే తపనతో మరింత లోపలకు వెళ్లాడు. లోతు ఎక్కువగా ఉండడం.. సంజీవ్‌కు ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. మరో బాలుడు కేకలు వేయడంతో పక్కనే పొలాల్లో పని చేస్తున్నవారు గమనించి చెరువు వద్దకు పరుగులు తీశారు. అప్పటికే సంజీవ్‌ నీటిలో మునిగిపోయాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు  ఈతగాళ్లను పిలిపించి చెరువులో గాలించగా సంజీవ్‌ మృతదేహం లభించింది. మృతుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. సంజీవ్‌ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 5వ తగరతి పూర్తయింది. సంజీవ్‌ తండ్రి రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. logo