బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Oct 29, 2020 , 03:01:50

స్లాట్‌ బుక్‌ అయితే.. రిజిస్ట్రేషనే!

స్లాట్‌ బుక్‌ అయితే.. రిజిస్ట్రేషనే!

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:  రైతులు, భూ యజమానులకు అవినీతి నుంచి విముక్తి కలుగనున్నది.. కబ్జాలకు చరమగీతం పాడే సమయం వచ్చింది.. ఆఫీసుల చుట్టూ తిరిగే బాధలు తప్పనున్నాయి.. అవును! ధరణితో భూ రికార్డుల వ్యవస్థ పూర్తి పారదర్శకతను సంతరించుకోనున్నది. మొబైల్‌ ఫోన్‌ నుంచి ఒక్క అప్లికేషన్‌ పెడితే చాలు.. అధికారులు నిర్ణీతకాలంలో పని పూర్తి చేయాల్సిందే. స్లాట్‌ బుక్‌ చేసుకొని, సమయానికి అన్ని డాక్యుమెంట్లతో కార్యాలయంలో ఉంటే ఎవ్వరూ భూమి అమ్మకాన్ని, కొనుగోలును ఆపలేరు. కాదు, కూడదు అనే అధికారం ఎవ్వరికీ లేదు. అన్ని సరిగ్గా ఉంటే కేవలం 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌ పూర్తై, మ్యుటేషన్‌ జరిగిపోతుంది. ధరణిలో ఉన్న భూ రికార్డులను ప్రభుత్వం బ్యాంకులకు అనుసంధానం చేస్తున్నది. దీంతో రైతులు బ్యాంకులో రుణాలు తీసుకోవడానికి పాస్‌బుక్‌ నంబర్‌ చెపితే చాలు, ధరణి రికార్డు ఆధారంగా బ్యాంకులు రుణాలు ఇస్తాయి.

కబ్జాలకు కాలం చెల్లు

ఎవ్వరూ.. ఎవరి భూమిని కబ్జా చేయలేని విధంగా మార్పులు తీసుకొచ్చింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో కొత్తగా రూపొందించిన పట్టాదారు పాస్‌పుస్తకాల్లో కబ్జాదారు కాలమ్‌ను తొలగించారు. గతంలో కొంతమంది అధికారులు అడిగిన మేరకు లంచాలు ఇవ్వకపోతే  అనుభవదారు కాలంలో ఇతరుల పేర్లు పెట్టి ఇబ్బందులకు గురిచేసేవాళ్లు. అందుకే ఆ రెండు కాలమ్స్‌ను తీసేశారు.

డూప్లికేట్లకు చెల్లుచీటి

ధరణిలో పొందుపరిచిన సమాచారానికి భూ యజమాని ఆధార్‌ లింక్‌ అయి ఉంటుంది. ఇందులో భూ యజమాని ఫొటో కూడా ఉంటుంది.  ఒకరి భూమిని మరొకరు దొంగ సర్టిఫికెట్లు సృష్టించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి ఆస్కారం ఏమాత్రం లేదు. ఆధార్‌తో పాటు ఐరిస్‌ వ్యవస్థ కూడా ఉండటంతో ఎలాంటి ఆక్రమణలకు ఆస్కారం ఉండదు. ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములన్నింటికీ వందకు వంద శాతం రక్షణ ఉంటుంది.