గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 02, 2020 , 16:22:27

స్మార్ట్‌ఫోన్‌లోనూ ధరణి స్లాట్ బుకింగ్‌కు అవ‌కాశం

స్మార్ట్‌ఫోన్‌లోనూ ధరణి స్లాట్ బుకింగ్‌కు అవ‌కాశం

హైదరాబాద్ :  రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ధరణి సేవలు విజయవంతంగా ప్రారంభమయ్యాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేశ్ కుమార్ వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్  తాహసిల్దార్  కార్యాలయంలో ధరణిసేవల ప్రారంభ కార్య్రక్రమాన్ని సీఎస్ సోమేశ్ కుమార్ సోమ‌వారం ఉదయం ఆకస్మికంగా తనికీ చేశారు. ఈ సందర్బంగా ధరణి ద్వారా చేసిన తొలి గిఫ్ట్ డీడ్  రిజిస్ట్రేషన్ పత్రాలను మంచాల ప్రశాంతికి సీఎస్ అందజేశారు. జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, అడిషనల్ కలెక్టర్ హరీష్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

 ఈ సంద‌ర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. ధ‌ర‌ణి ద్వారా రిజిస్ర్టేష‌న్ల‌కు మంచి స్పంద‌న వ‌స్తుంద‌న్నారు. సోమ‌వారం ఉద‌యం 10:30 గంట‌ల వ‌ర‌కు 946 మంది రిజిస్ర్టేష‌న్లకు న‌గ‌దు చెల్లించార‌ని, 888 మంది స్లాట్ బుక్ చేసుకున్నారని తెలిపారు. అక్కడక్కడా స్వల్ప సాంకేతిక సమస్యలు మినహా రిజిస్ట్రేషన్లు విజయవంతంగా ప్రారంభమయ్యాయని సోమేశ్ కుమార్ వెల్లడించారు. రెండు, మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో రిజిస్ర్టేష‌న్లు అమలవుతాయని అన్నారు. 

రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్‌ను మీసేవా కేంద్రాల ద్వారా కేవలం రూ. 200 చెల్లించి చేసుకోవచ్చని సీఎస్ తెలిపారు. స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. భూముల అమ్మకాలు, గిఫ్ట్ సెల్, మరణించిన వారి వారసులకు రిజిస్ట్రేషన్, ఫ్యామిలి పార్టీషన్ రిజిస్ట్రేషన్లు నేడు ప్రారంభమయ్యాయని అన్నారు.  నాలా, పాత రిజిస్ట్రేషన్లు, పాత మ్యుటేషన్లు, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల పై త్వరలోనే ముఖ్యమంత్రి ప్రకటిస్తారని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ల సమయంలో ఫింగర్ ప్రింట్ లకు సంబంధించి సమస్యలేర్పడితే కంటి చూపు (ఐ సైట్ )ద్వారా చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.


570 మండ‌లాల్లో ధ‌ర‌ణి సేవ‌లు అందుబాటులోకి

హైదరాబాద్ జిల్లా మినహా 570 మండలాల్లో రైతులకు ధరణి సేవలు అందుబాటులో వచ్చాయని, ఇప్పటివరకు 1.48 లక్షల ఎకరాలకు సంబంధించిన 59.46 లక్షల ఖాతాలు ధరణిలో నిక్షిప్తం చేశామని తెలిపారు. ఏకకాలంలో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు ఒకే సారి జరిగే ఈ కొత్త పద్దతి దేశంలోనే వినూత్నమని తెలిపారు.

తొలి రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేసిన సీఎస్

శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో గిఫ్ట్ డీడ్ క్రింద ధరణి ద్వారా చేసిన తొలి రిజిస్ట్రేషన్ పత్రాలను మంచాల ప్రశాంతి అనే మహిళకు సీఎస్ అంద‌జేశారు. మంచాల ప్రభాకర్ తన వ్యవసాయ భూమిని మంచాల ప్రశాంతి గిఫ్ట్ సేల్ కింద రిజిస్ట్రేషన్ చేయగా జట్టే సైదులు, కొండా బాలిరెడ్డి లు సాక్షులుగా హాజరయ్యారు. తహసీల్దార్, రిజిస్ట్రేషన్  అధికారైనా తహసీల్దార్ ఎస్ జనార్దన్ రావు డిజిటల్ సంతకం తో కూడిన రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేశారు.