ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 11, 2020 , 02:37:48

నిరాడంబరంగా బోనాలు

నిరాడంబరంగా బోనాలు

  • ప్రజలంతా ఇంట్లోనే బోనం తీయాలి
  • సూర్యునికి చూపించి అమ్మవారికి సమర్పించండి
  • ఆలయాల్లో పూజారుల చేతుల మీదుగానే..
  • స్పష్టం చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌
  • కరోనా నేపథ్యంలో భక్తులు సహకరించాలని విజ్ఞప్తి

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కరోనా పరిస్థితుల దృష్ట్యా బోనాల ఉత్సవాలను ఈ సంవత్సరం నిరాడంబరంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొన్నది. ప్రజలు ఇంట్లోనే అమ్మవారికి బోనం సమర్పించాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. ఘటాల ఊరేగింపును పూజారులే దేవాలయాల పరిసరాల్లో చేపడతారని, అమ్మవార్లకు పట్టువస్ర్తాలు కూడా వాళ్లే సమర్పిస్తారన్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తిచేశారు. బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అధ్యక్షతన బోనాల ఉత్సవాలపై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి ఆషాఢ బోనాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. 

ప్రతి ఏటా జరిగే బోనాల జాతరకు లక్షల సంఖ్యలో ప్రజలు పాల్గొంటారని, ఈసారి కరోనా వైరస్‌ వ్యాపించే ప్రమాదం ఉన్నందున సామూహిక బోనాల పండుగ జరుపుకోవడం మంచిది కాదని తెలిపారు. నచ్చిన పద్ధతిలో బోనం తయారు చేసి సూర్యభగవానుడికి చూపించి, అమ్మవారి చిత్రపటం ముందు సమర్పించాలని ఆడపడుచులకు ఆయన సూచించారు. భక్తులెవరూ అమ్మవారి ఆలయాలకు బోనంతో రావొద్దని విజ్ఞప్తి చేశారు. ఆలయాల్లో పూజారులే పూజలు, అలంకరణలు, బోనం చేస్తారని అన్నారు. అమ్మవార్లకు ప్రభుత్వం తరఫున సమర్పించే పట్టువస్ర్తాలు ఒకరోజు ముందుగానే ఆలయాలకు అందజేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు మహమూద్‌ అలీ, మల్లారెడ్డి, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.logo