గురువారం 02 జూలై 2020
Telangana - Jun 10, 2020 , 02:39:45

బోనం ఇంట్లోనే

బోనం ఇంట్లోనే

  • మహమ్మారుల నుంచి కాపాడాలనే అమ్మకు బోనం
  • విశ్వమారే కమ్మినప్పుడు ఊరేగింపులు సరికాదు!
  • ఇంట్లోనే అమ్మకు బోనం సమర్పించుకోవచ్చు 
  • కరోనా వేళ ఇదే ఉత్తమం
  • ప్రజలకు పండితులు, పూజారుల సూచనలు
  • బోనాల నిర్వహణపై నేడు ఉన్నతస్థాయి సమీక్ష

కరోనా మహమ్మారి ప్రజలపై దండెత్తింది. భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత కచ్చితంగా పాటించాల్సిన పరిస్థితి. పైగా సామూహిక ఆధ్యాత్మిక కార్యక్రమాలపై కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లేదు. దీంతో బోనాల నిర్వహణపై ప్రజల్లో ఆందోళన నెలకొన్నది. ఊరేగింపుల్లో లక్షల సంఖ్యలో పాల్గొంటే వైరస్‌ భీకరంగా వ్యాపించే ప్రమాదం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

హైదరాబాద్‌ సిటీబ్యూరో/చార్మినార్‌/సనత్‌నగర్‌, నమస్తే తెలంగాణ: ఆషాఢం వచ్చిందంటే చాలు.. అమ్మకు బోనం లేస్తుంది. వర్షాకాలం ఆరంభంలో మహమ్మారుల బారి నుంచి తమను కాపాడాలని.. వానలు సక్కగ కురువాలని, ఎవుసం మంచిగ సాగి.. గాబులు బాగా నిండాలని గుండెలనిండా కోరుకొంటూ.. అమ్మవారిని కొలిచే సంబురం బోనాలు. కుండల్లో బెల్లంబువ్వ వండి.. పసుపు కుంకుమలతో వాటిని అలంకరించి నెత్తిన ఎత్తుకొని ఊరేగింపుగా గుడికి వెళ్లి అమ్మవారికి నైవేద్యం సంతర్పణచేసే అద్భుతమైన కార్యక్రమం. తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు ప్రతీక. కానీ ఏ మహమ్మారుల నుంచి తమను కాపాడాలని అమ్మవారిని కోరుకొంటూ ఏటా బోనాలు జరుపుకొంటామో.. ఇప్పుడు ఏకంగా విశ్వమారి మన సమాజంపై దండెత్తింది. 

ఈ విపత్కరమైన పరిస్థితుల్లో సామూహికంగా బోనాలు జరుపుకోవడం మరింత ప్రమాదకరమని పండితులు, అమ్మవారి దేవాలయాల పూజారులు, వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఇదెంతమాత్రం వాంఛనీయం కాదని చెప్తున్నారు. ‘బోనం అంటే భోజనం. అమ్మవారికి  భోజనం పెట్టడమే బోనాలు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులంతా కలిసి ఇంట్లోనే అమ్మవారికి నైవేద్యం సమర్పించడంలో దోషమేమీ ఉండదు’ అని పండితులు అంటున్నారు. రోగాలు రాకూడదని కోరుకొనే వారే.. విశృంఖలంగా వ్యాపిస్తున్న రోగాల నడుమ ఊరేగింపులు, సామూహిక పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం సరికాదని అంటున్నారు. ఇప్పటికే కరోనా మహమ్మారి ప్రజలపై యుద్ధంచేస్తున్నది. భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత కచ్చితంగా పాటించాల్సిన పరిస్థితి. పైగా సామూహిక ఆధ్యాత్మిక కార్యక్రమాలపై కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతిలేదు. 

ఈ కారణంగా బోనాల నిర్వహణపై ప్రజల్లో ఆందోళన నెలకొన్నది. ఊరేగింపుల్లో లక్షల సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున వైరస్‌ వ్యాప్తి భీకరంగా ఉండే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై పండితులు, ఆధ్యాత్మికవేత్తలు అమ్మవారికి ఇంట్లోనే కుటుంబ సభ్యుల నడుమ జరుపుకోవడం తప్పేమీ కాదని స్పష్టంచేస్తున్నారు ఈ క్రమంలోనే ఈ ఆషాఢంలో బోనాల పండుగ నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నది. ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల ప్రతినిధులు, అధికారులు, పూజారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కీలక నిర్ణయానికి వచ్చే అవకాశమున్నది. ఈ సారి విభిన్న పరిస్థితులు ఉన్నందున బోనాల ఉత్సవాన్ని నిర్వహించకపోవడమే మంచిదని అధిక శాతం పూజారులు అభిప్రాయపడుతున్నారు.

ఏ దోషాలు ఉండవు

భక్తులు దేవాలయానికి వెళ్లి బోనం సమర్పించడం ఆనవాయితీ. కరోనా నేపథ్యంలో ఈ సారి ఇంట్లోనే పండుగ చేసుకుంటే మంచిది. ఎలాంటి దోషాలు ఉండవు. నచ్చిన పద్ధతిలో బోనం తయారుచేసి దాన్ని సూర్యభగవానుడికి చూపించి ఇంట్లోకి వెళ్లి అమ్మవారి పటం ముందు సమర్పించుకోవచ్చు. ఒక విస్తరాకులో బోనం నైవేద్యాన్ని ఉంచి అమ్మవారికి నివేదించవచ్చు.

- బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం ప్రధానార్చకుడు బాలకృష్ణాచార్యులు

సామూహిక బోనాలు వద్దు

వాతావరణ మార్పుల కారణంగా వచ్చే విషరోగాల నుండి కాపాడాలని అమ్మవారికి బోనాలు సమర్పించే సంప్రదాయం అనాదిగా వస్తున్నది. కరోనా కట్టడికి ఇండ్లలోనే ఉండి అమ్మవారికి బోనం సమర్పించవచ్చు.

- లాల్‌దర్వాజా సింహవాహిని , అమ్మవారి దేవాలయ పూజారి నర్సింహ


logo