ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 20, 2020 , 19:43:48

వరవరరావు ఆరోగ్య స్థితిపై వైద్య నివేదిక కోరిన బాంబే హైకోర్టు

వరవరరావు ఆరోగ్య స్థితిపై వైద్య నివేదిక కోరిన బాంబే హైకోర్టు

ముంబై: విప్లవ రచయిత, కవి వరవరరావు ఆరోగ్య స్థితిపై వైద్య నివేదికను బాంబే హైకోర్టుకోరింది. భీమా కోరేగావ్ హింసా ఘటన కేసుపై సోమవారం విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు నివేదిక సమర్పించాలని ఎన్ఐఏ, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులో నిందితుడైన వరవరరావు గత వారం అస్వస్థతకు గురికాగా ముంబై జైలు నుంచి జేజే ఆసుపత్రికి తరలించారు. అనంతరం కరోనా పరీక్ష నిర్వహించగా గత గురువారం పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు జేజే దవాఖాన డీన్ డాక్టర్ రంజీత్ మంకేశ్వర్ తెలిపారు. దీంతో వరవరరావును నానావతి దవాఖానలోని కరోనా వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఆయన ఆరోగ్యంపట్ల భార్య హేమలత, కుమార్తెలు ఆందోళన వ్యక్తం చేశారు.

భీమా కోరేగావ్ హింసా ఘటనకేసుపై 2018 ఆగస్టులో వరవర‌రావును పూణె పోలీసులు తొలుత అరెస్ట్ చేయగా కోర్టు ఆదేశంతో విడుదల చేశారు. అదే ఏడాది నవంబర్ నెలలో మళ్లీ ఆయనను అరెస్ట్ చేశారు. తొలుత పూణెలోని ఎరవాడ జైలులో వరవరరావును ఉంచారు. అనంతరం ముంబై జైలుకు ఆయనను తరలించారు. 81 ఏండ్ల వరవరరావు ఆరోగ్యం క్షీణిస్తుండటంతోపాటు కరోనా నేపథ్యంలో ఆయనను విడుదల చేయాలని కోరుతూ 40 మంది ప్రముఖ రచయితలు ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రధాని మోదీకి లేఖ రాశారు. తాజాగా ఆయనకు కరోనా  సోకడంతో ఆరోగ్య పరిస్థితిపై బాంబే హైకోర్టు నివేదిక కోరింది.



logo