సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 24, 2020 , 00:38:34

ఇద్దరు పిల్లలతో కాలువలో దూకిన మహిళ

ఇద్దరు పిల్లలతో కాలువలో దూకిన మహిళ

  • తల్లీకూతురు మృతి
  • కొడుకు ఆచూకీ గల్లంతు

శంకరపట్నం: ఇద్దరు పిల్లలతో ఆదివారం అదృశ్యమైన మహిళ కథ విషాదాంతమైం ది. సోమవారం తల్లీకూతురు మృతదేహా లు కాలువలో లభించాయి. కొడుకు ఆచూకీ తెలియరాలేదు. పోలీసుల వివరా ల ప్రకారం.. కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం కరీంపేట్‌కు చెందిన గడ్డం రమ్య (25)కు కొడుకు దివ్యాంగుడైన శివమణి (5), కూతురు అమ్ములు(18నెలలు) ఉన్నారు. ఆదివారం తన పిల్లలను మోపెడ్‌పై ఎక్కించుకొని బయటకు వెళ్లిన రమ్య సాయంత్రమైనా తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు వెదికినా ఆచూకీ దొరకలేదు. గ్రామంలోని వ్యవసాయ పొలం వద్దకు వెళ్లే దారిలో ఎస్సారెస్పీ కాకతీయ కాలువ సమీపంలో దారి పక్కన మోపెడ్‌ కనిపించింది. కుటుంబసభ్యులు, గ్రామస్థులు తరలివచ్చి కాలువతో పాటు చుట్టు పక్కల గాలించారు.  

సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు రాత్రి వరకు గాలించినా వారి ఆచూకీ లభ్యం కాలేదు. సోమవారం ఉదయం హుజూరాబాద్‌ వద్ద స్థానికులకు కాకతీయ కాలువలో కొట్టుకువస్తున్న అమ్ములు మృతదేహం, కొద్ది దూరంలో రమ్య మృతదేహం లభించింది. శివమణి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అదనపు కట్నం తేవాలని అత్తింటివారు వేధించడం వల్లే తన అక్క.. పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్నదని రమ్య సోదరుడు ప్రశాంత్‌ ఆరోపించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రవి తెలిపారు. 


logo