గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 07, 2020 , 01:08:38

200 కోట్ల భూమి సేఫ్‌

200 కోట్ల భూమి సేఫ్‌
  • చనిపోయిన తాసిల్దార్‌ సంతకాలతో బోగస్‌ పాస్‌బుక్కులు
  • 35 ఎకరాలు స్వాధీనం చేసుకొని బోర్డు పాతిన రెవెన్యూ అధికారులు

బడంగ్‌పేట, నమస్తే తెలంగాణ: వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అధికారులు స్వా నం చేసుకొన్నారు. ఐదెకరాల బోగస్‌ పట్టా పాస్‌పుస్తకాలను చూపి 35 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేయాలని చూసిన రౌడీల ఆగడాలకు రెవెన్యూ అధికారులు చెక్‌పెట్టారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ మండలం పరిధిలోని జల్‌పల్లి సర్వేనంబర్‌ 232లో 19ఎకరాలు, 233లో 16.20 ఎకరాల భూమి ఉన్నది. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆ భూమి ప్రభుత్వానిదే. 


ఈ భూమిపై కన్నేసిన కొందరు కబ్జాబాబులు పాత సరూర్‌నగర్‌ మండలంలో తాసిల్దార్‌గా పనిచేసి చనిపోయిన సామ్యూల్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి 1976లో ఎక్స్‌సర్వీస్‌మెన్‌ కోటాలో మహమూద్‌అలీకి.. బి/1933 /2002 ద్వారా సర్వే నంబర్‌ 232, 233లో ఐదెకరాలు జారీచేసినట్లు పాస్‌ పుస్తకాలు సంపాదించారు. 2007లో అక్కడ ఒక గదిని నిర్మించి ఆ కొందరు రౌడీలను కాపలాగా పెట్టారు. అలాగే పక్కనే ఉన్న మరో 35 ఎకరాల భూమిని కాజేసేందుకు వ్యూహంపన్నారు. తమ భూమిని రెవెన్యూ రికార్డుల్లో ఎక్కించాలని సాబేర్‌ బేగం కోర్టును ఆశ్రయించగా.. 2019 ఫిబ్రవరిలో ఆ కేసును న్యాయస్థానం కొట్టివేసింది. 


మరోసారి కూడా కోర్టులో వ్యాజ్యం వేసేందుకు ప్రయత్నించగా.. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టి ఆ భూమి ప్రభుత్వానిదని తేల్చారు. నకిలీ పత్రాలతో భూమిని కాజేసేందుకు యత్నిస్తున్నట్టు అధికారుల విచారణలో బయటపడింది. ఈ సర్వే నంబర్లలోని భూమిని ప్లాట్లుగా చేసిన అక్రమార్కులు.. ఇప్పటికే పలువురికి విక్రయించినట్టు స్థానికులు చెప్తున్నారు. ప్లాట్లు కొనుగోలు చేసినివారినే ఆ భూమిలోనికి రానిచ్చి, మిగతావారిని రౌడీలతో తరిమికొట్టేవారని గ్రామస్థులు అంటున్నారు. భూమి తమదేనని నమ్మించి అమాయకులకు విక్రయించినట్టు సమాచారం. స్వాధీనం చేసుకొన్న భూమిలో రెవె న్యూ అధికారులు హెచ్చరిక బోర్డులు పాతా రు. మహమూద్‌అలీ పేరిట ఐదెకరాల బోగస్‌ పట్టా పాస్‌పుస్తకాలు సృష్టించి భూమి విక్రయించడానికి యత్నించారని బాలాపూర్‌ తాసిల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఆర్డీవో ఆదేశాల మేరకు భూమిని స్వాధీనం చేసుకున్నామన్నారు.


logo
>>>>>>