బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 20, 2020 , 19:00:24

రూ.210 కోట్లతో సింగరేణి క్వార్టర్స్‌ నిర్మాణానికి బోర్డు అనుమతి

రూ.210 కోట్లతో సింగరేణి క్వార్టర్స్‌ నిర్మాణానికి బోర్డు అనుమతి

హైదరాబాద్‌ : సీఎం కేసీఆర్‌ హామీ మేరకు రూ.210 కోట్లతో కొత్త క్వార్టర్ల నిర్మాణానికి సింగరేణి బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశం అంగీకారం తెలిపింది. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో సోమవారం జరిగిన 554వ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నామని ఆ సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ వెల్లడించారు. సింగరేణి ప్రాంతాల్లో క్వార్టర్లు నిర్మించి కార్మికులకు అందుబాటులోకి తేవాలని గతంలో శ్రీరాంపూర్‌ ప్రాంతీయ ఆత్మీయ సమ్మేళనంలో సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు.

ఈ మేరకు సత్తుపల్లిలో ఇప్పటికే తొలిదశ క్వార్టర్ల నిర్మాణం చేపట్టామని, ఇప్పుడు భూపాలపల్లిలో విశాలమైన సౌకర్యవంతమైన 994 ఎండీ టైపు క్వార్టర్లు నిర్మించడానికి నిర్ణయించామని దీనికి బోర్డు ఆమోదం లభించిందన్నారు. పర్యావరణ పరిరక్షణ చర్యలను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు నిపుణులతో ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయడానికి బోర్డు అంగీకారం తెలిపిందన్నారు. త్వరలో పూర్తిస్థాయి సింగరేణి పర్యావరణశాఖ ఏర్పాటవుతుందని తెలిపారు.

ఇల్లందు ఏరియా కోయగూడెం ఓసీ-2లో సర్ఫేస్‌ మైనర్‌ ద్వారా 74 లక్షల క్యూబిక్‌ మీటర్ల బొగ్గు తవ్వకానికి, మణుగూరు పీకేఓసీ నుండి రానున్న 6 ఏళ్లలో 1,416 లక్షల బ్యాంక్‌ క్యూబిక్‌ మీటర్ల ఓబీ తవ్వకానికి బోర్డు ఆమోదం తెలిపింది. సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లో ఓబీ తవ్వకం కోసం వినియోగించే మందుగుండు సామగ్రి కొనుగోలుకు రూ.106 కోట్లు, భూగర్భ గనుల్లో వాడే మందుగుండు సామగ్రి కొనుగోలుకు రూ.41 కోట్లను కేటాయించింది.

సింగరేణి ఎడ్యుకేషనల్‌ సోసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాలిటెక్నికల్‌ కళాశాల, మహిళా, జూనియర్‌, డిగ్రీ, పోస్టు గ్రాడ్యూయేట్‌ కళాశాలలు, 9  హైస్కూల్స్‌ నిర్వహణకు  2020-21 ఆర్ధిక సంవత్సరానికి రూ. 45 కోట్ల బడ్జెటును బోర్డు మంజూరు చేసింది. బోర్డు సభ్యులుగా ఉండి ఈ నెలాఖరుకు ఉద్యోగ విరమణ చేయనున్న రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి  అజయ్‌మిశ్రా, సింగరేణి డైరెక్టర్లు  ఎస్‌.శంకర్‌ (ఈ&ఎం),  బి.భాస్కరరావు (పీ&పీ) సేవలను సంస్థ ఛైర్మన్‌ ప్రశంసించి ఘనంగా సన్మానించారు.


logo