ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 21, 2020 , 02:52:06

రక్తనాళాలపైనా కరోనా దాడి

రక్తనాళాలపైనా కరోనా దాడి

  • అకస్మాత్తుగా పడిపోతున్న ఆక్సిజన్‌..
  • తేరుకునేలోపే ప్రాణాలు గాల్లోకి
  • హోం ఐసొలేషన్‌లో ఉన్నవారికి పల్స్‌ ఆక్సీమీటర్‌ తప్పనిసరి

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు.. పక్కనున్నవారు తేరుకునేలోపే ఊపిరి కోల్పోతున్నారు.. ఒకటి కాదు, రెం డు కాదు.. అనేక కేసుల్లో ఇదే పరిస్థితి. రక్తనాళాలపై కరోనా దాడిచేయడంతో ఒక్కసారిగా రక్తం గడ్డకడుతున్నది. దాంతో ఆక్సిజన్‌ స్థాయులు అమాంతం పడిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. అన్ని వయస్కులవారిలో ఇలాంటి ఘటనలు సంభవిస్తున్నా యువకులే ఎక్కువగా ప్రభావితం కావటం గమనార్హం. ఇటీవల హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఒక ఏఎస్సై, కుల్సుంపురాకు చెందిన ఒక కానిస్టేబుల్‌, రాజేంద్రనగర్‌ ప్రేమావతిపేటకు చెందిన ఒక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి, బేగంబజార్‌లో ఒక పహిల్వాన్‌ ఈ తరహాలోనే మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలో హోం ఐసొలేషన్‌లో ఉంటున్నవారు పల్స్‌ ఆక్సీమీటర్‌తో ఎప్పటికప్పుడు తమ ఆక్సిజన్‌ స్థాయులను పరీక్షించుకోవాలని వైద్యులు సూచించారు. ఆక్సిజన్‌ స్థాయులు పడిపోకుండా ఉండాలంటే ఎక్కువసేపు ఒకే భంగిమ ఉండవద్దని సూచించారు. ఆరు నిమిషాల్లో ఆక్సిజన్‌స్థాయి 95శాతం కంటే కిందికిపోతే డేంజర్‌ జోన్‌లో ఉన్నట్టేనని హెచ్చరించారు.

హోం ఐసొలేషన్‌లో ఉన్నవారికి పల్స్‌ ఆక్సీమీటర్‌ తప్పనిసరికరోనా వైరస్‌ ఊపిరితిత్తులపైనే కాకుండా రక్తనాళాలపైనా దాడి చేస్తున్నదని పరిశోధనల్లో వెల్లడవుతున్నది. అది దాడి చేసినప్పుడు రక్తంలో ఉన్న టీ సెల్స్‌కు, వైరస్‌కు జరిగే యుద్ధంలో రసాయనాలు వెలువడుతాయి. ఈ క్రమంలో కరోనరి ధమనులు వ్యాకోచిస్తాయి లేదా రక్తం గడ్డకడుతుంది. దీంతో గుండె ఆగిపోవటం, కిడ్నీలు విఫలం కావటం వంటి పరిణామాలు ఎదురవుతాయి. కొవిడ్‌ ఉన్న యువతలో ఆయాసం వెంటనే తెలియటం లేదు. దీనినే సైలెంట్‌ హైపోక్సిమా అంటారు. ఇది సైలెంట్‌ కిల్లర్‌గా మారుతుంది. అందుకే హోం క్వారంటైన్‌లో ఉన్న ప్రతీఒక్కరు పల్స్‌ ఆక్సీమీటర్‌ వాడాలి. కూర్చున్నప్పుడు, నిల్చున్నపుడు, వాకింగ్‌ చేసేప్పుడు ఆక్సిజన్‌ శాతాన్ని పరీక్షించుకోవాలి. ఒకే వైపు కూర్చోవటం, ఒకేవైపు పడుకోవటం చేయవద్దు.

- పరంజ్యోతి, నిమ్స్‌ పల్మనాలజీ విభాగాధిపతి


logo