సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 24, 2020 , 02:20:48

మార్ఫింగ్‌ ఫొటోలతో బ్లాక్‌మెయిల్‌

మార్ఫింగ్‌ ఫొటోలతో బ్లాక్‌మెయిల్‌

  •  సోషల్‌మీడియా నుంచి యువతుల ఫొటోల సేకరణ
  • తన నంబర్లకు డీపీగా పెట్టి చాటింగ్‌
  • తీసేయాలంటే డబ్బులివ్వాలని హుకూం 
  • తెలుగు రాష్ర్టాల్లో వంద మంది బాధితులు
  • ఏపీకి చెందిన పాత నేరస్థుడి అరెస్ట్‌

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్‌ నుంచి యువతుల ఫొటోలు, వివరాలు సేకరించి.. ఆ ఫొటోలను తన వద్ద ఉన్న నంబర్లకు డీపీగా పెట్టి వాట్సాప్‌లో చాటింగ్‌ చేస్తూ యువతులను ఇబ్బందిపెడుతున్న ఓ పాతనేరస్థుడిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సదరు నేరస్థుడు ఏపీ, తెలంగాణలో కలిసి వందమందిని వేధించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ బ్లాక్‌ మెయిలర్‌పై సీసీఎస్‌ సైబర్‌ క్రైమ్‌ ఠాణాతోపాటు మరో ఆరు కేసులు నమోదయ్యాయి. సీసీఎస్‌ జాయింట్‌ సీపీ అవినాశ్‌ మహంతి కథనం ప్రకారం.. ఏపీలోని కర్నూల్‌ జిల్లా ఆదోనికి చెందిన మహ్మద్‌ అహ్మద్‌ అలియాస్‌ మహమ్మద్‌ ఓ ప్రైవేట్‌ ఉద్యోగి. న్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌లో అమ్మాయిల ఫోన్‌ నెంబర్లు, వారి ఫొటోలు సేకరిస్తాడు. వాటిని మార్ఫింగ్‌ చేస్తాడు. తన వద్ద ఉన్న ఫోన్‌ నంబర్ల నుంచి వారి నంబర్లకు వాట్సాప్‌లో చాట్‌ చేస్తాడు. 

ఎవరితో చాట్‌ చేస్తాడో.. వారి ఫొటోనే తన నంబర్‌కు డీపీగా వాడుతాడు. కొత్త నంబర్‌ నుంచి మెసేజ్‌ రావడం.. మార్ఫింగ్‌ చేసిన తన డీపీ ఉండటంతో యువతులు ఉలిక్కిపడుతారు. ‘నా వద్ద ఇంకా నీ ఫొటోలు ఉన్నాయి.. నీ ఫొటో డీపీగా తీసేయాలంటే రూ.10 వేలు ఇవ్వాలంటూ బ్లాక్‌మెయిల్‌కు దిగుతాడు. ఇట్లా ఈ దందాను రెండేండ్లుగా కొనసాగిస్తున్నాడు. బెదిరిపోయిన కొందరి నుంచి డబ్బులు కూడా వసూలు చేశాడు. తనది హైదరాబాద్‌లోని టోలిచౌకీ ప్రాంతమని చెప్పుకొని ప్రేమిస్తున్నానంటూ మరికొందరిని వేధించాడు. విసిగి వేసారిన ఓ యువతి హైదరాబాద్‌ సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

తనతోపాటు మరో నలుగురిని నిందితుడు ఇలాగే వేధిస్తున్నాడంటూ బాధితురాలు పోలీసులకు వివరించారు. రంగంలోకి దిగిన పోలీసులు సెల్‌ఫోన్‌ నెంబర్‌ ఆధారంగా నిందితుడు కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మహమ్మద్‌గా గుర్తించారు. అరెస్టు చేసి మహిళలను వేధించేందుకు ఉపయోగిస్తున్న సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై నారాయణగూడ, సంతోష్‌నగర్‌, మీర్‌చౌక్‌, ఫలక్‌నుమా, కామాటిపురా, గోల్కొండతోపాటు రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని నేరేడ్‌మెట్‌ ఠాణాలో కేసులు నమోదై ఉన్నాయి. ఈ అభియోగంపై మూడేండ్ల క్రితం సైబర్‌క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదులు అందాయి. అప్పట్లో పోలీసులు నిందితుడికి నోటీసులు పంపారు. తర్వాత ఆయన కోర్టుకు హాజరుకాలేదు. మహిళలను వేధించడం కూడా ఆపలేదు. నిందితుడిని అరెస్ట్‌తో ఈ విషయయం వెల్లడయ్యింది. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్లు చేసినా, సోషల్‌ మీడియాలో వేధించినా ఫిర్యాదు చేయాలని జాయింట్‌ సీపీ తెలిపారు.  


logo