గ్రేటర్లో సెంచరీ ఖాయం

- గతంకన్నా పెరిగిన పోలింగ్ శాతం
- సోషల్ మీడియా వేదికగా బీజేపీ దుష్ప్రచారం
- ‘బండి’ మాట్లాడేవన్నీ అబద్ధాలే
- మీడియాతో ఎమ్మెల్సీ కవిత
కరీంనగర్, నమస్తే తెలంగాణ: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ సెంచరీ సాధించడం ఖాయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో గతంలోకన్నా పోలింగ్ శాతం పెరిగిందని చెప్పారు. అవగాహన లేని వాళ్లు పోలింగ్ శాతం తగ్గిందని ప్రచారం చేస్తున్నారని ఆమె వివరించారు. బుధవారం కరీంనగర్లో పర్యటించిన కవిత నగరంలోని గౌరీ శంకర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జాగృతి కార్యకర్త పసుల చరణ్ వివాహ వేడుకకు హాజరయ్యారు. దేవాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గలేదని, గతంలో కన్నా 3% పెరిగిందని చెప్పారు. తొందరపడి లెక్కలు వేసుకున్న బీజేపీ, ఇతర పార్టీలు చేస్తున్న తప్పడు ప్రచారమే ఇదన్నారు. జీహెచ్ఎంసీ చరిత్రలోనే ఈ సారి అత్యధిక పోలింగ్ నమోదైనట్టు చెప్పారు.
వెయ్యికోట్లతో కరీంనగర్ అభివృద్ధి
కరీంనగర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని, మంత్రి గంగుల కమలాకర్ రూ. వెయ్యి కోట్లకుపైగా నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నారని కవిత చెప్పారు. కేబుల్ వంతెన త్వరలోనే పూర్తికాబోతున్నదని తెలిపారు. ఐటీ హబ్‌లో 12 కంపెనీలతో ఒప్పందాలు జరిగాయని చెప్పారు.
కేంద్రానికి సవాలుగా వ్యవసాయ చట్టాలు
కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. రాష్ట్రంలో సన్న రకాలకు బోనస్ ఇస్తే మిగతా ధాన్యానికి తాము కనీస మద్దతు ధర ఇవ్వలేమని కేంద్రం పేర్కొనడాన్ని ఆమె తప్పుపట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విధానం అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఇతర రాష్ర్టాల్లో రైతులు మార్కెట్లకు వెళ్లి తమ ఉత్పత్తులను అమ్ముకుంటున్నారని, మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతుల వద్దకే వెళ్లి కొనుగోలు చేస్తున్నదన్నారు.
కేంద్ర సహకారం అందనందునే
జాగృతి ఆధ్వర్యంలో గతంలో నిరుద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని, కేంద్రం నుంచి సహకారం లేని కారణంగా నిలిపి వేశామని చెప్పారు. తాము ఇప్పటి వరకు 19 వేల మందికి శిక్షణ ఇచ్చి ఇందులో 90 శాతం మందికి ఉపాధి కల్పించామని వివరించారు. మిగిలిన వారికీ ఉపాధి కల్పించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఎమ్మెల్సీ కవిత వెంట రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్,మంత్రి గంగుల, జడ్పీ అధ్యక్షురాలు విజయ, కరీంనగర్ మేయర్ సునీల్‌రావు, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఉన్నారు.
‘బండి’వన్నీ అబద్ధాలే
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ మాట్లాడేవన్నీ అబద్దాలేనని, కరీంనగర్ ఎంపీగా ఉన్న ఆయన తన నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటి వరకు ఒక్క పైసా తేలేదని అన్నారు. ట్రిపుల్ ఐటీని ఎందుకు కోల్పోయారో సంజయ్ చెప్పాలని ప్రశ్నించారు. ఎంపీగా ఎన్నికై రెండేండ్లు దగ్గరపడుతున్నా.. అభివృద్ధిని విస్మరించారన్నారు. ఇటు దుబ్బాక, అటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సోషల్ మీడియాలో అబద్ధాలను ప్రచారం చేసిందని విమర్శించారు.