శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Nov 23, 2020 , 01:29:33

బీజేపీ నోట మతం తప్ప అభివృద్ధి లేదు: ఒవైసీ

బీజేపీ నోట మతం తప్ప అభివృద్ధి లేదు: ఒవైసీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: భారతీయ జనతా పార్టీకి మతం తప్ప అభివృద్ధి ఊసే ఉండదని మజ్ల్లిస్‌ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. బీజేపీ నాయకులను అర్ధరాత్రి నిద్రలేపి అడిగినా వారి నోట మతం, ఉగ్రవాదులు, తీవ్రవాదులు, దేశద్రోహులు, పాకిస్తాన్‌, అసదుద్దీన్‌.. ఇవే మాటలు తప్ప.. మరేమి రాదని విమర్శించారు. అసలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో ఏమి అభివృద్ధి సాధించింది? ఎంత మందికి ఉపాధి కల్పించింది? అని ప్రశ్నిస్తే.. వారి వద్ద సమాధానమే ఉండదని చెప్పారు. ఆదివారం పాతబస్తీలోని పలు చోట్ల ప్రచారంలో పాల్గొన్న ఆయన బీజేపీపై ధ్వజమెత్తారు. కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఉపాధి కోల్పోయినా కేంద్రం ఇంతవరకు ఎలాంటి నష్ట నివారణ చర్యలు చేపట్టలేదని విమర్శించారు. అసలు తెలంగాణకు కేంద్రం చేసిన ఆర్థిక సాయమేమిటని ఆయన ప్రశ్నించారు. 2019 తర్వాత హైదరాబాద్‌ అభివృద్ధికి ఏమైనా కేంద్రం చేయూతనిచ్చిందా అనే విషయంపై బీజేపీ నేతలు ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కరోనా వైరస్‌కు కూడా ఇస్లాం మతం రంగు పులిమిన ఘనత బీజేపీకే దక్కుతుందని ఎద్దేవాచేశారు. మతం పేరిట పండ్లు, కూరగాయలు అమ్ముకునే వారి పొట్టగొట్టారని ఆరోపించారు. తమ పార్టీ నాయకులు ఏడాదికి 12 నెలల పాటు ప్రజల మధ్యే ఉంటారని, కానీ, కొన్ని పార్టీలు ఎన్నికలప్పుడే ఓట్ల కోసం వస్తాయని విమర్శించారు. అటువంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.