బీజేపీ టీకా రాజకీయం!

- ఎన్నికల వేళ ప్రజల్ని మభ్యపెట్టే యోచన
- దుమ్మెత్తి పోస్తున్న నేషనల్, సోషల్ మీడియా
- బీహార్‌లో ఉచితటీకా హామీపై విమర్శలు
- ఓటేయకుంటే టీకా ఇవ్వరా? అని ప్రశ్నిస్తున్న ప్రజలు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఎన్నికల వేళ ఓటర్లను ఆకర్షించేందుకు టీవీలు, సెల్ఫోన్లు, కంప్యూటర్లు వంటి రకరకాల వస్తువులు ఆశ చూపడం చూస్తుంటాం. కానీ, కేంద్రంలో అధికార బీజేపీ మాత్రం ఓటుకోసం ప్రజల ఆరోగ్యాన్ని తాకట్టుపెడుతున్నది. వచ్చేవారం జరిగే బీహార్ ఎన్నికల్లో గెలిచేందుకు నీచస్థాయికి దిగజారింది. తమను గెలిపిస్తే బీహార్ ప్రజలందరికీ కొవిడ్ వ్యాక్సిన్‌ను ఉచితంగా పంపిణీ చేస్తామని హామీ ఇచ్చింది. విజన్ డాక్యుమెంట్ పేరిట కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఎన్నికల మ్యానిఫెస్టోలను విడుదల చేశారు. దేశంలో మూడు వ్యాక్సిన్లు ప్రయోగదశలో ఉన్నాయని ఇవి విజయవంతం కాగానే బీహార్ ప్రజలకే ముందుగా వ్యాక్సిన్ ఇస్తామని హామీని ప్రకటించారు. ప్రజల ప్రాణాలతో సంబంధమున్న వ్యాక్సిన్‌ను ఎన్నికల కోసం వాడుకోవటంపై దేశవ్యాప్తంగా విమర్శలు గుప్పుమన్నాయి. గెలిపించకుంటే రాష్ట్ర ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారా? అని ఇతర పక్షాలు మండిపడుతున్నాయి. ఇతర రాష్ట్రాలకు వ్యాక్సిన్ పంపిణీ చేయకుండా.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీహార్‌కు వ్యాక్సిన్‌కు పంపిణీ చేస్తామనడం రాజ్యంగ విరుద్ధమవుతుందని, దీనిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్‌లు బీజేపీని కేంద్రంగా ఎదురుదాడికి దిగారు.
మండిపడుతున్న నెటిజన్ల
వ్యాక్సిన్ పంపిణీ కేంద్రప్రభుత్వం ఆధీనంలోని అంశమే అయినప్పటికీ దానిని బీజేపీ ఒక రాష్ట్రానికే పంపిణీ చేస్తామని ఎలా ప్రకటిస్తుంది? ఉచిత వ్యాక్సిన్ దేశంలో అన్ని రాష్ర్టాలకు అందాలి.. కానీ బీహార్‌కే ఎలా పరిమితమవుతుంది? దేశంలో తయారుచేస్తున్న ఏ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాకుండానే పంపిణీపై ప్రకటన ఎలా చేస్తారు? అని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు మండిపడుతున్నారు. బీహార్ ఓటర్లకు వ్యాక్సిన్‌ను ఎర చూపుతున్నదని నేషనల్ మీడియా ఆరోపిస్తున్నది. ఒకవైపు వచ్చే ఏడాది జూన్ దాకా కరోనా విస్తృత వ్యాక్సినేషన్ సాధ్యం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తున్నది. సీసీఎంబీ సైతం వ్యాక్సిన్ వచ్చేందుకు రెండేండ్లు పడుతుందని స్పష్టంచేసింది. ఇలాంటి సమయంలో అందుబాటులోలేని వ్యాక్సిన్‌ను ఎరగా చూపుతూ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు చేస్తున్న బీజేపీ రాజకీయాలపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
‘ఆలు లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం’ అన్నట్టుంది బీజేపీ పరిస్థితి. కొవిడ్ వ్యాక్సిన్ పేరుతో ఆ పార్టీ చేస్తున్న నీచ రాజకీయాలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనాకు వ్యాక్సిన్‌ను కనిపెట్టేందుకు ప్రపంచ దేశాలన్నీ శ్రమిస్తున్నాయి. కానీ, ప్రయోగదశలను దాటుకొని ఇంకా ఏ టీకా కూడా పూర్తిస్థాయిలో విజయవంతం కాలేదు. బీజేపీ మాత్రం ఎన్నికల వేళ వ్యాక్సిన్ రాజకీయాలకు తెరలేపింది. తమను గెలిపిస్తే ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని చెప్తూ.. ఓటర్లను మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నది. కమలనాథుల జిమ్మిక్కులపై సోషల్ మీడియాతోపాటు, జాతీయ మీడియా దుమ్మెత్తి పోస్తున్నది.
తాజావార్తలు
- ఇది అత్యత్తమ పోలీస్ శిక్షణ కళాశాల
- శ్రీసుధకు సినిమాటోగ్రాఫర్ నుండి ప్రాణహాని!
- కాఫీతో యాంగ్జైటీ పెరుగుతుందా..?
- తమిళ ప్రజలపై మోదీకి గౌరవం లేదు: రాహుల్‌గాంధీ
- క్యాపిటల్ హిల్‌కు జెట్‌లో వెళ్లింది.. ఇప్పుడు లీగల్ ఫీజుల కోసం వేడుకుంటోంది !
- మరణించిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు
- నేతాజీ జీవితం అందరికీ స్ఫూర్తి
- ప్లాస్టిక్ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం
- మే 17 నుంచి పదో తరగతి పరీక్షలు
- ‘లైంగిక దాడి బాధితులకు కోర్టు బాసట’