సాత్విక్‌వర్మ, నేహా పఠాన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘బ్యాచ్’. శివ దర్శకుడు. రమేష్ ఘనమజ్జి నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు మాట్లాడుతూ ‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇది. క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటుపడిన కొందరు కుర్రాళ్ల జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయన్నది ఆసక్తికరంగా ఉంటుంది. బాహుబలి, రేసుగుర్రం, మళ్లీరావాతో పాటు పలు చిత్రాల్లో బాలనటుడిగా కనిపించిన సాత్విక్ వర్మను ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం చేస్తున్నాం. రఘు కుంచె బాణీలు ప్రధానాకర్షణగా నిలుస్తాయి’ అని అన్నారు. ‘జనవరిలో షూటింగ్ మొదలుపెట్టి 59 రోజుల్లో పూర్తిచేశాం. హైదరాబాద్, వైజాగ్, కాకినాడలో చిత్రీకరణ జరిపాం. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని నిర్మాత తెలిపారు. బాహుబలి ప్రభాకర్, మిర్చి మాధవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వెంకట్ మనం.