మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 14, 2020 , 16:14:33

కరోనాపై బీజేపీ అసత్య ప్రచారాలు మానుకోవాలి : మంత్రి ఎర్రబెల్లి

కరోనాపై బీజేపీ అసత్య ప్రచారాలు మానుకోవాలి : మంత్రి ఎర్రబెల్లి

వ‌రంగ‌ల్ : తెలంగాణ ప్ర‌భుత్వంపై బీజేపీ చేస్తున్న అస‌త్య ప్ర‌చారాలు, ఆరోప‌ణ‌లు మానుకోవాలని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు సూచించారు. క‌రోనాపై తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంగా ఉంద‌న‌డాన్ని ఆయ‌న ఖండించారు. ఆ ఆరోప‌ణ‌లు అసత్యమని, నిరాధార‌మ‌ని కొట్టిపారేశారు. వ‌రంగ‌ల్ ఉమ్మ‌డి జిల్లాలో రైతు వేదికలకు రాష్ట్ర గిరిజ‌న సంక్షేమం, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌తో క‌లిసి శంకుస్థాప‌న‌ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న జ‌న‌గామ జిల్లా కొడ‌కండ్ల‌లో మాట్లాడారు. క‌రోనాపై అంద‌రికంటే ముందే అప్ర‌మ‌త్త‌మైన ప్ర‌భుత్వం తెలంగాణ అన్నారు.

సీఎం కేసీఆర్‌ అంద‌రికంటే ముందుగానే, లాక్‌డౌన్‌ విధించారని, ఆ త‌ర్వాతనే బీజేపీ ప్ర‌భుత్వం స్పందించిన సంగ‌తి మ‌ర‌చిపోవ‌ద్ద‌న్నారు. క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌మంతా వ్యాపించిందని, దేశంలోనూ ఉందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో క‌రోనా లేదా? అక్క‌డ మీరెందుకు అదుపు చేయ‌లేక‌పోతున్నారని ప్ర‌శ్నించారు. క‌రోనా వైర‌స్‌కి మందు లేద‌ని, టీకాలు రాలేద‌ని బీజేపీకి, ఆరోప‌ణ‌లు చేస్తున్న ఆ పార్టీ నేత‌ల‌కు తెలియ‌దా? అని మంత్రి ప్రశ్నించారు. మొదట మీరెందుకు కరోనా వైరస్‌ను అదుపు చేయ‌లేక‌పోతున్నారో ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని మంత్రి డిమాండ్‌ చేశారు.

గ‌త ఐదేళ్లుగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఉపాధి హామీని వ్య‌వ‌సాయ రంగానికి అనుసంధానం చేయాల‌ని కోరుతున్నారు. మీరు ఏమాత్రం స్పందించ‌డం లేదు. కూలీల‌కు మ‌రింత ఉపాధి క‌ల్పించ‌డంతోపాటు, రైతాంగాన్ని ఆదుకోవ‌డానికి చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను మీరెందుకు నెర‌వేర్చ‌డం లేద‌ని మంత్రి ఎర్ర‌బెల్లి బీజేపీ నేత‌ల‌ను ప్ర‌శ్నించారు. విమ‌ర్శ‌లు మానుకుని రైతుల‌కు మేలు చేసే ఆలోచ‌న‌లు చేయాల‌ని హితవు పలికారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo