ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 21, 2020 , 20:26:37

‘బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తోంది’

‘బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తోంది’

హైదరాబాద్‌ : బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొట్టి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ఎన్నికల్లో కాషాయం పార్టీకి అభ్యర్థులు కరువయ్యారని, అందుకే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇస్తున్నారని చెప్పారు. మతాల మధ్య చిచ్చుపెట్టే బీజేపీ నాయకుల మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.  రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు సీఎం కేసీఆర్‌  నిరంతరం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ  పథకాలతో అన్నివర్గాలకు న్యాయం జరిగిందని, కుల వృత్తులకు జీవం పోసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో అరవై సంవత్సరాల్లో జరగని ప్రగతిని తెలంగాణ సర్కారు ఆరున్నరేండ్లలో చేసి చూపిందన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, గెలుపుకోసం బీజేపీ నైతిక విలువలు లేకుండా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. బీజేపీ మూలాలే మతతత్వమని.. అణగారిన, బడుగు బలహీన వర్గాల వ్యతిరేక బీజేపీని హైదరాబాద్‌ ప్రజలు ఆమోదించరని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన  గుజరాత్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో దళితలపై దాడులు పెరుగుతున్నాయని ఆక్షేపించారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.