బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 01, 2020 , 02:02:55

అబద్ధాలకు శోషల్‌

అబద్ధాలకు శోషల్‌

  • హద్దులు దాటిన బీజేపీ దుష్ప్రచారం 
  • కల్లబొల్లి మాటలు..పచ్చి కట్టుకథలు.. 
  • నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చింది ఎంత? 
  • తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నది ఎంత?
  • దుబ్బాక బస్టాండే వేదిక.. చర్చకు సిద్ధమా?

ఫిర్యాదులకు వెరవం... 

పితూరీలకు జడువం..

బెదిరిస్తే భయపడం..

తెలంగాణ ప్రజల కోసం, వారి ప్రయోజనాలకోసం తెగించి కొట్లాడటమే తప్ప నమస్తే తెలంగాణకు మరొకటి తెలియదు. రాష్ట్రం వచ్చింది కదా అని కాడిపారేసే సమస్యే ఉండదు. తెలంగాణ శత్రువుల అసలు రంగు బయటపెట్టి, తెలంగాణ ప్రజల ముందు బోనులో నిలబెట్టడం మా నిరంతర కార్యక్రమం. బీజేపీ స్పాన్సర్డ్‌ యాంటీ సోషల్‌ మీడియాలో వచ్చే రంగురంగుల అబద్ధాలను బ్లాక్‌ అండ్‌ వైట్‌లో కడిగి పారేయడం మా పరమ ధర్మం. రాజకీయాల కోసం కాదు.. తెలంగాణను కాపాడటం కోసమే ఈ అక్షర యుద్ధం. ఎన్నో కొన్ని ఓట్లు సాధించడానికి కమలనాథులు దుబ్బాకలో ఎన్ని అసత్యాలు గుమ్మరిస్తున్నారంటే.. వాటిని లెక్కకూడా పెట్టలేం. అబద్ధమే సిగ్గుపడి ఆత్మహత్య చేసుకునేలా.. బీజేపీ నేతలు బొంకుతున్నారు. ఝూటా బీజేపీ శోషల్‌ ప్రచారం గుట్టువిప్పే వాస్తవాల కథనాలు 7లో...

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మోసానికి బీజం చిన్నగనే ఉంటది. నయవంచకులెప్పుడూ నంగనాచి మాటలే మాట్లాడుతారు. ఎర ఎప్పుడూ ఆకర్షణీయంగానే ఉంటుంది. కానీ ఒక్కసారి దానికి చిక్కినామో... అంతే సంగతులు. దుబ్బాకలో ఓట్లకోసం బీజేపీ ఇలాంటి ఎరలే వేస్తున్నది. ఎన్ని అబద్ధాలు.. ఎన్ని మోసాలు.. నోరుతెరిస్తే ఒక్కటంటే ఒక్క నిజం మాట రాదు. అబద్ధానికి ఆకారమిస్తే, అది బీజేపీ నేతలా అవతరిస్తుందేమో! 

దశాబ్దాల పాటు తెలంగాణ రైతుల కరెంటు కష్టాలు చూసిన కేసీఆర్‌... ముఖ్యమంత్రి అయ్యాక వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వడం మొదలుపెడితే.. రాష్ట్ర బీజేపీ పెట్టిన సోషల్‌మీడియా పోస్టు ఏమంటుంది? ఉచిత కరెంటు ఇస్తున్నది నరేంద్ర మోదీ సర్కారు అయితే... దాని క్రెడిట్‌ టీఆర్‌ఎస్‌ తీసుకుంటున్నదట! నవ్వాల్నా? ఏడ్వాల్నా? అబద్ధం చెప్పినా అతికినట్టుండాలన్న కనీస ఆలోచన కూడా లేదు. ఓకే.. ఒక్క నిముషం పాటు మోదీయే ఇస్తున్నాడనుకుందాం! మరి 12 ఏండ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన తన సొంతరాష్ట్రం గుజరాత్‌లో వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఎందుకివ్వడం లేదు? కేవలం ఏడు గంటలే ఎందుకిస్తున్నారు? అందుకు ఛార్జీలు కూడా వసూలు చేస్తున్నారు కదా? గుజరాత్‌ను వదిలేద్దాం.. బీజేపీ పాలనలోనే ఉన్న ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక తదితర రాష్ర్టాల్లో వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఎందుకివ్వడం లేదు? మోదీకి ఒక్క తెలంగాణ రైతులపైనే ఎందుకంత ప్రేమో! ప్రేమా లేదు, దోమా లేదు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నది దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమే. కేసీఆర్‌ ప్రభుత్వం మాత్రమే. పంజాబ్‌లో విద్యుత్తును ఉచితంగా ఇస్తున్నప్పటికీ.. 24 గంటలు ఇవ్వటం లేదు. పంజాబ్‌లో ఉన్నదేమో కాంగ్రెస్‌ సర్కారు! ఉచిత కరెంటు సంగతి దేవుడెరుగు.. మోదీ సర్కారు ఉన్న కరెంటు ఉంచితే చాలు. ప్రతి రైతు బాయికాడ మీటర్‌ పెట్టడానికి.. ఉన్న సబ్సిడీలు ఎత్తివేసి.. చార్జీలు వసూలు చేయడానికి విద్యుత్తు చట్టాలు తెస్తున్నారు. ఇదొక్కటే కాదు; బీడీ కార్మికుల పెన్షన్లు కూడా కేంద్రమే ఇస్తున్నదని ఇస్తున్నామని బీజేపీ.. సోషల్‌మీడియాలో చాటింపు వేసుకుంటున్నది. బీజేపీ పాలిస్తున్న గుజరాత్‌లో బీడీ కార్మికులున్నారు. మధ్య ప్రదేశ్‌లో ఉన్నారు. మరి అక్కడ ఎందుకు ఇవ్వడం లేదు? మోదీ ప్రభుత్వానికి గుజరాత్‌పై లేని ప్రేమ, తెలంగాణ తెలంగాణ బీడీ కార్మికులపై మాత్రమే ఉందా? అలాగంటే నమ్మాలా? నిజం ఏమిటంటే.. దేశం మొత్తంలో బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్‌ ప్రభుత్వం. ఇత్తేయకుండానే పొత్తుగూడడం బీజేపీ లక్షణం. ఎవరో చేసినదాన్ని తన ఖాతాలో వేసుకోవడం వారికి వెన్నతో పెట్టిన విద్య. కల్యాణలక్ష్మి, రైతుబంధు, డబుల్‌బెడ్‌రూం ఇండ్లు.. చివరికి ముఖ్యమంత్రి జీతంతో సహా అన్నీ తామే ఇస్తున్నామని బీరాలు పలుకుతారు. కేసీఆర్‌ చేస్తున్న ప్రతి పనీ తమదేనని సోషల్‌ మీడియాలో ఊదరగొడుతుంటారు. నోటికేదొస్తే అది మాట్లాడటమే. సోషల్‌మీడియాలో పెట్టేయడమే. కేసీఆర్‌ ఒక సందర్భంలో.. హరీశ్‌ మరో సందర్భంలో మాట్లాడిన మాటల్ని ఒకచోట పెట్టి బావ- మరుదుల సవాల్‌ అంటారు. అప్పుడెప్పుడో అచ్చంపేటలో బీజేపీ వాళ్లే కూలగొట్టిన టీఆర్‌ఎస్‌ గద్దెను చూపించి, టీఆర్‌ఎస్‌ శ్రేణులు గద్దెలు కూల్చేస్తున్నాయని విష ప్రచారం చేస్తారు. తనమానాన తాను ప్రశాంతంగా ప్రచారం చేసుకుంటున్న హరీశ్‌రావు రోడ్‌షోలోకి సంఘవిద్రోహ శక్తుల్ని జొప్పించి, అల్లరి చేయించి, టీఆర్‌ఎస్‌లో ముసలం అంటారు. ఒకటా రెండా.. ఎంత విషప్రచారం. అబద్ధాన్ని పదిసార్లు చెప్పి నమ్మించవచ్చన్నది వారి ఎత్తుగడ. కానీ ఉద్యమ చైతన్యంతో రగిలిపోయే దుబ్బాక ప్రజలు అంత అమాయకులు కారు. 

చివరిరోజైనా చర్చకు సిద్ధమా?.

సరే.. ఏది ఎవరు చేస్తున్నారో తేలుద్దాం.. చర్చకు వస్తారా? అంటే గోడ చాటుకు పోయి మొహం చాటేస్తారు. దుబ్బాక ఎన్నికకు ప్రచారం ఆదివారం సాయంత్రంతో ప్రచారం ముగుస్తుంది. ఇప్పటికైనా దుబ్బాక బస్టాండు దగ్గర బహిరంగ చర్చకు రండి. చేతనైతే మీ సోషల్‌ మీడియా ప్రచారం నిజమని నిరూపించుకోండి. పెన్షన్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నదని నిరూపిస్తే, ఒక్క నిముషంలో రాజీనామా చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా సవాలు విసిరారు. ఇంతకుమించి అవకాశం ఏముంటుంది? చర్చకు రండి. లేదంటే తప్పు చేస్తున్నామని ముక్కు నేలకు రాయండి. అయినా మంత్రి హరీశ్‌రావు విసిరిన సవాల్‌కే జవాబులేక పారిపోయిన బీజేపీ నేతలు ముఖ్యమంత్రి సవాలుకు ఏం స్పందిస్తారు? అంత ధైర్యం ఎక్కడుంది? ఇలాంటి నయవంచక నాయకులను సహించవచ్చునా? వారిని ఆదరించి ఓట్లు వేయవచ్చునా? ముక్కు నేలకు రాయడం కంటే ఎక్కువ శిక్ష విధించడమే దీనికి సరైన మందు. ఆ పని దుబ్బాక ప్రజలే చేస్తారు. 

సోషల్‌ మీడియానే ఎందుకు? 

ఏ ఎన్నికలు వచ్చినా బీజేపీ సోషల్‌మీడియాతో దుష్ప్రచారాన్నే ప్రధాన సాధనంగా ఎంచుకుంటుంది. ఎందుకంటే ఇందులో కుటిల తంత్రం దాగి ఉంది. క్షేత్రస్థాయిలో ప్రజల ముందుకు వెళ్లాలంటే నిజాలు మాట్లాడాల్సి ఉంటుంది. అభివృద్ధి ఫలాలు అందుకుంటున్న ప్రజలు వారి మాటలు ఎందుకు వింటారు? కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి నిన్న దుబ్బాకలో ఏం మర్యాద జరిగిందో మనం చూడలేదా? సోషల్‌ మీడియా అయితే... దిక్కూ దివాణం ఉండదు. నీతి రీతి ఉండదు. అదుపు ఆజ్ఞ ఉండదు. ఎవడిష్టమున్నది వాడు పెట్టవచ్చు. ఎవరు రాశారో తెలియదు. ఎవరు రాయించారో అంతకంటే తెలియదు. విశ్వసనీయత ఉండదు. పొరపాటున పోస్టు క్లిక్‌ అయి లబ్ధి చేకూరినట్టయితే.. పార్టీ సొంతం చేసుకుంటుంది. అదిగో మావాడు చెప్పింది నిజమని బాకా పట్టుకుంటుంది. తిరగబెడితే.. అసలు దానితో మాకు సంబంధమే లేదంటుంది. నరంలేని నాలుకలకు జవాబుదారీతనం ఎందుకుంటుంది? విశ్వసనీయత లేని నీచరాజకీయానికి పరాకాష్ట బీజేపీ సోషల్‌ మీడియాది.. నిలకడ మీద తేలే నిజంకన్నా.. అరక్షణంలో ఆమడ దూరం ప్రయాణించే అబద్ధాన్నే నమ్ముకున్నది బీజేపీ. అబద్ధాలకోర్లకు ఏం సత్కారం జరుగుతుందో దుబ్బాకలో బీజేపీకి అదే జరుగుతుంది!