గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 03, 2020 , 02:16:14

దళిత ఎమ్మెల్యేపై బీజేపీ దౌర్జన్యం

దళిత ఎమ్మెల్యేపై బీజేపీ దౌర్జన్యం

  • అందోల్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌పై దాడి
  • పక్కటెముక, చేతిపై బలమైన గాయం
  • మాజీ ఎమ్మెల్యే వీరేశంపైనా దుర్మార్గం
  • టీఆర్‌ఎస్‌ కార్యకర్తకు తీవ్రగాయం
  • స్థానిక దవాఖానకు తరలింపు
  • ఉద్దేశపూర్వకంగానే మాపై దాడిచేశారు
  • పోలీసులకు ఎమ్మెల్యే క్రాంతి ఫిర్యాదు 
  • అదుపులో పలువురు బీజేపీ కార్యకర్తలు
  • బీజేపీ దిగజారుడుకు ఈ ఘటన నిదర్శనం : మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట, నమస్తే తెలంగాణ: ఊహించినట్టే కమలనాథుల కొంచెపు బుద్ధి బయటపడింది. దుబ్బాకలో ఓటమి తప్పదన్న నిస్పృహలో ఉన్న బీజేపీ నేతలు సిద్దిపేటలో వీరంగం సృష్టించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించడమే లక్ష్యంగా తప్పతాగివచ్చి వీధిరౌడీల్లా విచ్చలవిడిగా ప్రవర్తించారు. బీజేపీ నేతలు హైదరాబాద్‌లో అల్లరకు, అరాచకానికి పాల్పడే అవకాశమున్నదని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదివారమే ఆందోళన వ్యక్తంచేశారు. కానీ ఆఖరునిమిషంలో బీజేపీ నేతలు రూటు మార్చారు. దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్‌కు కొద్దిగంటల సమయముండగా సిద్దిపేటలో టీఆర్‌ఎస్‌ దళిత ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌పై బీజేపీ కార్యకర్తలు ఒక్కుమ్మడి దాడికి తెగబడ్డారు. ఆయన వెంటే ఉన్న మరో దళితనేత, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంపైనా విరుచుకుపడ్డారు. అడ్డువచ్చిన పార్టీ కార్యకర్తలపై విచక్షణలేకుండా దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. బీజేపీ నేతల హేయమైన చర్య సర్వత్రా విమర్శలకు దారితీసింది. బీజేపీ దిగజారుడుతనాన్ని ఆర్థికమంత్రి హరీశ్‌రావు సహా పలువురు తీవ్రంగా ఖండించారు.


మద్యం మత్తులో దాడి

అది సిద్దిపేట.. స్వర్ణప్యాలెస్‌ హోటల్‌.. సోమవారం రాత్రి సుమారు 8 గంటల ప్రాంతం.. దుబ్బాక ఎన్నికల ప్రచారం ముగిసిపోయింది. తెల్లవారితే మూడు వందలకు పైగా పోలింగ్‌ స్టేషన్లలో ఓటింగ్‌ సరళిని పర్యవేక్షించాల్సి ఉన్నది. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కొద్దిరోజులుగా అందోల్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఈ హోటల్‌లోనే ఉంటున్నారు. ముగ్గురు నేతలు హోటల్‌ గదిలో ఫ్రెషప్‌ అయి విశ్రాంతి తీసుకుంటుండగా పోలీసులు వచ్చి తలుపుతట్టారు. గదులను సోదా చేయాలని అనడంతో.. చేసుకోవాలని సహకరించారు. పోలీసులు ఎంపీ, ఎమ్మెల్యే ఉన్న గదులను క్షుణ్ణంగా పరిశీలించి వెళ్లిపోయారు. అప్పటికే రాత్రి కావడంతో ఎంపీ, ఎమ్మెల్యే వారి గన్‌మెన్‌లను భోజనానికి పంపించారు. 

అనంతరం మాజీ ఎమ్మెల్యే వీరేశంతో కలిసి భోజనానికి ఉపక్రమించారు. అప్పటికే అక్కడ మాటువేసి ఉన్న వీ 6 చానల్‌ ప్రతినిధులు బీజేపీ నాయకులను రప్పించారు. 30 మందికి పైగా బీజేపీ నేతలు ఒక్కసారిగా హోటల్‌కు వచ్చారు. వారిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌ కూడా ఉన్నారు. అప్పటికే అంతా మద్యం మత్తులో ఉన్నారు. ముందుగా ఎమ్మెల్యే క్రాంతి ఉన్న గది తలుపు తట్టారు. ఎమ్మెల్యే బయటకు వచ్చి.. మీరెవరు.. ఏం కావాలి అని అడిగారు. బీజేపీ కార్యకర్తలు సరైన సమాధానం ఇవ్వలేదు. ఎమ్మెల్యే లోపలికి వెళ్లిపోయారు. వెంటనే వాళ్లు ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం గది తలుపు ముందు సోషల్‌ మీడియా లైవ్‌ స్ట్రీమింగ్‌ ఆన్‌చేసి.. డబ్బులు పంచుతున్నారంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మొదలుపెట్టారు. మాట్లాడుతూనే.. ఒక్కసారిగా గదిలోకి వెళ్లి ఎమ్మెల్యే క్రాంతితో ఘర్షణకు దిగారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. 

ఈ దాడిలో క్రాంతికిరణ్‌తోపాటు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు గాయపడ్డారు. క్రాంతికిరణ్‌కు పక్కటెముకలు, చేయిభాగంలో బలమైన గాయాలయ్యాయి. సైదులు అనే కార్యకర్త తీవ్రంగా గాయపడటంతో అతణ్ణి దవాఖానకు తరలించారు. విషయం తెలుసుకున్న సిద్దిపేట ఏసీపీ విశ్వప్రసాద్‌ పోలీసు బలగాలతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. అప్పటికే బీజేపీ మూకలు అక్కడి నుంచి పారిపోయాయి. ఏసీపీ విశ్వప్రసాద్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ వాంగ్మూలాన్ని తీసుకున్నారు. తను గదిలో ఉండగానే తనపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పత్రి శ్రీనివాస్‌, బీఎంఎస్‌ నాయకులు కలాల్‌ శ్రీనివాస్‌తోపాటు మరో 30 మంది బీజేపీ కార్యకర్తలు దాడిచేశారని ఎమ్మెల్యే వెల్లడించారు. అనంతరం ఏసీపీ విశ్వప్రసాద్‌ మాట్లాడుతూ.. పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైనచర్యలు తీసుకొంటామనిచెప్పారు. క్రాంతికిరణ్‌ గది దగ్గర బీజేపీ కార్యకర్తల కేకలు వినపడగానే మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి బయటకు వచ్చారు. బీజేపీ నాయకుల తీరును తీవ్రంగా ఖండించారు. 


దాడి హేయం ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు 

టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజల నుంచి వస్తున్న అపూర్వ ఆదరణ చూసి, ఓర్వలేక అసహనానికి గురై బీజేపీ నాయకులు పనిగట్టుకొని నియోజకవర్గం అవతల ప్రాంతంలో ఉన్న ఒక దళిత ఎమ్మెల్యే, దళిత మాజీ ఎమ్మెల్యేపై భౌతిక దాడులకు దిగడం శోచనీయమని ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు. ‘ఇది హేయమైన చర్య.. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న. ఉద్దేశ పూర్వకంగా, పథకం ప్రకారం కావాలని, వాళ్లు ఉంటున్న లాడ్జికి వెళ్లి వారిపై భౌతికదాడులకు పాల్పడటం బీజేపీ దిగజారుడుతనానికి నిదర్శనం. బీజేపీ నేతలు నిన్నమొన్న కొన్ని దుర్మార్గ ప్రణాళికలు రచించారు. ఇప్పుడు వాటిని అమలుచేస్తున్నారు. అందులో భాగమే సిద్దిపేటలో జరిగిన ఈ కుట్ర.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. 

అంతకుముందు 15 నిమిషాల ముందే పోలీసు వాళ్లు వచ్చి తనిఖీ చేసుకొని వెళ్లారు. వాళ్ల తనిఖీల సందర్భంగా ఎలాంటి ప్రచార సామగ్రి లభించలేదు.ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ సిద్దిపేటలో ఉన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నిక జరుగుతున్న నియోజకవర్గం బయట ఉండవచ్చు.. మా నాయకులు సిద్దిపేటలో ఉన్నారు. మా ఎమ్మెల్యే ఉన్న హోటల్‌ రూమ్‌కు బీజేపీ గుండాలు వచ్చి తనిఖీల పేరుతో ఇబ్బంది పెట్టడం దారుణం.మాజీ ఎంపీ, దుబ్బాక నియోజకవర్గ బీజేపీ ఇంచార్జి జితేందర్‌రెడ్డి రామాయంపేటలోని రెడ్డి కాలనీలో ఉన్న పురుషోత్తంరెడ్డిగారి ఇంట్లో ఉన్నారు. ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటివరకు వాళ్లు అక్కడే ఉన్నారు. వాళ్లకు వర్తించని రూలు మాకు వర్తిస్తుందా..? టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంయమనం పాటించాలి. మనను రెచ్చగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎన్ని జిమ్మిక్కులు చేసినా దుబ్బాకలో ఎగిరేది టీఆర్‌ఎస్‌ జెండానే..

పక్కా ప్రణాళికతోనే వచ్చారు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ 

బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి నేతృత్వంలోనే తనపై దాడి చేశారని అందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ ఆరోపించారు. ‘నా గది దగ్గరకు చాలామంది వచ్చారు. మీరెవరు అంటే మౌనంగా ఉన్నారు. డోర్‌దగ్గర ఉన్నారు.. మీకేం కావాలి, ఏం చూస్తున్నారు అని అడిగితే వారి నుంచి జవాబు రాలేదు. మేం చూడటానికి వచ్చామన్నారు. నా గదిలో ఉన్నదేమిటో చూడండి. మొత్తం చూసుకోండి అని చెప్పాం. యాంటీ సోషల్‌ మీడియా, ఫేస్‌బుక్‌ లైవ్‌, సెల్‌ ఫోన్‌లు ఆన్‌ చేసుకొని దాడిచేసేలా ప్లాన్‌ చేసుకొని వచ్చారు. రూమ్‌లోకి వచ్చి చెక్‌ చేసుకోండి అంటే రారు..బయట ఉండి గొడవ చేయాలనే పక్కా ప్లాన్‌తో వచ్చారు. అంతకుముందు పోలీసులు వచ్చి గదులను చెక్‌ చేస్తామంటే సహకరించాం. మా ఎంపీ ఇక్కడే ఉన్నారు. వారూ సహకరించారు. ఇక్కడ డబ్బులు పంచుతున్నారంటూ వీ6 చానల్‌, వెలుగు రిపోర్టర్‌  బీజేపీ నేతలను పిలిపించారు. తర్వాత బీజేపీ నాయకులు మద్యం మత్తులో ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో నాతోపాటు కార్యకర్తకు గాయాలు అయ్యాయి. వాళ్లు ఒక ఎజెండాతో వచ్చారు. ఎలాగో ఓడిపోతామనే భయంతోనే ఇలాంటి పనులకు దిగుతున్నారు. డిపాజిట్‌ దక్కే పరిస్థ్థితి లేదు. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదుచేస్తాం. బీజేపీ నేతలపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతాం’ అని క్రాంతి చెప్పారు. 

మిగతా ప్రాంతాల్లో ఉండవచ్చు సిద్దిపేట ఏసీపీ విశ్వప్రసాద్‌ 

కేంద్ర ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వివిధ పార్టీలకు చెందిన వారంతా ఈ నెల 1 సాయంత్రం 6 గంటల తర్వాత దుబ్బాక నియోజకవర్గంలో ఉండడానికి వీలులేదని, మిగతా ప్రాంతాల్లో ఉండవచ్చని సిద్దిపేట ఏసీపీ విశ్వప్రసాద్‌ చెప్పారు.

క్రాంతిపై దాడి అప్రజాస్వామికం: టీయూడబ్ల్యూజే

ఒక జర్నలిస్టుగా మంచి గుర్తింపు పొంది.. ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన క్రాంతికిరణ్‌పై బీజేపీ కార్యకర్తల దాడి అప్రజాస్వామికమని టీయూడబ్ల్యూజే నాయకులు సోమవారం పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీసాగర్‌, టీఈఎంజేయూ అధ్యక్షుడు సయ్యద్‌ ఇస్మాయిల్‌, ప్రధాన కార్యదర్శి ఏ రమణకుమార్‌, చిన్న పత్రికల సంఘం అధ్యక్షుడు యూసుఫ్‌బాబు, యోగానంద్‌, నవీన్‌కుమార్‌,  టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే విరాహత్‌ అలీ డిమాండ్‌చేశారు.

మాజీ ఎంపీ, దుబ్బాక నియోజకవర్గ బీజేపీ ఇంచార్జి జితేందర్‌రెడ్డి రామాయంపేటలోని రెడ్డి కాలనీలో ఉన్న పురుషోత్తంరెడ్డిగారి ఇంట్లో ఉన్నా రు. ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటివరకు వాళ్లు అక్కడే ఉన్నారు. వాళ్లకు వర్తించని రూలు మాకు వర్తిస్తుందా..?

- మంత్రి హరీశ్‌రావు