మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 22, 2020 , 01:08:43

బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకొని ఓట్లడుగుతారు: వంగపల్లి

బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకొని ఓట్లడుగుతారు: వంగపల్లి

ఖైరతాబాద్‌: కేంద్రంలో అధికారంలోకి వస్తే వందరోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామన్న ప్రధాని మోదీ, నాటి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఇచ్చిన హామీ ఏమైందని ఎమ్మార్పీఎస్‌ టీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మేడి పాపన్న, రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ ప్రశ్నించారు. కోట్ల మంది సాక్షిగా చేసిన ప్రకటనకు ఆరేండ్లుగా ఉలుకుపలుకూ లేకుండా పోయిందని మండిపడ్డారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆ ఊసే ఎత్తడం లేదని ఆరోపించారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వారు మీడియాతో మాట్లాడు తూ.. ఎస్సీ వర్గీకరణపై కేంద్రం వైఖరిని ఎండగట్టారు. సీఎం కే చంద్రశేఖర్‌రావుతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమని, జీహెచ్‌ఎంసీలో ఎస్సీలందరూ టీఆర్‌ఎస్‌కే ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. రెండుదశాబ్దాలకుపైగా కొనసాగుతున్న వర్గీకరణ ఉద్యమం, మాదిగల స్థితిగతులు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయు డు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి తెలుసునని కానీ, వారికి ఎన్నికలప్పుడే ఎస్సీల వర్గీకరణ, దళితుల సంక్షేమం గుర్తుకొస్తాయని మండిపడ్డారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని బీజేపీ నేతలు మాదిగల ఓట్లడుగుతారని, జైశ్రీరాం అంటే మా కడుపులు నిండుతాయా అని ప్రశ్నించారు. బీజేపీ వల్ల హిందువులకు ఒరిగిందేమీ లేదని పేర్కొన్నారు. డబ్భుఏండ్లలో సాధ్యం కాని తెలంగాణ అభివృద్ధిని సీఎం కేసీఆర్‌ ఆరేండ్లలో చేసి చూపించారని చెప్పారు. దళితుల ప్రయోజనాలు, సంక్షేమానికి అనేక రకాలుగా పాటుపడ్డారని తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్‌, వర్గీకరణ కోసం నిబద్ధతతో పనిచేసే ఏకైక పార్టీ టీఆర్‌ఎస్‌ అని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే వర్గీకరణ కోసం ఏకగ్రీవ తీర్మాన చేయించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ప్రధాని మోదీని కలిసి వర్గీకరణ అంశంపై మాట్లాడిన మొదటి సీఎం కేసీఆర్‌ అని చెప్పారు. వెనుకబడినవర్గాల కోసం 238 గురుకుల పాఠశాలల ఏర్పాటు చేసిన ఘనత కూడా కేసీఆర్‌దేనని తెలిపారు. హైదరాబాద్‌లో అనేక మురికివాడలున్నాయని.. వారందరికీ డబుల్‌ బెడ్రూం ఇండ్లు రావాలంటే ప్రతి దళితుడు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేయాలని విజ్ఞప్తిచేశారు. సమావేశంలో రాష్ట్ర సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బంగారు శ్రీను, అధికార ప్రతినిధి నాగారం బాపు, కృష్ణ, నందకిశోర్‌, కోహీర్‌, లాజర్‌, ఎల్లన్న తదితరులు పాల్గొన్నారు.