బుధవారం 20 జనవరి 2021
Telangana - Nov 30, 2020 , 01:46:59

దాడులకు దిగిన బీజేపీ నేతలు

దాడులకు దిగిన బీజేపీ నేతలు

  • పలుచోట్ల టీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై దాడి 
  • వెంగళరావునగర్‌లో మహిళా అభ్యర్థిపై దుష్ప్రచారం
  • చివరి సమయంలో అలజడికి పన్నాగం
  • కాలనీల్లో డబ్బు పంపిణీ.. అపార్ట్‌మెంట్లలో విందుసమావేశాలు
  • ముస్లింలను ఓటెయ్యొద్దంటూ.. బీజేపీ నేతల డబ్బుల పంపిణీ: మంత్రి హరీశ్‌రావు
  • కార్యకర్తలు సంయమనం పాటించాలని టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం పిలుపు

హైదరాబాద్‌ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటమి తప్పదని ముందే గ్రహించిన బీజేపీ నేతలు పలుచోట్ల టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ శ్రేణులతో ఘర్షణలకు దిగారు. ప్రచార సమయం ముగిసీ ముగియంగానే.. నగరంలోని దాదాపు ఏడెనిమిది చోట్ల తమకు అలవాటైన పాత పద్ధతుల్లో స్ట్రీట్‌ఫైట్లకు తెరతీశారు. ఒకవైపు తమ శ్రేణులతో కాలనీల్లో, బస్తీల్లో డబ్బుల పంపిణీ ప్రారంభించారు. మరోవైపు హైదరాబాద్‌లోని పలు అపార్ట్‌మెంట్లలో విందు సమావేశాలను ఏర్పాటుచేసి ప్రలోభాలకు పాల్పడుతున్నారు. పైగా అందరి దృష్టిని మళ్లించడానికి టీఆర్‌ఎస్‌ శ్రేణులు డబ్బులు పంచుతున్నారంటూ లొల్లి మొదలుపెట్టారు. 

కళ తప్పిన కాషాయం

గ్రేటర్‌ ప్రచారం ముగియడంతోనే కమలం కళ తప్పింది. బ్యాలెట్‌ భవితవ్యం తేలకముందే ఓటరు నాడిని గుర్తించిన బీజేపీ నేతలు అలజడి సృష్టించేందుకు శ్రేణులను రంగంలోకి దింపారు. అధికార టీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై దాడులకు ఉసిగొల్పుతున్నారు. చివరకు సామాజిక మాధ్యమాల్లో మహిళలపై చెడు ప్రచారాన్ని చేశారు. వెంగళరావునగర్‌, మహేశ్వరం, కుత్బుల్లాపూర్‌, జూబ్లీహిల్స్‌ నియోజకవర్గాల్లోని పలు డివిజన్లలో బీజేపీ కార్యకర్తలు దౌర్జన్యకాండ సాగించారు. కొన్నిచోట్ల టీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై దాడిచేసి, గాయపరిచి ఉద్రిక్తత సృష్టించడానికి యత్నించారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంయమనం పాటించాలని పార్టీ అధిష్ఠానం పిలుపునిచ్చింది. బీజేపీ శ్రేణులు ఎంత రెచ్చగొట్టినా సంయమనం కోల్పోవద్దని కోరింది. 

అనుమానించిందే జరుగుతున్నది

అందరూ అనుమానించిందే జరుగుతుంది. ఒకవైపు అధికార టీఆర్‌ఎస్‌ అభివృద్ధి మంత్రాన్ని పఠిస్తుంటే.. బీజేపీ అరాచకాన్ని ప్రోత్సహిస్తూనే ఉన్నది. వారంరోజులుగా జరిగిన గ్రేటర్‌ ప్రచారంలో జనం నుంచి సరైన స్పందన లేకపోవడంతో కాషాయ శ్రేణులు  నైరాశ్యంలోకి వెళ్లాయి. పరోక్షంగా ప్రధాని మొదలు.. ప్రత్యక్షంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌, పలువురు ఢిల్లీ, ఇతర రాష్ర్టాల నేతల్ని ప్రచారంకోసం గ్రేటర్‌లో తిప్పారు. కానీ బీజేపీ నేతలు ఆశించినస్థాయిలో ప్రజల నుంచి స్పందన రాలేదు. దీంతో ప్రచారం ముగిసిన ఆదివారం సాయంత్రం నుంచే బీజేపీ నేతలు ఫ్రస్టేషన్‌లోకి పోయారు. మరోవైపు అసాంఘిక శక్తులు అవాంఛనీయ సంఘటనలకు దిగే అవకాశమున్నదనే ముందస్తు సమాచారంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తం కావడంతో బీజేపీ నాయకులు చేసేదిలేక సొంత పార్టీ క్యాడర్‌ను రంగంలోకి దింపినట్టు ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు నగరంలో జరిగిన పలు సంఘటనలు రుజువుచేస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ కార్యకర్తల్ని చూడగానే బీజేపీ శ్రేణులు అక్కసు వెళ్లగక్కుతున్నాయి. సరూర్‌నగర్‌ డివిజన్‌లోని అంబేద్కర్‌నగర్‌కాలనీలో బీజేపీ అభ్యర్థి భర్త డబ్బులు పంచేందుకు సిద్ధమవుతున్న తరుణంలో సమాచారం అందుకొన్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు వెళ్లి అడ్డుకొన్నారు. బీజేపీ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ వారిపై దాడికి దిగారు. పోలీసులు రావడంతో బీజేపీ శ్రేణులు వెనక్కి తగ్గాయి. మైలారుదేవ్‌పల్లి, ఆర్కే పురం, గుడి మల్కాపూర్‌, యూసుఫ్‌గూడ, సోమాజిగూడ డివిజన్‌లోని మక్తా తదితర ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌ శ్రేణులపై బీజేపీ కార్యకర్తలు పెద్దఎత్తున దాడి చేశారు. జూబ్లీహిల్స్‌లోని రహ్మత్‌నగర్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై దాడి చేసిన ఘటనలో పలువురు గాయపడ్డారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నేతలు మాత్రం ఎక్కడా సంయమనం కోల్పోవద్దని పార్టీ అధినాయకులు పిలుపునిచ్చారు. బీజేపీ కార్యకర్తలు రెచ్చగొట్టినా ఏమాత్రం సంయమనం కోల్పోవద్దని, పోలీసులు, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. 

ఓట్ల కోసం ఇంత నీచమా?

సాధారణంగా గతంలో టిక్‌టాక్‌లో పాటలకు అనుగుణంగా చాలామంది వీడియోలు పోస్టు చేసుకొన్నారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోని వెంగళరావునగర్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ మహిళా అభ్యర్థి దేదీప్యారావు కూడా ఐదారేండ్ల కిందట టిక్‌టాక్‌ వీడియోలు పోస్టుచేశారు. ఇప్పుడు ఆ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి కిలారి మనోహర్‌ ఆ టిక్‌టాక్‌ వీడియోలతో వేరే ఫొటోలను మార్ఫింగ్‌ చేసి.. సామాజిక మాద్యమాల్లో ప్రచారం చేస్తున్నారు.  దేదీప్యారావు ఆదివారం రాత్రి ఎస్సార్‌నగర్‌ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదుచేసి, తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని, రాష్ట్ర ఎన్నికలసంఘానికి సమాచారమిచ్చి బీజేపీ అభ్యర్థిపై అనర్హతవేటు వేయాలని డిమాండ్‌చేశారు. తనను కావాలనే అపఖ్యాతి పాలుచేయడానికి ప్రస్తుత బీజేపీ అభ్యర్ధి కిలారీ మనోహర్‌, అతని అనుచరులు వెంకట్‌ యాదవ్‌, సత్యం, భాను, రాకీ ఆ వీడియోలను వైరల్‌ చేస్తున్నారని ఆరోపిస్తూ ఆదివారం రాత్రి ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీసీఎస్‌లో కూడా ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు.

సరూర్‌నగర్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా.. 

ఆర్కేపురం: సరూర్‌నగర్‌ డివిజన్‌లో బీజేపీ నాయకులు ఓటర్లకు డబ్బులు పంచుతుండగా అడ్డంగా దొరికారు. సరూర్‌నగర్‌ డివిజన్‌ బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఆకుల శ్రీవాణి భర్త అంజన్‌ బీజేపీ నేతలతో కలిసి సరూర్‌నగర్‌ డివిజన్‌ అంబేద్కర్‌నగర్‌లో ఎలక్షన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఓట్లరు డబ్బులు పంచుతున్న విషయం తెలుసుకున్న సరూర్‌నగర్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ నాయకులు అక్కడకు చేరుకొని బీజేపీ నేతలను అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. బీజేపీ నాయకులు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై దాడిచేసేందుకు యత్నించారు. విషయం తెలుసుకొన్న సరూర్‌నగర్‌ పోలీసులు అక్కడకు చేరుకొనేలోపు బీజేపీ నాయకులు అక్కడ నుంచి ఉడాయించారు. ఆకుల శ్రీవాణి భర్త అంబేద్కనగర్‌లో డబ్బులు పంచుతున్నారని మహేశ్వరం టీఆర్‌ఎస్‌ యూత్‌వింగ్‌ అధ్యక్షుడు లోకసాని కొండల్‌రెడ్డి మండిపడ్డారు.

బొట్టు పెట్టేందుకు వెళ్లిన మహిళలపై బీజేపీ కార్యకర్తల దాడి

ఖైరతాబాద్‌: కార్తీకమాసం సందర్భంగా బంధువుల ఇంటికి బొట్టు పెట్టే కార్యక్రమానికి వెళ్లిన టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ అభ్యర్థ్ధితోపాటు తోటి మహిళలపై బీజేపీ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించి, దాడికి యత్నించారు. సోమాజిగూడ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ అభ్యర్ధి వనం సంగీత యాదవ్‌ ఎన్నికల ప్రచారం ముగియడంతో ఆదివారం రాత్రి ఎల్లారెడ్డిగూడలోని తన బంధువుల ఇంటికి కార్తీకమాసాన్ని పురస్కరించుకొని సంప్రదాయ బొట్టు పెట్టే కార్యక్రమానికి వెళ్లారు. అక్కడే తిష్ట వేసుకొని కూర్చున బీజేపీ కార్యకర్తలు డబ్బులు పంచేందుకు వచ్చారా అంటూ ప్రశ్నిస్తూ దురుసుగా ప్రవర్తించారు. దుర్భాషలాడుతూ దాడికి యత్నించారు. స్థానికులు జోక్యంచేసుకోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

జూబ్లీహిల్స్‌లో విష్ణువర్ధన్‌రెడ్డి దౌర్జన్యం

బంజారాహిల్స్‌: జూబ్లీహిల్స్‌ పీఎస్‌ పరిధిలోని రహమత్‌నగర్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి సీఎన్‌ రెడ్డికి మద్దతుగా చివరిరోజు ప్రచారం చేస్తున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై కాంగ్రెస్‌ అభ్యర్థి భవానీశంకర్‌ అనుచరులైన జాఫర్‌, లియాఖత్‌ అలీ, అరుణ్‌ దాడికి పాల్పడ్డారు. డబ్బులు పంచేందుకు వచ్చారా అంటూ కర్రలతో దాడి చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకొన్నది. కాంగ్రెస్‌ కార్యకర్తలతో అక్కడికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి, కార్పొరేటర్‌ అభ్యర్థి భవానీశంకర్‌ కూడా దుర్భాషలాడుతూ అంతు చూస్తామంటూ బెదిరించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మల్యాల మార్కెట్‌ చైర్మన్‌ జనగాం శ్రీనివాస్‌ను దవాఖానకు తరలించారు. సమాచారం అందుకొన్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నంచేశారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఫిర్యాదుచేశారు. ఘటన సమాచారం తెలుసుకొన్న నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌, డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ జూబ్లీహిల్స్‌ పీఎస్‌ చేరుకొని వివరాలు తెలుసుకొన్నారు. 

కమలనాథుల  ప్రలోభాలు

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో బీజేపీ నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. డబ్బులిస్తాం.. ఓట్లు వేయడానికి రావొద్దని ముస్లింలకు బీజేపీ నేతలు చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లింలు బీజేపీ నేతల ప్రలోభాల బారిన పడొద్దు. ప్రతి ముస్లిం టీఆర్‌ఎస్‌కు ఓటు వేసి బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలి. సీట్లు గెలువాలనే దుగ్ధతో బీజేపీ నాయకులు ఓటర్ల కాళ్లు మొక్కుతున్నారు. రేపు కాళ్లు లాగుతారు. ఈ విషయంలో ఓటర్లు జాగ్రత్తగా ఉండాలి. నగరంలో శాంతిభద్రతలు దెబ్బతీసి ఇక్కడికి వచ్చే పెట్టుబడులు గుజరాత్‌, ముంబైకి తరలించుకుపోవాలని బీజేపీ నేతలు చూస్తున్నారు. ఓటు ద్వారా బీజేపీకి గుణపాఠం చెప్పాలి. 

- ఎన్నికల ప్రచార సభలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు 

రోడ్లమీదకు రమ్మంటారా?

పోలీసులకు బండి బెదిరింపులు

శాంతిభద్రతల సమస్యలు వస్తాయని హెచ్చరిక 

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నదని గుర్తుంచుకోవాలని హెచ్చరిక 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని అర్థం కావడంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లో అసహనం పెరిగిపోయింది. ఏకంగా పోలీసులపైనే బెదిరింపులకు దిగారు. ఆదివారం ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడిన ఆయన శాంతి భద్రతల సమస్యను కొని తెచ్చుకోవద్దని, మీ ఉద్యోగాలకే ఎసరొస్తదని పోలీసులను హెచ్చరించారు. ఈ ముఖ్యమంత్రి కాదు కదా మిమ్మల్ని ఎవరూ కాపాడలేరన్నారు. శాంతి భద్రతల సమస్య వస్తే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌, డీజీపీ బాధ్యత వహించాల్సి వస్తుందని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నదని గుర్తుంచుకోండని హెచ్చరించారు. మీ దగ్గర స్టేట్‌ ఇంటెలిజెన్స్‌ ఉంటే.. మాకు సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఉన్నదని బెదిరించారు. టీఆర్‌ఎస్‌ను మీరు అడ్డుకొంటారా..? లేక మేమే రోడ్లపైకి వచ్చి అడ్డుకోవాలా..? అంటూ శాంతి భద్రతల సమస్య తలెత్తేలా వ్యాఖ్యానించారు.


logo