సోమవారం 25 జనవరి 2021
Telangana - Dec 28, 2020 , 07:59:18

ఖ‌మ్మం డోల‌మైట్ మైన్‌ను ప్రైవేట్ చేసేందుకు కేంద్రం కుట్ర‌

ఖ‌మ్మం డోల‌మైట్ మైన్‌ను ప్రైవేట్ చేసేందుకు కేంద్రం కుట్ర‌

- ఆందోళనలో మాధారం భూనిర్వాసితులు, కార్మికులు 

- వందేండ్లకు సరిపడ నిల్వలున్న మైన్స్‌పై కేంద్రం నిర్లక్ష్యం

- ఇప్పటికే రూ.వెయ్యి కోట్ల డోలమైట్‌ వైజాగ్‌కు తరలింపు 

ఖమ్మం జిల్లాలో వందేండ్లకు సరిపడా హైగ్రేడ్‌ డోలమైట్‌ ఖనిజం ఉన్న మైన్స్‌ను ప్రైవేటుపరం చేయడానికి కేంద్ర సర్కారు పావులు కదుపుతున్నది. మైన్‌ కర్మాగారంలో పనిచేస్తున్న 160 మంది ఉద్యోగులు, 200 మంది కాంట్రాక్టు కార్మికుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నది. 950 ఎకరాల భూమి ఇచ్చిన రైతాంగం కేంద్రం నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ప్రైవేటుకు అప్పగించాలనే ప్రతిపాదనలు విరమించుకోవాలని కార్మిక సంఘాల నేతలు, స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

కారేపల్లి రూరల్‌: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని మాధారం గ్రామంలో డోలమైట్‌ కర్మాగారాన్ని మూడు దశాబ్దాల క్రితం ప్రారంభించారు. 1989 నుంచి ఉత్పత్తిని మొదలుపెట్టిన ఈ పరిశ్రమ.. ఇప్పటివరకు వెయ్యి కోట్ల విలువైన 85 లక్షల మెట్రిక్‌ టన్నుల డోలమైట్‌ ఖనిజాన్ని విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు తరలించింది. ఈ క్రమంలో గాజువాక గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దిన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం.. తెలంగాణలోని మాధారం గ్రామాన్ని పూర్తిగా విస్మరించింది. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతూ ప్రభుత్వరంగ సంస్థను ప్రైవేటుకు అప్పగించేందుకు పూనుకున్నది. కేంద్రం ఆదేశాల మేరకు మాధారం డోలమైట్‌ మైన్స్‌ను ‘మైన్‌ డెవలపర్‌ కమ్‌ ఆపరేటర్‌ మోడల్‌'కు అప్పగించేందుకు వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ డైరెక్టర్‌ పర్సనల్‌, డైరెక్టర్‌ ఆపరేషన్స్‌ నుంచి ప్రతిపాదనలు పంపారు. ప్రతిపాదనల లేఖ వచ్చిన నాటినుంచి అన్ని కార్మిక సంఘాల నేతలు నిరసన తెలుపుతూ వస్తున్నారు. డోలమైట్‌ కార్మిక సంఘాల నేతల బృందం వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఉన్నతాధికారులను కూడా కలిసి ఈ ప్రతిపాదనలు విరమించుకోవాలని డిమాండ్‌చేసింది.

100 ఏండ్లకు సరిపడ నిల్వలు

30 ఏండ్ల క్రితం మాధారంలో 210 మంది రైతుల నుంచి 950 ఎకరాల భూమిని విశాఖ స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం సేకరించింది. ఈ కర్మా గారంలో 160 మంది ఉద్యోగులు, 200 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. ‘ప్రభుత్వరంగ సంస్థ మా గ్రామానికి వస్తుందంటే మేము భూములు ఇచ్చాం. కానీ ఇప్పుడు ప్రైవేటుపరం చేస్తామనడం సరికాదు’ అని భూ నిర్వాసితులు, గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైగ్రేడ్‌ డోలమైట్‌ ఉన్న మైన్స్‌ను ప్రైవేటుపరం చేయాల్సిన అవసరం ఏమున్నదని వారు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. 

ఏడాది క్రితం వరకు ఉత్పత్తి ఆశాజనకమే

మాధారం డోలమైట్‌ మైన్స్‌లో ఏడాది క్రితం వరకు ఖనిజ ఉత్పత్తి ఆశాజనకంగానే ఉన్నది. ఏడాదికి 50 నుంచి 60 వేల మెట్రిక్‌ టన్నుల డోలమైట్‌ను ఉత్పత్తిచేసి, వైజాగ్‌ స్టీల్‌కు ఎగుమతిచేశారు. కొవిడ్‌, అధిక వర్షాల కారణంగా ఈ ఏడాది అనుకున్న లక్ష్యాన్ని పరిశ్రమ చేరలేకపోయింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం కూడా.. ఉద్దేశపూర్వకంగానే మాధారం డోలమైట్‌ కర్మాగారాన్ని నిర్వీర్యం చేస్తున్నదనే ఆరోపణలు ఉన్నాయి. ఐదేండ్ల క్రితం రూ.150 కోట్లతో ప్లాంటును విస్తరించాలనుకున్నారు. గంటకు 250 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల క్రషర్‌ను 500 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యానికి పెంచే దిశగా పనులను మొదలుపెట్టారు. కానీ, నేటికీ పనులు పూర్తికాకుండా కాలయాపన చేస్తున్నారు. 

మాధారం మైన్‌లో హైగ్రేడ్‌ డోలమైట్‌ 

విశాఖ ఉక్కు కర్మాగారానికి నాణ్యమైన డోలమైట్‌ ఖనిజాన్ని అందిస్తున్న ప్రభుత్వరంగ సంస్థ మాధారం డోలమైట్‌ కర్మాగారం ఒక్కటే. విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీలో ముడి ఇనుమును కరిగించగా వచ్చే వ్యర్థపదార్థాలను తొలగించేందుకు, ఇనుమును కరిగించే కొలుముల తయారీకి ఈ ఖనిజాన్ని వాడుతారు. కర్మాగారంలో కొలిమి నుంచి ఉద్భవించే వేడిని డోలమైట్‌తో తయారైన ఇటుకలే తట్టుకోగలవు. మాధారంలోని డోలమైట్‌కు హైగ్రేడ్‌ రా మెటీరియల్‌గా పేరున్నది. 


logo